Abhinandan Varthaman: 2019 బాలకోట్ దాడుల అనంతరం పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్-16 (F-16) యుద్ధ విమానాన్ని కూల్చివేసి, దేశవ్యాప్తంగా హీరోగా నిలిచిన ఐఏఎఫ్ మాజీ గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్ధమాన్ భారత వైమానిక దళానికి గుడ్‌బై చెప్పారు.
భారత వైమానిక దళానికి (IAF) చెందిన మాజీ గ్రూప్ కెప్టెన్, వీర్ చక్ర అవార్డు గ్రహీత అభినందన్ వర్ధమాన్ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. వైమానిక దళంలో ఏకంగా 22 ఏళ్ల పాటు విశేష సేవలందించిన ఆయన, ఐఏఎఫ్ నుంచి ముందస్తు రిటైర్మెంట్ తీసుకున్నారు. ఇప్పుడు ఆయన ప్రైవేట్ కమర్షియల్ పైలట్‌గా తన కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు.
25
గోవా రీజనల్ ఎయిర్‌లైన్ FLY91లో పైలట్‌గా చేరిక
గోవా కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ప్రాంతీయ ఎయిర్‌లైన్ FLY91లో అభినందన్ వర్ధమాన్ పైలట్‌గా చేరారు. ఈ విషయాన్ని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ న్యూస్ ఏజెన్సీ నివేదించింది. వర్ధమాన్ ఆగస్టు నెలలోనే ఈ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌లో చేరినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. అయితే ఈ విషయంపై అభినందన్ వర్ధమాన్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఉద్యోగుల వ్యక్తిగత వివరాలను వెల్లడించడం వారి ప్రైవసీకి సంబంధించిన విషయమని, అందుకే ఏమీ చెప్పలేమని FLY91 ప్రతినిధి వ్యాఖ్యానించారు.
35
FLY91 ఎయిర్‌లైన్ వివరాలు
FLY91 ఎయిర్‌లైన్స్ తన విమాన సర్వీసులను ఇటీవలే మార్చి 2024లో ప్రారంభించింది. ప్రస్తుతం ఈ సంస్థ వద్ద ఆరు ATR 72-600 విమానాల ఫ్లీట్ ఉంది. ఈ రీజనల్ ఎయిర్‌లైన్‌కు గోవా, హైదరాబాద్ నగరాలు ప్రధాన స్థావరాలుగా పనిచేస్తున్నాయి. ఇక్కడి నుంచే దేశంలోని వివిధ ప్రాంతాలకు విమానాలు నడుస్తున్నాయి.
ఫిబ్రవరి 2019లో పుల్వామాలో సిఆర్‌పిఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన దారుణ తీవ్రవాద దాడిలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. దానికి ప్రతీకారంగా ఫిబ్రవరి 26, 2019న భారత వైమానిక దళం పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉన్న జైషే మహమ్మద్ ఉగ్రవాద శిక్షణ శిబిరంపై మెరుపు దాడులు చేసింది. మరుసటి రోజు, అంటే ఫిబ్రవరి 27న పాకిస్తాన్ యుద్ధ విమానాలు భారత వైమానిక సరిహద్దుల్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించాయి. ఆ సమయంలో వింగ్ కమాండర్‌గా ఉన్న అభినందన్ వర్ధమాన్ శ్రీనగర్‌లోని 51 స్క్వాడ్రన్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ మిగ్-21 బైసన్ ఫైటర్ జెట్‌లో ఆకాశంలోకి దూసుకెళ్లారు.
55
పాక్ ఎఫ్-16 కూల్చివేత, వీర్ చక్ర పురస్కారం
గగనతలంలో జరిగిన తీవ్ర పోరాటంలో అభినందన్ వర్ధమాన్ శత్రుదేశానికి చెందిన అత్యంత శక్తివంతమైన ఎఫ్-16 ఫైటర్ జెట్‌ను విజయవంతంగా కూల్చివేశారు. ఆ సమయంలో ఆయన నడుపుతున్న మిగ్-21 బైసన్ విమానం కూడా దెబ్బతినడంతో ఆయన పారాచూట్ సహాయంతో కిందకు దూకాల్సి వచ్చింది. పాకిస్తాన్ ఆక్రమిత భూభాగంలో పడటంతో పాక్ సైన్యం ఆయనను అదుపులోకి తీసుకుంది. దౌత్యపరమైన, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా మూడు రోజుల తర్వాత మార్చి 1, 2019 రాత్రి పాకిస్తాన్ ఆయనను విడుదల చేసింది. ఈ వీరోచిత పోరాటానికి గాను 2021లో భారత ప్రభుత్వం ఆయనకు మూడో అత్యున్నత యుద్ధ సమయ శౌర్య పురస్కారం 'వీర్ చక్ర' అందజేసి గౌరవించింది. ఆ తర్వాత ఆయన గ్రూప్ కెప్టెన్‌గా పదోన్నతి పొందారు.