Fake SBI Bank
Fake SBI Bank : బ్యాంకు ఉద్యోగుల పేరిట ఫోన్ చేసి అకౌంట్ వివరాలు సేకరించి మోసాలు చేయడం చూసాం... ఫోన్ కు వచ్చే లింకులు, మెసేజ్ లను ఓపెన్ చేసి డబ్బులు పోగొట్టుకున్నవారిని చూసాం... పోన్ పే, గూగుల్ పే ద్వారా డబ్బులు కొట్టేసే కేటుగాళ్లను చూసాం... ఇలా ఆన్ లైన్ బ్యాంక్ సేవలు అందుబాటులోకి వచ్చాక చాలారకాల మోసాలు వెలుగుచూస్తున్నాయి. ఇదంతా మనకు తెలియకుండా మన బ్యాంక్ డిటెయిల్స్ సేకరించే మోసగించే బ్యాచ్... కానీ మన కళ్లముందే, మన చేతులతోనే డబ్బులిచ్చేలా చేస్తూ ఘరానా మోసాలకు పాల్పడే బ్యాచ్ లు తయారయ్యాయి. అలాంటి ఓ చీటింగ్ ముఠా తమిళనాడులో పట్టుబడింది.
ఆన్ లైన్ లో డబ్బులు కొట్టేయడం కాదు ఏకంగా ఓ నకిలీ బ్యాంకునే ఏర్పాటుచేసి దర్జాగా మోసాలకు పాల్పడున్న ముఠా తమిళనాడులో పట్టుబడింది. ఒకటి రెండ్రోజులు కాదు ఏకంగా మూడు నెలలు ఈ నకిలీ బ్యాంకును నడిపారు కేటుగాళ్లు. ఇలా నకిలీ బ్యాంక్ పెట్టారంటే ఏదో చిన్నాచితక బ్యాంక్ అనుకునేరు... దేశంలోనే అతిపెద్ద బ్యాంకైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అసలు బ్యాంకుకు ఏమాత్రం తీసిపోకుండా ఈ ఎస్బిఐ బ్రాంచ్ ను ఏర్పాటుచేసారు... బ్యాంకింగ్ సేవలను కూడా అచ్చం బ్యాంకులో మాదిరిగానే నిర్వహించారు.
మూడు నెలలపాటు ఈ నకిలీ బ్యాంకును నడిపారంటే ఎంత పకడ్బందిగా నిర్వహించారో అర్థమవుతుంది. చాలామంది ఈ ఫేక్ ఎస్బిఐలో అకౌంట్స్ ఓపెన్ చేసారు... మరికొందరు ఆర్థిక లావాదేవీలు జరిపారు. నిత్యం ఖాతాదారులతో ఈ ఫేక్ బ్రాంచ్ బిజీబిజీగా ఉండేది. కానీ చివరకు ఇది ఫేక్ బ్యాంక్ అని తెలిసి లావాదేవీలు జరిపినవారు ఆశ్చర్యపోయారు. ఇంతకాలంగా కొనసాగినా దీన్ని ఎవరూ ఫేక్ బ్యాంక్ గా గుర్తించలేదంటే ఈ కేటుగాళ్లు ఎంత పకడ్బందీగా నిర్వహించారో అర్థమవుతుంది.
Fake SBI Bank
నకిలీ ఎస్బిఐ బ్యాంకును నడిపిన కేటుగాడు వీడే :
తమిళనాడులో కడలూరు జిల్లా పన్రూటి ప్రాంతంలో కమల్ బాబు నివాసముండేవాడు. ఇతడి తల్లి స్టేట్ బ్యాంక్ ఇండియా బ్యాంకులో పనిచేసేది... రెండేళ్ల కింద ఆమె రిటైర్ అయ్యింది. అయితే తల్లి ఉద్యోగాన్ని తనకు ఇవ్వాలని ఎస్బిఐ ఉన్నతాధికారులను కోరాడు కమల్... అందుకు నిబంధనలు అంగీకరించకపోవడంతో జాబ్ రాలేదు.
ఇలా తనకు ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరిస్తా... మీరిచ్చేదేంటి నేనే సొంతంగా బ్యాంకు పెట్టుకుంటానని అనుకున్నాడు కమల్. చిన్నప్పటినుండి తల్లితో కలిసి బ్యాంకుకు వెళ్లడంవల్ల అతడికి అక్కడ జరిగే కార్యాకలాపాలన్నీ తెలుసు. కాబట్టి అతడికి బ్యాంక్ పేరిట మోసానికి తెరతీసాడు.
ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేసే ఓ స్నేహితుడిని తన నకిలీ బ్యాంక్ కుట్రలో భాగస్వామ్యం చేసాడు. అలాగే రబ్బర్ స్టాంపులు తయారుచేసే మరో స్నేహితుడిని కలుపుకున్నాడు. ఈ ఇద్దరితో కలిసి పన్రూటి ప్రాంతంలో నకిలీ ఎస్బిఐ బ్రాంచ్ ను ఓపెన్ చేసాడు, కంప్యూటర్లు, లాకర్లు, ఉద్యోగులు... ఇలా అసలైన బ్రాంచులకు ఏమాత్రం తీసిపోకుండా ఫేక్ బ్యాంక్ ను ఏర్పాటుచేసాడు కమల్ బాబు.
అసలైన ఎస్బిఐ బ్యాంకులు ఎలా ఉంటాయో అలాగే ఈ ఫేక్ బ్యాంక్ బ్రాంచ్ ను ఏర్పాటుచేసాడు. తన స్నేహితుల సాయంతో ఫేక్ లెటర్ హెడ్స్, స్టాంపులు తయారుచేసుకున్నాడు. ఈ బ్రాంచ్ పేరిట ఓ వెబ్ సైట్ కూడా ఓపెన్ చేసాడు. ఇలా ఖాతాదారులను పూర్తిగా నమ్మించి దాదాపు మూడు నెలల పాటు ఆర్థిక లావాదేవీలు కూడా జరిపాడు కమల్ బాబు.
Bank Fraud
నకిలీ ఎస్బిఐ బ్యాంక్ మోసం ఎలా బైటపడింది..
అసలు బ్యాంక్ మాదిరిగానే అన్ని ఏర్పాటు చేయడంతో ఖాతాదారులకు ఎలాంటి అనుమానం రాలేదు. ఎస్బిఐ ఉన్నతాధికారులుగానీ, స్థానిక పోలీసులు గానీ ఈ నకిలీ బ్యాంకును గుర్తించలేకపోయారు. కానీ ఓ కస్టమర్ కు కమల్ బాబుతో పాటు బ్యాంకులో పనిచేసేవారి తీరుపై అనుమానం వచ్చింది. దీంతో అతడు ఎస్బిఐ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ నకిలీ బ్యాంక్ వ్యవహారం బైటపడింది. ఇంతకాలం తాము చూసింది, బ్యాంకింగ్ వ్యవహారాలు చేసింది ఓ నకిలీ బ్యాంకులో అని తెలిసి పన్రూటి ప్రజలు ఆశ్చర్యపోయారు.
ఎస్బిఐ అధికారుల ఫిర్యాదుమేరకు పోలీసులు రంగంలోకి దిగారు. ఏకంగా ఓ నకిలీ బ్యాంకునే సృష్టించిన కమల్ బాబుతో పాటు అతడి స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. ఆర్థిక మోసాలకు సంబంధించిన కేసులు నమోదుచేసి కటకటాల్లోకి తోసారు.
అయితే ఓ ఫేక్ బ్యాంక్ ను ఏర్పాటుచేసి ఏకంగా మూడు నెలలు నడిపాడంటే కమల్ బాబు ఎంత తెలివైనోడో అర్థం చేసుకోవచ్చు... దీన్ని ఇలా మోసాలకోసం కాకుండా నిజాయితీగా వ్యాపారంలోనో, ఇతర ఏదయినా పనిలోనో ఉపయోగించివుంటే బాగుపడేవాడు. ఎంత పకడ్బందీగా చేసినా తప్పుడుపనులు ఎప్పటికైనా బైటపడతాయని ఈ ఫేక్ ఎస్బిఐ బ్యాంక్ వ్యవహారంతో మరోసారి తేలింది. ప్రజలు కూడా ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి... ఒకటికి రెండుసార్లు నిర్దారించుకోవాలి. లేదంటే కమల్ బాబు లాంటి ఘరానా కేటుగాళ్ల చేతిలో మోసపోవాల్సి వస్తుందని పోలీసులు, ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.