షుగర్ పేషెంట్ల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. కొన్ని సంవత్సరాల క్రితం 45 ఏళ్లు దాటిన వారిని మాత్రమే షుగర్ టెస్ట్ చేయించుకోమని సలహా ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. వయసుతో సంబంధం లేకుండా అందరు షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు. దీనికి మొదటి కారణం లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్.
జీవన విధానం
ఒకప్పుడు ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే తినేవారు. ఎక్కువశాతం ఇంటి ఫుడ్ ఇష్టపడేవారు. తిన్న ఆహారానికి తగ్గుట్టుగా శారీరక శ్రమ ఉండేది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. జీవన విధానం మారిపోయింది. తినే ఫుడ్ ఎక్కువైంది. శ్రమ తక్కువైంది. దీంతో తినే ఆహారమంతా కొవ్వుగా మారి శరీరంలో పేరుకుపోతోంది.
అధిక కొవ్వు
3 పూటల ఆహారం తినడంతో పాటు స్నాక్స్ ఇతర పదార్థాలు కూడా తినడం సాధారణం అయిపోయింది. ఆకలి అయినా కాకపోయినా.. తింటున్నాం. దీని వల్ల శరీరంలో కొవ్వుశాతం పెరిగిపోతోంది. దీనికితోడు శారీరక శ్రమ లేకపోవడం, కనీస వ్యాయామాలు చేయకపోవడం, కూర్చొని చేసే ఉద్యోగాల కారణంగా షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలు పెరిగిపోతున్నాయి.
పేరెంట్స్ కి షుగర్ ఉంటే పిల్లలకు వస్తుందా?
తల్లిదండ్రుల్లో ఒకరికి మధుమేహం వచ్చినా పిల్లలకు వచ్చే అవకాశం 60 శాతం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తల్లికి, తండ్రికి ఇద్దరికీ షుగర్ వ్యాధి ఉంటే వారి పిల్లలకు 90శాతం ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందంటున్నారు.
మధుమేహాన్ని ఎలా నివారించాలి?
- కూర్చొని పని చేయడం వల్ల శరీర కదలికలు ఆగిపోతాయి. దీనివల్ల బరువు పెరుగుతారు. ఇది కూడా మధుమేహానికి కారణం అవుతుంది. కాబట్టి ప్రతి గంటకు లేచి నడవడం మంచిది.
- కడుపు నిండిన తర్వాత ఎక్కువగా తినడం మానుకోవాలి. రాత్రి 7 నుంచి 8 గంటలలోపు తినడం మంచిది. ఉదయం పూట ఆహారాన్ని విస్మరించకూడదు.
- రాత్రి బాగా నిద్రపోవాలి. రాత్రి మేల్కొని ఉంటే రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది.
- మానసిక ఒత్తిడి కూడా షుగర్ వ్యాధికి కారణం. కాబట్టి మానసిక ఒత్తిడిని తగ్గించే యోగా, ధ్యానం, వ్యాయామం చేయవచ్చు.
- తిన్న తర్వాత 10 నిమిషాలు నడవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.