ఇటీవల ఇండియాలోని కశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడి తీవ్ర కలకలం రేపింది. పహల్గాంలోని మినీ న్యూజిలాండ్ గా పేరుగాంచిన బైసరన్ వ్యాలీలో ఉగ్రవాదులు అమాయక టూరిస్ట్ లపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఉగ్రదాడి తరువాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రెండు దేశాల అణు సామర్థ్యాలపై ప్రపంచ మీడియా ఆసక్తిగా వార్తలు వెలువడిస్తున్నాయి. ఈ క్రమంలో 2023లో విడుదలైన ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ (FAS) నివేదికలో పాకిస్థాన్ అణు ఆయుధాల విషయంలో కీలక వివరాలు వెల్లడయ్యాయి.
ఈ నివేదిక ప్రకారం... 2023 నాటికి పాకిస్థాన్ వద్ద సుమారు 170 అణు ఆయుధాలు ఉన్నాయని అంచనా. తాజా సమాచారం ప్రకారం ఈ సంఖ్య 172కి చేరింది. అయితే పాకిస్థాన్ ఇంకా భారత్ కంటే వెనుకబడ్డ దేశంగా ఉందని, భారత్ వద్ద సుమారు 180 అణు ఆయుధాలు ఉన్నాయని పేర్కొంది.
పాకిస్థాన్ సంవత్సరానికి సుమారు 14 నుంచి 27 కొత్త అణు ఆయుధాలను తయారు చేసే ప్రయత్నంలో ఉందని నివేదిక తెలిపింది. ముఖ్యంగా, పాకిస్థాన్ మిరాజ్ III మరియు మిరాజ్ V వంటి ఫైటర్ జెట్ లను అణు ఆయుధాల పంపిణీకి వినియోగిస్తోంది. ఈ విమానాలు రెండు ప్రధాన ఎయిర్ బేస్‌లలో ఉన్నాయని పేర్కొనగా, మస్రూర్ ఎయిర్ బేస్ (కరాచీ సమీపంలో) వాటిలో ఒకటిగా వివరించింది. పాకిస్థాన్ తన అణు ఆయుధాల ఒక భాగాన్ని ఇక్కడే దాచి ఉండవచ్చని అంచనా.
ఇక మరోవైపు జమ్మూ కాశ్మీర్‌లోని ఎల్వోసి వెంబడి పాకిస్థాన్ సైన్యం ఐదోరోజు కూడా కాల్పులకు పాల్పడింది. ఈ కాల్పులు కుప్వారా, బారాముల్లా మరియు అఖ్నూర్ సెక్టర్లను జరిగాయి. భారత సైన్యం ఈ కాల్పులకు దీటుగా స్పందించినట్టు రక్షణ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
ఈ విధంగా ఒకవైపు అణు ఆయుధాల కలవరం, మరోవైపు సరిహద్దు కాల్పులతో భారత్–పాకిస్థాన్ సంబంధాలు తీవ్ర సంక్షోభ దశలోకి వెళ్లాయి. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి నెలకొంది.