
భార్యాభర్తలన్నాకా గొడవలు, కొట్లాటలు చాలా కామన్. అలాగని ఎప్పుడూ కొట్లాటలే కాకుండా.. అలకలు, ప్రేమ, కేరింగ్ అంటివి కూడా భార్యా భర్తల మధ్య ఖచ్చితంగా ఉంటాయి. వైవాహిక జీవితం ఆనందంగా ముందుకు సాగాలంటే ఇద్దరి మధ్య అండర్ స్టాండింగ్ ఉండాలి.
అలాగే భార్య లేదా భర్త ముందు ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడకూడదో కూడా తెలిసి ఉండాలి. అప్పుడే లైఫ్ ఎలాంటి సమస్యలు లేకుండా ముందుకు సాగుతుంది. అయితే భార్య ముందు భర్త కొన్ని మాట్లాడకూడని విషయాలు ఉన్నాయి. అవి మాట్లాడితే ఇద్దరి మధ్య కొట్లాటలు జరిగి విడిపోయే ప్రమాదం ఉంది. కనుక భార్య ముందు భర్త ఏం మాట్లాడకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
భర్త చేసే మొదటి తప్పు ఇదే. ఈ ఇలాంటి మాటను భార్యతో ఏ భర్తా అనకూడదు. భార్యను తల్లితో లేదా చెల్లి, అక్కతో పోల్చితే అగ్నికి ఆజ్యం పోసినట్టే అవుతుంది. ఎందుకంటే ఏ ఇద్దరు వ్యక్తులు ఒకే విధంగా ఉండరో.. అలాగే ఒకే విధంగా ఆలోచించరు. ప్రతి వ్యక్తి ప్రత్యేకంగానే ఉంటాడు. కాబట్టి ఏ విషయంలో అయినా పోల్చకండి. తప్పు ఏదైనా ఉంటే నేరుగా వారితోనే చెప్పేయండి. ఇలా మీరు పోల్చడం వల్ల మీ ఇద్దరి మధ్య గొడవలు జరగడమే కాకుండా.. మీరు వారిపై కూడా ద్వేషం, కోపం కలుగుతాయి.
‘నీకేమీ అర్థం కాదు, చెప్తే వినవు’ అనే మాటలు కూడా భార్యతో అనకండి. ఎందుకంటే ఇది వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టు అవుతుంది. ఇలా అనేముందు మీరిద్దరూ భార్యాభర్తలు కాబట్టి ఒకే టీమ్ అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. భార్యాభర్తలన్నాకా కలిసి పనిచేయాలి. ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవాలి. అలాగే తక్కువ చేసి మాట్లాడుకోకూడదు. దీనివల్ల మీ మధ్య గొడవలు జరుగుతాయి. దూరం పెరుగుతుంది. ప్రేమ తగ్గుతుంది.
‘ఇంత ఖర్చు చేశావ్, అంత ఖర్చు చేశావ్, ఏ భార్యా నీలా ఇంత ఖర్చు చేయదు’అనే మాటలు మీ భార్యతో అనే ప్రయత్నం చేయకండి. ఇలా మీరు ఖర్చుల గురించి మాట్లాడితే ఆమె తనను మీరు నమ్మడం లేదని అనిపిస్తుంది. డబ్బుల విషయంలో బహిరంగంగానే మాట్లాడటం చాలా ముఖ్యం.
ప్రతి ఖర్చును లిమిట్ చేయడం మంచిది కాదు. ఖర్చును తగ్గించుకోమని ఫోర్స్ చేస్తే ఇబ్బందులు వస్తాయి. ఖర్చులు ఇద్దరం తగ్గించుకుందామని కూర్చొని మాట్లాడండి. మీరు ఖర్చు పెడితూ ఆమెకు ఆంక్షలు పట్టడం సరైంది కాదు. కలిసి బడ్జెట్ గురించి ఆలోచిస్తే డబ్బును ఆదా చేసిన వారు అవుతారు.
మీ భార్యను వేరేవారితో పోల్చడమంటే మీ సంబంధాన్ని మీ చేతులారా నాశనం చేసుకున్నట్టే అవుతుంది. ఎందుకంటే ప్రతి వ్యక్తికి తనదైన శారీరక రూపం ఉంటుంది. అందరూ ఒకేలా ఉండరు. ఇలా మీరు అవమానిస్తే వారు మీకు దూరమవుతారు. మీ బంధం బాగుండాలంటే మాత్రం మీ భార్య ఎలా ఉందో అలాగే అంగీకరించండి. వేరే వారితో పోల్చే ప్రయత్నం చేయకండి.
ఫ్రెండ్ షిప్ అయినా, పెళ్లి జీవితమైనా ఒకే ఒక్క రీజన్ తో క్షణకాలంలో ముగిసిపోతుంది. అందుకే కొన్ని మాటలను అస్సలు అనకూడదు. ఏ భర్త అయినా సరే భార్యతో ‘నిన్ను పెళ్లి చేసుకోవడానికి ముందే నేను హ్యాపీగా ఉన్నానని’ అస్సలు అనకండి. దీనివల్ల మీ భార్య ఎంతో బాధపడుతుంది.
గతాన్ని వదిలేసి ప్రస్తుతం గురించి ఆలోచించండి. ఏదైనా సమస్య ఉంటే కలిసి పరిష్కరించుకోండి. అప్పుడే మీ జీవితంలో ఆనందం వస్తుంది. రిలేషన్ షిప్ స్ట్రాంగ్ గా ఉండాలంటే ఒకరినొకరు గౌరవించుకోవాలి. ప్రేమించుకోవాలి. ఇద్దరి మధ్య అవగాహన ఉండాలి. ముఖ్యంగా అవతలి వ్యక్తిని బాధపెట్టే మాటలను అస్సలు మాట్లాడకూడదు. ఇది మీ సంబంధాన్ని నాశనం చేస్తుంది.