Pregnancy Symptoms: మహిళలు గర్భం దాల్చిన ప్రారంభంలో వారి శరీరంలో అనేక మార్పులు వస్తాయి. ఈ సంకేతాలను సరిగ్గా అర్థం చేసుకుంటే, వైద్య పరీక్షలకు ముందే గర్భధారణను ప్రాథమికంగా గుర్తించే అవకాశం ఉంటుంది.
ప్రెగ్నెన్సీ వచ్చిందంటే మొట్టమొదట వచ్చే సంకేతం పీరియడ్స్ ఆగిపోవడం. క్రమం తప్పకుండా వచ్చే పీరియడ్స్ అయ్యే మహిళల్లో లేటు అయితే గర్భం దాల్చినట్లుగా భావించవచ్చు, అయితే మానసిక ఒత్తిడి లేదా ఇతర ఆరోగ్య మార్పుల వల్ల కూడా ఇలా జరిగే అవకాశం ఉంది. దీనితో పాటు వాంతులు రెండో నెల నుండే ప్రారంభమవ్వచ్చు. దీన్నే మార్నింగ్ సిక్‍నెస్ అంటారు. పేరుకు తగ్గట్టుగా కేవలం ఉదయం మాత్రమే కాకుండా రోజులో ఏ టైంలోనైనా ఇబ్బంది పెట్టవచ్చు. ఈ శారీరక మార్పులను గమనించడం ద్వారా ప్రెగ్నెన్సీ ప్రాథమికంగా అంచనా వేయవచ్చు.
24
హార్మోన్ల మార్పులు
గర్భధారణ ప్రారంభంలో హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల శారీరక మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా రొమ్ములు సున్నితంగా మారి ఉబ్బినట్లు లేదా భారంగా అనిపించడం, అలాగే వాటి చుట్టూ ఉండే చర్మం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అదే సమయంలో శరీరంలో ప్రొజెస్టెరాన్ స్థాయిలు పెరగడం వల్ల విపరీతమైన నీరసం, నిద్రమత్తు ఉంటాయి. మరోవైపు, పెరుగుతున్న గర్భాశయం మూత్రాశయంపై ఒత్తిడిని కలిగించడం వల్ల తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది, ఇది గర్భిణుల్లో కనిపించే అత్యంత సాధారణ లక్షణం.
34
ఇంప్లాంటేషన్ బ్లీడింగ్
కొంతమంది మహిళలకు పీరియడ్స్ సమయంలో కొద్దిగా రక్తస్రావం అవుతుంది. దీన్ని 'ఇంప్లాంటేషన్ బ్లీడింగ్' అంటారు. ఇది పీరియడ్స్ రక్తస్రావం కన్నా చాలా తక్కువగా, గులాబీ లేదా గోధుమ రంగు చుక్కల్లా కనిపిస్తుంది. దీనితో పాటు కడుపులో కొద్దిగా నొప్పి కూడా ఉండొచ్చు. హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల ప్రవర్తనలో మార్పులు వస్తాయి. కొన్నిసార్లు సంతోషంగా, మరికొన్నిసార్లు కోపంగా లేదా విచారంగా అనిపిస్తుంది. కొన్ని వాసనలు పడకపోవడం, కొన్ని పదార్థాలనే తినాలనిపించడం వంటివి కూడా గర్భధారణ లక్షణాలే.
ఈ లక్షణాలు కనిపించినప్పుడు, 'ప్రెగ్నెన్సీ కిట్' ఉపయోగించి ఇంట్లోనే పరీక్ష చేసుకోవడం మంచిది. ఉదయం మొదటి మూత్రంతో పరీక్షిస్తే కచ్చితమైన ఫలితాలు వస్తాయి. ఒకవేళ ఫలితం పాజిటివ్ వస్తే, వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. సరైన సమయంలో వైద్య సహాయం తీసుకోవడం తల్లి, బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచుతుంది. డాక్టర్ సూచించిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.