
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా, ఇది మరింత బలపడుతూ రేపటికి (సెప్టెంబర్ 13) అల్పపీడనంగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. దీని ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే వర్షాలు జోరందుకోగా, రాబోయే రోజుల్లో మరింతగా విస్తరించే అవకాశముందని, కొన్ని జిల్లాల్లో వరద ప్రమాదం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తెలంగాణలో వచ్చే నాలుగు రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, నల్గొండ, సిరిసిల్ల, సూర్యాపేట, కామారెడ్డి, మహబూబ్‌నగర్, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, వనపర్తి, గద్వాల, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
వైద్య కళాశాలల అంశంపై ఏపీ హోం మంత్రి అనిత వైకాపాపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ గతంలో శంకుస్థాపన చేసిన మెడికల్ కాలేజీలు ఇప్పటికీ పునాదుల దశలోనే ఉన్నాయని, అటువంటి గోడల మధ్య విద్యార్థులు ఎలా చదువుతారని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన నిధులను గత ప్రభుత్వం సక్రమంగా వినియోగించలేదని ఆమె ఆరోపించారు.
అలాగే, వైద్య కళాశాలల నిర్మాణానికి రూ.5,800 కోట్లు అవసరమని, కానీ జగన్ ఐదేళ్లలో కేవలం రూ.1,450 కోట్లే ఖర్చు చేశారని తెలిపారు. పీపీపీ విధానం ద్వారా కాలేజీలు త్వరగా నిర్మాణం పూర్తి చేసి, నిర్వహణను ప్రభుత్వం చేపడుతుందని చెప్పారు. అయితే ఈ విధానాన్ని అడ్డుకుంటూ జగన్ బెదిరింపులు చేస్తున్నారని విమర్శించారు. అభివృద్ధి ఆపేసి, మళ్లీ అధికారంలోకి వస్తామని జగన్ కలలు కంటున్నారని అనిత మండిపడ్డారు.
భారతదేశ కొత్త ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేసి, ఇండియా కూటమి తరఫున నిలిచిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డిపై విజయం సాధించారు. ఎన్నికల్లో రాధాకృష్ణన్ 452 ఓట్లు పొందగా, సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి.
శుక్రవారం న్యూ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాధాకృష్ణన్‌ను పదవీ ప్రమాణం చేయించారు. దీంతో ఆయన భారతదేశ 15వ ఉపరాష్ట్రపతిగా అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.
ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. అలాగే మాజీ ఉపరాష్ట్రపతులు జగ్‌దీప్ ధన్‌ఖర్, వెంకయ్య నాయుడు, హమీద్ అన్సారీ కూడా పాల్గొన్నారు.
భారత్-చైనా సరిహద్దు వివాదంపై అమెరికా సెనేటర్ బిల్ హాగెర్టీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్ల క్రితం జరిగిన ఘర్షణలో భారత సైనికులను బలహీనపరచడానికి చైనా విద్యుదయస్కాంత ఆయుధాలు ఉపయోగించిందని ఆయన ఆరోపించారు. పరోక్షంగా 2020 గల్వాన్ లోయ ఘర్షణను ప్రస్తావిస్తూ, రెండు దేశాల మధ్య విశ్వాసలేమి ఎప్పటినుంచో కొనసాగుతోందని చెప్పారు.
2020లో గల్వాన్ ఘర్షణలో భారత సైనికులు రాళ్లు, కర్రలతో ఎదుర్కొని 20 మంది జవాన్లు వీరమరణం పొందారు. చైనా తమవైపు ఐదుగురు మాత్రమే మరణించారని చెప్పినా, అసలు సంఖ్య ఎక్కువే అని అంతర్జాతీయ నివేదికలు సూచించాయి. ఈ ఘటన తర్వాత ఇరుదేశాల సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే గతేడాది ఎల్‌ఏసీ వెంబడి గస్తీ ఒప్పందం కుదిరి, ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. 2020 నాటి యథాస్థితి కొనసాగాలని ఇరువురు అంగీకరించడంతో సంబంధాలు కొంత మెరుగుపడ్డాయి.
బీసీసీఐ కొత్త అధ్యక్షుడు ఎన్నిక కాకుండా ఏకగ్రీవంగా ఎంపికయ్యే అవకాశం ఉందని ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ తెలిపారు. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 28న ఎన్నికలు జరగాల్సి ఉన్నా, ఆ పరిస్థితి కనిపించడం లేదని చెప్పారు. నామినేషన్లు ముగిశాక ఎవరు పదవిలోకి వస్తారో తెలుస్తుందని, కానీ ఎన్నికలు జరిగే అవకాశమే లేదని అన్నారు. సభ్యులంతా కూర్చుని నిర్ణయం తీసుకుంటారని, ఆ తర్వాతే పదవులపై స్పష్టత వస్తుందని ఆయన పేర్కొన్నారు.