చిన్న పిల్లలకు కడుపు, జీర్ణ సమస్యలు తరచూ రావడం సాధారణం విషయం. కానీ కొంతమంది తల్లిదండ్రులకు ఈ సమస్యలు అర్థం కావు. దీనివల్లే పిల్లల ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. ఎందుకంటే పుట్టిన తర్వాత ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చాక మన దగ్గర డాక్టర్లు, నర్సులు ఉండరు. అందుకే వారి ప్రతి కదలికను మీరు అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. డాక్లర్లు, ఆరోగ్య నిపుణుల ప్రకారం.. పిల్లల్లో జీర్ణ సమస్యలు సర్వసాధారణం. తరచూ పాలు తాగిన తర్వాత కక్కడం, పాలను తాగకపోవడం, ఆకలి లేకపోవడం, వాంతులు, విరేచనాలు లేదా మలబద్ధకం వంటి సమస్యలు జీర్ణ సమస్యల లక్షణాలు. ఈ సమస్యలు మరీ ఎక్కువగా ఉన్నప్పుడు వెంటనే హాస్పటల్ కు తీసుకెళ్లడం చాలా అవసరం. అసలు చిన్న పిల్లలకు జీర్ణ సమస్యలు ఉన్నప్పుడు ఎలా చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..
వాంతులు
శిశువు ఉదర సంబంధిత సమస్యలకు వాంతులు కూడా ఒక కారణమేనంటున్నారు నిపుణులు. చాలా సార్లు పిల్లలు పాలు తాగిన తర్వాత లేదా పాలు తాగేటప్పుడు కొద్ది మొత్తంలో పాలను బయటకు తీస్తారు. సాధారణంగా శిశువు 5 నుంచి 10 మిల్లీలీటర్ల కంటే తక్కువ పాలను బయటకు కక్కుతారు. దీనికి కారణం పిల్లలు పాలను ఫాస్ట్ గా తాగడం, అతిగా తాగడం లేదా పాలతో పాటుగా నోట్లోకి గాలి వెళ్లడం వల్ల వాంతులు అవుతాయి. అయితే పిల్లలు పదేపదే వాంతులు చేసుకుంటే వీరికి జీర్ణకోశ సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. దీనిగురించి డాక్టర్ తో ఖచ్చితంగా మాట్లాడాలి.
నీళ్ల విరేచనాలు
సాధారణంగా చిన్న పిల్లల మలం వదులుగా, జిగటగా ఉంటుంది. నవజాత శిశువులు రోజులో చాలా సార్లు పాలు తాగుతారు. అయితే ప్రతి ఫీడ్ తర్వాత లేదా 24 గంటల్లో మూడు లేదా అంతకంటే ఎక్కువసార్లు సన్నని లేదా నీళ్ల మాదిరిగానే మలం పోతుంటే.. నీళ్ల విరేచనాలని అర్థం చేసుకోండి. ఈ విరేచనాలు పిల్లలలో నీటి నష్టాన్ని కలిగిస్తాయి. దీనివల్ల పిల్లల నోరు పొడిబారడం, కన్నీళ్లు లేకపోవడం, మూత్రం సరిగా లేకపోవడం, జ్వరం లేదా శ్లేష్మం లేదా మలం లో రక్తపు చుక్కలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే హాస్పటల్ కు వెళ్లండి.
మలబద్ధకం
నవజాత శిశువులలో మలబద్ధకం సమస్య కూడా ఎక్కువగా కనిపిస్తుంది. పిల్లలు మోషన్స్ పోవడంలో ఇబ్బంది పడటం మంచిది కాదు. ఎందుకంటే ఇది వారికి ఎంతో ఇబ్బందిని కలిగిస్తుంది. పిల్లలు మృదువైన మలవిసర్జన చేస్తే వారికి మలబద్ధకం సమస్య లేనట్టే. కానీ మీ బిడ్డ వరుసగా మూడు రోజులకు మించి మలవిసర్జన చేయకపోతే మాత్రం ఖచ్చితంగా హాస్పటల్ కు వెళ్లండి.