Petrol Bunk : పెట్రోల్, డీజిల్ కొట్టించుకోడమే కాదు... పెట్రోల్ బంకులను ఇంకెన్ని రకాలుగా వాడుకోవచ్చో తెలుసా?

మనం పెట్రోల్ బంక్ కు కేవలం పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలు కోసమే వెళుతుంటాం. కానీ పెట్రోల్ బంకుల్లో ఎన్నో సౌకర్యాలు ఉంటాయి... వాటిని ఎవ్వరైనా ఉచితంగా పొందవచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం. 

Useful Facilities at Petrol Bunks: Beyond Fuel What You Can Access During Your Travels in telugu akp
Free Services in Petrol Bunks

Petrol Bunk : మనం ఎక్కడికయినా బయటకు వెళితే కొన్ని విషయాల్లో చాలా ఇబ్బందిపడతాం. ముఖ్యంగా ప్రయాణాల్లో ఉండగా వాష్ రూమ్ కు వెళాలంటే నరకమే... మరీముఖ్యంగా మహిళలు చాలా ఇబ్బంది పడతారు. పురుషులు కూడా చాలాసార్లు ఆరుబయటే అన్నీ కానిచ్చేయాల్సి వస్తుంది ... దీనివల్ల పరిశుభ్రతా సమస్యలు రావడమే కాదు మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది.

ఇక ఈ ఎండాకాలంలో ప్రయాణం చేసేవారికి ఆహారం లేకున్నా సరే... కానీ మంచినీరు లేకుంటే ముందుకు సాగలేరు.  కానీ ప్రతిసారి మంచినీటి బాటిల్ కొనాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇలాంటి ఎన్నో సమస్యలు ప్రయాణ సమయంలో ఎదురవుతుంటాయి. 

ప్రయాణ సమయంలో ఇలాంటి ఇబ్బందులకు సరైన పరిష్కార మార్గం పెట్రోల్ బంక్. పెట్రోల్ బంక్ అంటే కేవలం ఇంధనం ఒక్కటే లభిస్తుందని అనుకుంటాం... కానీ చాలామందికి తెలియని అనేక సౌకర్యాలు ఇక్కడ ఉంటాయి. మూత్రశాలలు, మంచినీరే కాదు ఇంకెన్నో సౌకర్యాలు పెట్రోల్ బంకుల్లో లభిస్తాయి. వాటిగురించి ఇక్కడ తెలుసుకుందాం. 
 

Free Services in Petrol Bunks

పెట్రోల్ బంకులో లభించే సౌకర్యాలివే : 

పెట్రోల్ బంకుల్లో కేవలం ఇంధనమే కాదు ఇంకెన్నో సౌకర్యాలుంటాయి. మీరు బంకులో పెట్రోల్, డీజిల్ కొట్టించుకోకున్నా ఈ సౌకర్యాలను పొందవచ్చు.. అదీ ఉచితంగానే.  ఇలా పెట్రోల్ బంకులను ఉపయోగించుకుని సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. 

1. మరుగుదొడ్లు :  

మన ప్రయాణ సమయాల్లో బాగా ఇబ్బందిపడే విషయం మలమూత్ర విసర్జన. ఎక్కువదూరం ప్రయాణించే సమయంలో చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్లు కూడా తరచూ టాయ్ లెట్ కు వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఎక్కడంటే అక్కడ మరుగుదొడ్లు ఉండవు. కాబట్టి ఏ హోటల్ వద్దో లేదంటే దాబా వద్దో వాహనాన్ని నిలిపి వాష్ రూమ్ ఉపయోగించుకుంటారు... ఒక్కోసారి ఇందుకోసం డబ్బులు కూడా చెల్లించాల్సి రావచ్చు.

కానీ ఏ హోటల్ వద్ద ఆగకుండా, ఎలాంటి రుసుములు లేకుండానే పెట్రోల్ బంకుల్లో మరుగుదొడ్లను ఉపయోగించుకోవచ్చు. ప్రయాణికుల కోసం శుభ్రమైన మరుగుదొడ్లను పెట్రోల్ బంకుల్లో అందుబాటులో ఉంచాలి... ఈ సౌకర్యం కల్పించకుమంటే ఫిర్యాదు కూడా చేయవచ్చు. 

2. మంచినీరు : 

ఇక ప్రయాణ సమయంలో మరీముఖ్యంగా వేసవి ప్రయాణాల్లో మంచినీళ్లు లేకుండా ఉండలేం. మండుటెండల నుండి ఉపశమనం కోసం తరచూ నీళ్లు తాగాల్సి ఉంటుంది. కానీ రోడ్డుపై తాగునీరు దొరకడం కష్టం... అదికూడా డబ్బులు చెల్లించి తీసుకోవాలి. 

కానీ ప్రతి పెట్రోల్ బంకుల్లో ఉచితంగానే మంచినీరు లభిస్తుంది. కాబట్టి పెట్రోల్ పట్టించుకునే సమయంలో దాహాన్ని తీర్చుకోవడంతో పాటు బాటిల్ లో నీటిని పట్టుకోవచ్చు. ఇలా పెట్రోల్ బంకుల్లో లభించే మంచినీటితో దాహార్తిని తీర్చుకోవడం ద్వారా ప్రయాణ ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు.
 


Free Services in Petrol Bunks

3. ఫోన్ సౌకర్యం : 

ప్రయాణ సమయంలో సెల్ ఫోన్ అనేది చాలాముఖ్యం. మన క్షేమ సమాచారాన్ని కుటుంబసభ్యులు, స్నేహితులకు చేరవేయాలన్నా, వారినుండి ఏదయినా అత్యవసర సమాచారం పొందాలన్నా ఈ సెల్ ఫోన్ ఆన్ లో ఉండటం చాలాముఖ్యం. కానీ కొన్నిసార్లు ఛార్జింగ్ సౌకర్యం లేకపోవడం వల్ల మొబైల్ స్విచాప్ కావచ్చు. ఇలాంటి సమయంలో మన కుటుంబసభ్యులు కంగారు పడుతుంటారు. 

అయితే ఇలా సెల్ ఫోన్ స్విచాప్ కావడం లేదా మరేదైనా కారణంతో ఫోన్ ఉపయోగించలేకపోతే ఈ పెట్రోల్ బంకులను ఆశ్రయించవచ్చు. అక్కడ ఉచితంగానే ఫోన్ ఉపయోగించుకునే వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ఆ ఫోన్ ద్వారా మన కుటుంబసభ్యులు లేదా స్నేహితులతో మాట్లాడవచ్చు. ఏదైనా సహాయం కావాలన్నా పొందవచ్చు.  

4. ఫస్ట్ ఎయిడ్ కిట్ : 

ప్రయాణ సమయాల్లో చిన్నచిన్న ప్రమాదాలు జరగడం సర్వసాధారణం. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కోసారి ప్రమాదాల బారిన పడుతుంటాం. చాలాసార్లు హాస్పిటల్ వెళ్లి చికిత్స పొందేంత పెద్దవి కాదు... అలాగని ఎలాంటి చికిత్స లేకుండా వదిలేసేంత చిన్నవి కాని గాయాలు అవుతుంటాయి. అలాంటప్పుడు వెంటనే దగ్గర్లోని పెట్రోల్ బంక్ కు వెళ్లి ఫస్ట్ ఎయిడ్ కిట్ ను ఉపయోగించుకోవచ్చు. ప్రతి బంకులోనే తప్పకుండా ప్రథమ చికిత్స కిట్ ను అందుబాటులో ఉంచాలి.  దాన్ని ఫ్రీగానే వాడుకోవచ్చు.

Free Services in Petrol Bunks

5. వాహనాలకు ఉచిత గాలి : 

ఎక్కువ దూరం ప్రయాణించేవారు వాహనాల టైర్లలో సరిపోయేంత గాలి ఉంచుకోవాలి. ఒక్కోసారి గాలి తక్కువగా ఉండటంవల్ల ప్రమాదాలకు దారితీయవచ్చు. కాబట్టి పెట్రోల్ బంకుల్లో ఉచితంగానే వాహనాల టైర్లలో గాలి నింపుకోవచ్చు. 

ఇలా వాహనాల్లో గాలి నింపుకునే సౌకర్యం ఉచితమే. కానీ చాలా బంకుల్లో డబ్బులు డిమాండ్ చేస్తుంటారు. ఇలా డబ్బుల కోసం డిమాండ్ చేస్తే ఫిర్యాదు చేయవచ్చు.  

పెట్రోల్ బంకుల్లో ఏ సౌకర్యం లేకున్నా ఈ నంబర్లకు ఫిర్యాదు చేయండి : 

పైన పేర్కొన్న సౌకర్యాలను పెట్రోల్ బంకుల్లో లేకున్నా, వీటిని ఉపయోగించుకోడానికి డబ్బులు డిమాండ్ చేసినా, ఇతర సమస్యలు ఎదురైనా వెంటనే సంబంధిత సంస్థకు ఫిర్యాదు చేయవచ్చు. 

ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ అయితే 1800233355 

భారత్ పెట్రోలియం అయితే 1800224344 

హెచ్పిసిఎల్ అయితే 18002333555

రిలయన్స్ అయితే 18008919023 నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. 
 

Latest Videos

vuukle one pixel image
click me!