Vice President election: సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఎన్డీఏ అభ్యర్థి సీ.పి. రాధాకృష్ణన్, ఇండియా బ్లాక్ నుంచి మాజీ న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డి పోటీ పడుతున్నారు. వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఎన్డీయే ఓడిపోతే ప్రభుత్వం కూలిపోతుందా?
భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక సెప్టెంబర్ 9న జరగనుంది. రాజ్యసభ, లోకసభ సభ్యుల ఓట్లతో ఫలితం తేలనుంది. ఎన్డీఏ తరఫున మహారాష్ట్ర గవర్నర్ సీ.పి. రాధాకృష్ణన్ పోటీ చేస్తున్నారు. ప్రతిపక్ష కూటమి ఇండియా బ్లాక్ తరఫున మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డి పోటీలో ఉన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ జూలై 21న ఆరోగ్య కారణాల వల్ల రాజీనామా చేయడంతో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.
27
భారత ఉప రాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారు? ఎన్నికల ప్రక్రియ ఏంటి?
భారత ఉపరాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా ఎన్నుకుంటారు. ఇందులో లోక్ సభ, రాజ్య సభ సభ్యులు ఉంటారు. ఈ ఎన్నికల ప్రక్రియను భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. ఓటింగ్ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. అనంతరం సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
ఎలక్టోరల్ కాలేజీ మొత్తం 788 సభ్యులతో ఉంటుంది. వీరిలో రాజ్యసభకు ఎన్నికైన 233 మంది సభ్యులు, 12 మంది నామినేటెడ్ సభ్యులు, లోక్ సభలోని 543 సభ్యులు ఉంటారు. ప్రస్తుతం ఒక లోక్ సభ సీటు, ఐదు రాజ్యసభ సీట్లు ఖాళీగా ఉన్నాయి.
37
మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ఎందుకు రాజీనామా చేశారు?
జూలై 21న జగదీప్ ధన్కడ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆరోగ్య సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. రాజీనామా రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(a) ప్రకారం సమర్పించారు. ధన్కడ్ 2022లో భారత ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు 2019 నుంచి 2022 వరకు ఆయన పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా పని చేశారు.
ఉప రాష్ట్రపతి ఎన్నికల బరిలో ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్
ఉప రాష్ట్రపతి ఎన్నికల బరిలో ఎన్డీఏ అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ పోటీపడుతున్నారు. 68 ఏళ్ల సీ.పి. రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందిన సీనియర్ బీజేపీ నేత. ఆయన గౌండర్-కొంగు వెల్లాలర్ సామాజిక వర్గానికి చెందినవారు. ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్న ఆయన.. మృదుస్వభావి, వివాదాలకు దూరంగా ఉండే నాయకుడిగా గుర్తింపు పొందారు. 1998, 1999లో రెండు సార్లు లోకసభకు ఎన్నికయ్యారు. 2024 జూలై 31 నుంచి మహారాష్ట్ర గవర్నర్‌గా పని చేస్తున్నారు.
57
ఉప రాష్ట్రపతి ఎన్నికల బరిలో ఇండియా బ్లాక్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి
79 ఏళ్ల బి. సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి. 2011లో ఆయన రిటైర్ అయ్యారు. న్యాయవాదిగానూ సేవలందించిన ఆయన, న్యాయమూర్తిగా పలు చారిత్రాత్మక తీర్పులు ఇచ్చారు. బ్లాక్ మనీ కేసులపై విచారణలో యూపీఏ ప్రభుత్వంపై ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. నక్సల్స్‌తో పోరాడటానికి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నియమించిన సల్వా జుడుమ్‌ను రాజ్యాంగ విరుద్ధమని కూడా ఆయన ప్రకటించారు.
67
ఉప రాష్ట్రపతి ఎన్నికలు: రాధాకృష్ణన్ vs సుదర్శన్ రెడ్డి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి?
ఉప రాష్ట్రపతి ఎన్నికలో విజయం సాధించడానికి కనీసం 391 ఓట్లు అవసరం. ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్‌కు ఎన్నికకు కావాల్సిన మెజారిటీ బలం ఉందని అంచనా. బీజేడీ, బీఆర్ఎస్ వంటి కొన్ని పార్టీలు తటస్థంగా ఉండనున్నప్పటికీ, రాధాకృష్ణన్ విజయావకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇండియా బ్లాక్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి అవకాశాలు తక్కువగానే ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
77
ఉప రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి?
ఈ ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థి ఓడిపోతే అది రాజకీయ పరంగా పెద్ద షాక్ అవుతుంది. ముఖ్యంగా రాజ్యసభలో ప్రభుత్వం వ్యవహారాలు నడిపించుకోవడం కష్టమవుతుంది. అయితే ప్రభుత్వం కూలిపోదు. లోకసభలో మెజారిటీ ఆధారంగా ప్రభుత్వం కొనసాగుతుంది. అందువల్ల ఈ ఎన్నిక ఫలితం ప్రభుత్వం భవిష్యత్తును పెద్దగా ప్రభావితం చేయదు.