పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఆరోగ్యకరమైన ఆహారం తినడం చాలా అవసరం. కానీ, మనం ఎంత మంచి ఫుడ్ పెట్టినా కూడా చాలా మంది పిల్లలు సరిగా తినరు. వాళ్లతో ఎలాగైనా తినిపించాలనే ఉద్దేశంతో చాలా మంది పేరెంట్స్.. వారికి ఫోన్, టీవీలు చూపించి మరీ తినిపిస్తూ ఉంటారు. ఫోన్ చూస్తే ఏమైంది.. తిన్నారా లేదా అనేది మాత్రమే చూసుకుంటారు. కానీ, అలా టీవీలు, ఫోన్లు చూస్తూ ఫుడ్ తినడం వల్ల చాలా నష్టాలు కలుగుతాయని మీకు తెలుసా? పేరెంట్స్ కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఇది..
25
బరువు పెరుగుతారా?
తినేటప్పుడు మొబైల్ ఫోన్ చూస్తే మన దృష్టి మొత్తం ఫోన్ మీదే ఉంటుంది. దాంతో మనం ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం అన్న సంగతి కూడా తెలియదు. ఇలా తెలియకుండానే ఎక్కువ తినేస్తాం. దీని వల్ల పిల్లలు తక్కువ వయస్సులోనే అధిక బరువు సమస్యకు గురవుతారు. ఇది “ఊబకాయం”గా మారుతుంది. చిన్న వయసులోనే ఈ మధ్యచాలా మంది పిల్లలు అధిక బరువు పెరిగిపోతున్నారు. దీనికి ఇది కూడా ఒక కారణం.
35
జీర్ణ సమస్యలు..
మరొక ప్రధాన సమస్య – జీర్ణం. ఫోన్ చూస్తూ తినే పిల్లలు ఆహారాన్ని సరిగ్గా నమలరు. త్వరగా తినేసేందుకు ప్రయత్నిస్తారు. తిండి సరిగ్గా నమలకపోతే కడుపులో జీర్ణం కష్టమవుతుంది. దాంతో పాటు ఆకలికి మించినంత తిన్నా, తిన్నట్లే అనిపించదు. చివరికి అసంతృప్తి కలుగుతుంది. జీర్ణ సమస్యలు కూడా వస్తాయి.
ఇక తినే సమయాల్లో మొబైల్ చూస్తూ ఉండటం వల్ల తల్లిదండ్రులతో మాట్లాడే సమయమే పోతుంది. పేరెంట్స్ ఏదైనా ప్రశ్న అడిగినా కూడా పిల్లల చెవికి చేరదు. భోజనం చేసే సమయంలో పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడకపోతే ఆ బంధం బలహీనపడుతుంది. పంచుకోవడంలో ఆనందం తగ్గుతుంది.
ఫోన్ చూస్తూ తినడం వల్ల వచ్చే మరో పెద్ద ప్రమాదం – డయాబెటిస్. ఇది చిన్న వయసులోనే వస్తున్న ఆరోగ్య సమస్య. ఎక్కువగా తినడం, శరీరాన్ని కదల్చకపోవడం, సమయానికి నిద్ర లేకపోవడం వంటివే దీనికి ప్రధాన కారణాలు. ఇవన్నీ ఫోన్ వాడకం వల్ల వచ్చే అలవాట్లే కావడం గమనించాలి.
అంతేకాదు, తినేటప్పుడు ఫోన్ లో వీడియోలు చేయడం వల్ల పిల్లల మెదడు తిండి తినడాన్ని ఆస్వాదించడమే మరిచిపోతుంది. ఆహారం అన్నది కేవలం ఆకలిని తీర్చేందుకు మాత్రమే కాదు.. మంచి అనుభూతిని అందిస్తుంది. అలాంటి ఫుడ్ ని ఆస్వాదిస్తూ తినాలి. కానీ.. ఫోన్, టీవీ లాంటివి చూస్తే.. అలాంటివి ఏవీ జరగవు.
ఫోన్ చూస్తూ తినడం వల్ల పిల్లలకు ఆకలి అనేది తెలీదు. కేవలం ఆ ఫోన్, టీవీల కోసమే తింటాం అని అంటారు. ఇది ఒక మానసిక అలవాటుగా మారిపోతుంది. ఈ అలవాటు ఒక్కసారి వచ్చేస్తే.. దానిని మార్చడం చాలా కష్టం.
55
ఈ అలవాటు ఎలా మాన్పించాలి?
పేరెంట్స్ చేయాల్సింది ఇదే..
పిల్లలతో కలిసి పేరెంట్స్ కూడా భోజనం చేయాలి. అంతేకాదు.. టీవీ, ఫోన్ లేని వాతావరణంలో తినడం అలవాటుగా చేయండి.తినే సమయంలో కథలు చెప్పండి, పాఠశాల విషయాలు మాట్లాడండి.మొదట కొన్ని రోజులు అలవాటు మార్చడం కష్టం అనిపించవచ్చు. కానీ వారి భవిష్యత్తు కోసం ఇది చాలా అవసరం.