Parenting: మీ పిల్లలకు ఈ అలవాటు ఉందా?

Published : Oct 05, 2026, 12:41 PM IST

Parenting: ప్రతి చిన్న విషయానికీ పిల్లలు మీ అనుమతి అడుగుతున్నారా? అడగడం మంచిదే. ఇది మామూలు అలవాటే కావొచ్చు. కానీ సొంతంగా నిర్ణయం తీసుకోగలుగుతున్నారా? అనేది గుర్తించండి. భయపడితే మాత్రం అసలు కారణమేంటో తెలుసుకోండి.

PREV
17
మీ పిల్లలకు ఈ అలవాటు ఉందా?

అమ్మా.. ఈ డ్రెస్ వేసుకోవచ్చా?, నాన్నా.. ఇది చేస్తే బాగుంటుందా?, నేను ఇలా చేస్తే ఓకేనా?.. పిల్లలు ఇలా అడగడం చాలా సహజం. తాము చేస్తున్న పని సరైందో కాదో తెలుసుకోవడానికి తల్లిదండ్రుల సలహా తీసుకుంటారు. కానీ ప్రతి చిన్న నిర్ణయానికీ పేరెంట్స్‌నే అడగడం, వాళ్లు ఓకే అంటేనే ముందుకు వెళ్లడం అలవాటుగా మారితే మాత్రం కాస్త గమనించాలి.

27
తప్పు చేస్తే ఏమవుతుందోననే భయం

తల్లిదండ్రుల అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయని పిల్లలు భావిస్తే.. తప్పు చేయడానికి భయపడే అవకాశం ఉంటుంది. నేను ఇలా చేస్తే అమ్మానాన్నలు ఏమనుకుంటారు? అనే ఆలోచనతో కొత్త విషయాలను ప్రయత్నించకుండా ఉండొచ్చు. భారత్‌లో 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న 466 మందిపై జరిగిన ఒక అధ్యయనంలో కూడా తల్లిదండ్రుల అంచనాలు ఎక్కువగా ఉన్నాయని భావించిన యువతలో.. ఇతరులు తమను తప్పుగా అంచనా వేస్తారేమోననే భయం, అలాగే తప్పులు చేయకూడదనే ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

37
సొంత నిర్ణయం తీసుకునే ధైర్యం తగ్గొచ్చు

పిల్లలు చిన్న వయసులో తల్లిదండ్రులపై ఆధారపడటం సహజమే. అయితే వయసు పెరుగుతున్న కొద్దీ తమకు నచ్చిన విషయాలపై సొంతంగా నిర్ణయం తీసుకోవడం కూడా నేర్చుకోవాలి. అది జరగకుండా..అమ్మానాన్నలకు నచ్చుతుందా? వాళ్లు ఏమనుకుంటారు? అనే ఆలోచనతో ప్రతి విషయంలోనూ అనుమతి కోసం ఎదురుచూస్తే.. పిల్లల్లో సొంత నిర్ణయం తీసుకునే ధైర్యం తగ్గే అవకాశం ఉంటుంది.

47
పేరెంట్స్ మెచ్చుకుంటేనే సంతోషపడటం

చిన్న పిల్లలు తాము వేసిన డ్రాయింగ్ బాగుందా, చేసిన పని సరిగ్గా ఉందా అని అడుగుతుంటారు. పేరెంట్స్ మెచ్చుకుంటే వాళ్లకు ఆనందంగా ఉంటుంది. ఇది సాధారణమే. కానీ రాను రాను అమ్మానాన్నలు మెచ్చుకుంటేనే నేను బాగా చేశాను అనే ఆలోచన బలపడితే సమస్య కావచ్చు. తాము ఎంచుకున్న విషయం పేరెంట్స్‌కు నచ్చకపోతే చాలా బాధపడటం, వెంటనే నిర్ణయం మార్చుకోవడం లేదా అసలు ప్రయత్నించకపోవడం వంటివి కనిపించొచ్చు.

57
నాకు ఏం కావాలి? అనే ఆలోచన తగ్గిపోవచ్చు

కొంతమంది పిల్లలు తమకు ఏం ఇష్టమో ఆలోచించడం కంటే.. తల్లిదండ్రులకు ఏది నచ్చుతుందో ఆలోచించడం మొదలుపెడతారు. ఉదాహరణకు.. తమకు ఒక హాబీ ఇష్టంగా ఉన్నా, పేరెంట్స్ మరోదాన్ని మెచ్చుకుంటే దానినే ఎంచుకోవచ్చు. చదువులోనూ ఇదే పరిస్థితి రావచ్చు. తాము ఏం చేయాలనుకుంటున్నారనే దానికంటే.. అమ్మానాన్నలు నన్ను మెచ్చుకోవాలంటే ఏం చేయాలి? అనే ఆలోచన ఎక్కువ కావచ్చు.

67
పెద్దయ్యాక కూడా పేరెంట్స్‌నే అడిగితే?

ఈ అలవాటు చిన్నతనంతోనే ఆగిపోవాల్సిన అవసరం లేదు. కొందరు పెద్దయ్యాక కూడా ఉద్యోగం విషయంలో, సిటీకి వెళ్లడం, పెళ్లి చేసుకోవడం వంటి ముఖ్యమైన నిర్ణయాల సమయంలో తల్లిదండ్రుల అభిప్రాయం కోసం ఎదురుచూస్తుంటారు. తల్లిదండ్రులను సలహా అడగడం తప్పు కాదు. అసలు విషయం ఏమిటంటే..వారి అభిప్రాయం విన్న తర్వాత సొంత నిర్ణయం తీసుకోగలుగుతున్నారా? అన్నదే. అమ్మానాన్నలు ఒకటి చెబితే విని, ఆలోచించి తనకు నచ్చిన నిర్ణయం తీసుకోగలిగితే అది మంచిదే. కానీ వాళ్ల మాటకు భిన్నంగా నిర్ణయం తీసుకుంటే భయం, బాధ లేదా అపరాధ భావన కలుగుతుంటే మాత్రం ఆ విషయాన్ని గమనించాలి.

77
పిల్లలకు ఏం నేర్పాలి?

పిల్లలకు ప్రతి విషయాన్ని తల్లిదండ్రులే నిర్ణయించాల్సిన అవసరం లేదు. వయసుకు తగ్గ చిన్న చిన్న నిర్ణయాలను వాళ్లే తీసుకునే అవకాశం ఇవ్వాలి. ఇది చేయి అని చెప్పడం కంటే.. నీకు ఏది బాగుంటుందని అనిపిస్తోంది? అని అడగొచ్చు. పిల్లలు తప్పు నిర్ణయం తీసుకున్నా వెంటనే మందలించకుండా..దాని నుంచి ఏం నేర్చుకున్నారో మాట్లాడాలి. ఎప్పుడూ సరైన నిర్ణయం తీసుకోవడమే ఆత్మవిశ్వాసం కాదు. తప్పు జరిగినా పర్లేదు.. దాన్ని సరిదిద్దుకుని మళ్లీ ప్రయత్నించగలను అనే నమ్మకం పిల్లల్లో రావడం ముఖ్యం.

అందుకే మీ పిల్లలు ప్రతి చిన్న విషయానికీ ఇది ఓకేనా? అని అడుగుతున్నారంటే.. వెంటనే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ వారు సొంతంగా నిర్ణయం తీసుకోవడానికి భయపడుతున్నారా? తప్పు చేస్తే తీవ్రంగా బాధపడుతున్నారా? అనే విషయాలను మాత్రం తల్లిదండ్రులు గమనించడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories