కొన్ని విషయాలను ఇతరులకు చెప్పుకుంటేనే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ విషయాలను, సమస్యలను, బాధలను, సంతోషం కలిగించే విషయాలతో పాటుగా ఎన్నో విషయాలను ఒకరితో ఒకరు చెప్పుకుంటారు. నిజానికి ఇలా చెప్పుకోవడం చాలా మంచిది.
ఇది ఇద్దరి మధ్య సంబంధాన్ని మెరుగుపర్చడమే కాకుండా.. మనసులోని బాధను తొలగిస్తుంది. సంతోషాన్నిరెట్టింపు చేస్తుంది. అలాగని అన్ని విషయాలను చెప్తే మీరు తప్పు చేసినట్టే అవుతుంది. అవును కొన్ని పర్సనల్ విషయాలను ఇతరులతో అస్సలు చెప్పుకోకూడదు. దీనివల్ల మీకు మనశ్శాంతి, విజయం దూరమవుతాయి.
24
ఇతరులకు ఎలాంటి విషయాలను చెప్పకూడదు
మీ సంపాదన, డబ్బు
కొంతమంది గొప్పలు చెప్పుకోవడానికి సంపాదన, జీతం గురించి ఇతరుల ముందు బాగా చెప్పుకుంటుంటారు. కానీ సంపాదన గురించి ఇతరులకు చెప్పడం మంచిది కాదు. ఎందుకంటే దీనివల్ల మిమ్మల్ని వారు డబ్బు సహాయం అడగొచ్చు. లేదా మీ మీద అసూయ కలగొచ్చు. దీనివల్ల మీరు సామాజిక జీవితంలో ఇబ్బందులను లేదా వ్యక్తిగతంగా సమస్యలను ఎదుర్కోవాల్సి రావొచ్చు. అందుకే డబ్బు, సంపాదన గురించి ఇతరులకు అస్సలు చెప్పకండి.
మీ ప్లాన్ లు
మీరు భవిష్యత్తులో కొత్త వ్యాపారం లేదా కొత్త ప్రాజెక్టు ప్రారంభించాలనుకుంటే మాత్రం వీటికి సంబంధించిన ఏ విషయాలను ఇతరులతో చెప్పకండి. మీ ప్రణాళికలు మొత్తం పూర్తయ్యే వరకు దీన్ని రహస్యంగానే ఉంచడం మంచిది. ఎందుకంటే ఇతరులు మీ పనిలో తప్పులు వెతికి దానిని ముందుకు సాగనీయకుండా చేస్తారు. లేదా మీకు ప్రతికూల సలహాలు ఇవ్వొచ్చు. కాబట్టి మీరు అనుకున్నపనులు పూర్తయ్యే వరకు ఎలాంటి విషయాలను ఇతరులకు చెప్పకండి.
34
కుటుంబ సమస్యలు
ప్రతి కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు రావడం చాలా కామన్. కానీ మీరు ఈ సమస్యలను కూడా ఇతరులకు చెప్తే వారు మీ కుటుంబం గురించి చెడుగా అనుకునే అవకాశం ఉంది. అంతేకాదు మీ గురించి ఇతరులకు చెడుగా చెప్తారు. దీనివల్ల మీ ఇంట్లో గొడవలు ఇంకా ఎక్కువ అవుతాయి. అలాగే మీ మధ్య దూరం ఏర్పడుతుంది. అందుకే ఇంటి విషయాలను బయటి వ్యక్తులతో చెప్పకండి. సమస్యలు ఏవైనా ఉంటే ఇంట్లోనే పరిష్కరించుకోండి.
మీ బలహీనతలు, సీక్రేట్స్
ప్రతి మనిషికి కొన్ని బలాలు, బలహీనతలు, సీక్రేట్స్ ఉంటాయి. వీటిని ఇతరులకు అస్సలు చెప్పుకోకూడదు. ఎందుకంటే వారు దానిని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది. మీ బలహీనతలు, సీక్రేట్స్ తెలిస్తే వారు మిమ్మల్ని మానసికంగా బాధపెట్టొచ్చు.
మీరు ఎవరికైనా సహాయం చేసినా లేదా ఏదైనా మంచి పనిచేసినా దాని గురించి మీరే గొప్పగా చెప్పుకోవడం మానేయండి. ఇది ఇతరుల దృష్టిలో మిమ్మల్ని చెడ్డవారిలా చూపిస్తుంది. అందుకే ఏ మంచి పని చేసినా దాని గురించి మీకు మీరే గొప్పలు చెప్పడం మానేయండి.