
Telugu States Rain Alert : నైరుతి రుతుపవనాలు ముందుగానే భారతదేశంలోకి ప్రవేశించాయి... దీంతో భారీ వర్షాలు కురుస్తాయని అందరూ భావించారు. కానీ అందుకు భిన్నంగా చెదురుమదురు జల్లులు మినహా దేశవ్యాప్తంగా అనుకున్నస్థాయిలో వర్షాలు కురవలేవు. సాధారణంగా జూన్ లో భారీ వర్షాలుండాలి... కానీ ఈ నెలలో ఇప్పటివరకు సగటున 31 శాతం తక్కువ వర్షపాతం నమోదయినట్లు వాతావరణ శాఖ చెబుతోంది. ఇలా వానలు పడకపోవడంతో ఇప్పటికే వర్షధార పంటలువేసిన రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
అయితే తాజాగా రైతులకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. జూన్ మొదటి అర్ధభాగంలో మాదిరిగా కాకుండా రెండో అర్ధభాగంలో జోరువానలు కురుస్తాయని వెల్లడించారు. సుమారు 20 రోజులుగా కదలికలు లేకుండా అచేతనంగా ఉన్న రుతుపవనాలు వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో పుంజుకున్నాయని... దీంతో ఇప్పటికే కేరళ, మహారాష్ట్ర, గోవా, కర్ణాటకలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు మొదలయ్యాయని... ఇవి త్వరలోనే భారీ వర్షాలుగా మారతాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
రుతుపవనాలు యాక్టివ్ గా మారడంతో పాటు బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు మొదలయ్యాయి. ఈ మూడ్రోజులు (జూన్ 17,18,19) వర్షాలు కురుస్తాయని... అక్కడక్కడ భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. వర్షాలు కురిసే అవకాశమున్న జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసారు.
నేడు(జూన్ 17 మంగళవారం) ఆదిలాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం,ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయట. ఇక రాజధాని హైదరాబాద్ తో పాటు శివారు జిల్లాలైన మేడ్చల్, రంగారెడ్డి , సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించారు.
వర్షాలకు ఈదురుగాలులు, పిడుగులు తోడయ్యే ప్రమాదముంది కాబట్టి ప్రజలు మరీముఖ్యంగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యే రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వర్షం కురిసే సమయంలో చెట్లకింద తలదాచుకోకూడదని.. సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. ఇక ప్రజలు కూడా వర్షం కురిసే సమయంలో బయటకు రాకూడదని సూచించారు.
రుతుపవనాలు మళ్లీ చురుగ్గా మారడంతో పాటు బంగాళాఖాతంలో ఆవర్తనం ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు జోరందుకున్నాయి. జూన్ నెల ప్రారంభం నుండి వర్షాలు లేక ఎండలు, ఉక్కపోతతో సతమతం అయిన ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. ఇకపై వాతావరణం పూర్తిగా మారిపోతుందని... మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. వాతావరణం కూల్ కూల్ గా ఉంటుందని తెలిపారు.
ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. మిగతాజిల్లాల్లో వర్షాలు లేకున్నా ఆకాశం మేఘాలతో కమ్మేసి వాతావరణం మారుతుంది... కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
రుతుపవనాల ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. కేరళ, గోవా, కర్ణాటకతో పాటు మహారాష్ట్రలో కూడా భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి... దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నిత్యం బిజీబిజీగా ఉండే నగరంలో రోడ్లు జలమయమై వరద పరిస్థితులు కొనసాగుతున్నాయి.. దీంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి.
ఇప్పటివరకు మహారాష్ట్రలో కురిసిన వర్షాలు 18 మందిని బలితీసుకున్నాయని అధికారులు తెలిపారు. అలాగే మరో 65 మంది గాయాలపాలై వివిధ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు. ఇక ఆస్తినష్టం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు... పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈరోజు(మంగళవారం) కూడా భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండి హెచ్చరించింది. మహారాష్ట్రతో పాటు కర్నాటక, కేరళ, గోవాలో రెడ్ అలర్ట్ జారీ చేసారు. య