సాధారణంగా చాలామంది పిల్లలు రాత్రిపూట సరిగ్గా నిద్రపోరు. తరచూ లేస్తుంటారు. లేదా లేటుగా నిద్రపోతుంటారు. దానివల్ల పిల్లల ఆరోగ్యంతో పాటు.. తల్లిదండ్రుల మెంటల్ హెల్త్ కూడా దెబ్బతింటుంది. మరి పిల్లలు చక్కగా నిద్రపోవాలంటే పేరెంట్స్ ఏం చేయాలో ఇక్కడ చూద్దాం.
నిద్ర ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో మనకు తెలుసు. ముఖ్యంగా పిల్లల ఎదుగుదలలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. నిద్రలో విడుదలయ్యే గ్రోత్ హార్మోన్ ఎముకలు, కండరాల బలోపేతానికి సహాయపడుతుంది. పిల్లలకు వయసును బట్టి తగినంత నిద్ర లేకపోతే ఎదుగుదల సరిగ్గా ఉండకపోవచ్చు. దానివల్ల పేరెంట్స్ మెంటల్ హెల్త్ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సమస్యకు చెక్ పెట్టడం అవసరం.
26
పిల్లల నిద్రను ప్రభావితం చేసే అంశాలు
పిల్లల నిద్రను చాలా విషయాలు ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా టీవీ, ఫోన్, ట్యాబ్ వంటివి ఎక్కువగా చూడటం వల్ల పిల్లలు సరిగ్గా నిద్రపోరు. అంతేకాదు ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవడం లేదా రోజంతా శక్తిని వినియోగించకపోవడం, వాతావరణ మార్పులు, చదువుకు సంబంధించిన ఒత్తిడి, భయాల వంటివి పిల్లల్లో మెలటోనిన్ (నిద్రకు సహాయపడే ప్రధాన హార్మోన్) ఉత్పత్తిని తగ్గిస్తాయి. మరి పిల్లలు చక్కగా నిద్రపోవాలంటే ఏం చేయాలో ఇక్కడ చూద్దాం.
36
పిల్లలు సరిగ్గా నిద్రపోవాలంటే ఏం చేయాలి?
పిల్లలు చక్కగా నిద్రపోవాలంటే తల్లిదండ్రులు కొన్ని విషయాలపై కచ్చితంగా శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా నిద్ర సమయం. అంటే ప్రతి రోజు ఒకే సమయానికి పడుకొని.. ఒకే సమయానికి నిద్రలేచేలా అలవాటు చేయాలి. దానివల్ల శరీరానికి ఒక బయోక్లాక్ ఏర్పడుతుంది. నిద్రకు ముందు మొబైల్, టీవీ వంటి డివైజ్‌లకు దూరంగా ఉండేలా చూసుకోవాలి. వాటిలోని బ్లూ లైట్ మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది.
పిల్లలు నిద్రపోయే గది చాలా ప్రశాంతంగా ఉండాలి. ఎలాంటి సౌండ్స్ ఉండకూడదు. చిన్న బెడ్ లైట్, కాటన్ దుప్పట్ల వంటివి పిల్లలు సౌకర్యంగా నిద్రపోవడానికి సహాయపడతాయి. పిల్లలకు నచ్చిన బొమ్మను వారి పక్కన పెట్టడం, కథలు చెప్పడం, జోల పాటలు పాడటం వారికి హాయినిస్తాయి. కొంతమంది పిల్లలు కొన్ని భయాలవల్ల సరిగ్గా నిద్రపోరు. అప్పుడు వారికి ఏ భయాలు ఉన్నాయో సున్నితంగా అడిగి తెలుసుకోవాలి. ఏం కాదు. అన్నీ మేము చూసుకుంటామనే భరోసా కల్పించాలి.
56
ఆహారపు అలవాట్లు
పిల్లల నిద్రపై ఆహారపు అలవాట్లు కూడా తీవ్ర ప్రభావం చూపిస్తాయి. నిద్రపోయే ముందు ఎక్కువగా తినడం మంచిదికాదు. ముఖ్యంగా జంక్ ఫుడ్. ఇది అలసటను పెంచుతుంది. గ్యాస్ లేదా అసిడిటీ వంటి సమస్యలకూ దారితీస్తుంది. పిల్లలకు రాత్రిపూట మితంగా తేలికపాటి ఆహారం ఇవ్వడం మంచిది. ఇది మెరుగైన నిద్రకు సహాయపడుతుంది.
66
ఫైనల్ గా
పిల్లలు ఆరోగ్యంగా ఎదగాలంటే.. తల్లిదండ్రులు కూడా ప్రశాంతంగా, వారికి సపోర్ట్ చేసే విధంగా ఉండాలి. పేరెంట్స్ ఎప్పుడూ కోపంగా, ఒత్తిడి పెంచేలా ఉంటే పిల్లలు సంతోషంగా, స్థిరంగా ఉండలేరు. కాబట్టి పేరెంట్స్ ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. రాత్రిపూట పిల్లలతో కొంత సమయం గడపాలి. వారికి కథలు చెప్పడం లేదా వారితో మనసువిప్పి మాట్లాడటం వంటివి చేయడం ద్వారా కూడా వారు త్వరగా నిద్రపోతారని అధ్యయనాలు చెబుతున్నాయి.