Supreme court: మ‌హిళ‌ల‌కు నెల‌స‌రి సెల‌వులు త‌ప్ప‌నిస‌రి చేస్తే జ‌రిగేది ఇదే.. సుప్రీం కీల‌క వ్యాఖ్య‌లు.

Published : Mar 13, 2026, 02:36 PM IST

Supreme court: మహిళలకు నెలసరి సమయంలో ప్రత్యేక సెలవులు ఇవ్వాలా? దీనిని త‌ప్ప‌నిస‌రి చేయాల‌నే అంశంపై దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతున్న స‌మ‌యంలో సుప్రీం కోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. దీంతో ఇప్పుడీ అంశం కొత్త చ‌ర్చ‌కు దారి తీసింది. 

PREV
15
పీరియడ్ లీవ్‌ను తప్పనిసరి చేస్తే..

మహిళలకు మెనుస్ట్రువల్ లీవ్‌ను తప్పనిసరి చేసే చట్టం తీసుకురావడం వల్ల వారి ఉద్యోగ అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని అత్యున్న‌త న్యాయ‌స్థానం అభిప్రాయ‌ప‌డింది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వాలు నియమాలు రూపొందించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం శుక్రవారం కీలక అభిప్రాయాలను వెల్లడించింది. విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి సూర్య‌కాంత్‌.. మహిళలకు నెలసరి సెలవులను చట్టబద్ధంగా తప్పనిసరి చేయడం సరైన మార్గం కాదని పేర్కొన్నారు. అలాంటి చట్టం అమల్లోకి వస్తే కొంతమంది సంస్థలు మహిళలను ఉద్యోగాల్లోకి తీసుకోవడాన్ని తగ్గించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కంపెనీల యాజమాన్యాల ఆలోచన విధానం ఎలా ఉంటుందో కూడా పరిగణలోకి తీసుకోవాలని కోర్టు సూచించింది. మహిళలకు ప్రయోజనం కలిగించాలనే ఉద్దేశంతో తీసుకునే కొన్ని నిర్ణయాలు అనుకోకుండా వారి కెరీర్‌కు అడ్డంకిగా మారే ప్రమాదం ఉంటుందని ధర్మాసనం పేర్కొంది.

25
మహిళల్లో అనవసర భయం పెరిగే ప్రమాదం

పీరియడ్ లీవ్‌ను చట్టంగా అమలు చేస్తే మహిళలు పురుషుల కంటే తక్కువ సామర్థ్యం ఉన్నట్లుగా భావించే పరిస్థితి ఏర్పడవచ్చని కోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి నిబంధనలు ఉద్యోగాల్లో ఉన్న మహిళల్లో “తాము బలహీనులు” అన్న భావనను పెంచే అవకాశం ఉందని తెలిపింది. రుతుక్రమం అంశంపై అవగాహన పెంచడం అవసరమే అయినా దాన్ని అత్యధికంగా ప్రాధాన్యం ఇచ్చి ప్రత్యేక చట్టాలు చేయడం సముచితం కాదని న్యాయస్థానం అభిప్రాయపడింది.

35
పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది వాదనలు

మహిళలకు నెలసరి సమయంలో సెలవులు తప్పనిసరిగా ఇవ్వాలని కోరుతూ న్యాయవాది శైలేంద్ర మ‌ని త్రిపాటి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విద్యార్థినులు, ఉద్యోగాల్లో ఉన్న మహిళలకు పీరియడ్ సమయంలో ప్రత్యేక సెలవులు కల్పించేలా రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వాలని ఆయన పిటిషన్‌లో కోరారు. ఈ కేసులో సీనియర్ న్యాయవాది ఎమ్ ఆర్ శంష‌ద్ కూడా వాదనలు వినిపించారు. కొన్ని ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు ఇప్పటికే మహిళలకు పీరియడ్ సమయంలో సెలవులు ఇస్తున్నాయని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

45
స్వచ్ఛందంగా ఇచ్చే సెలవులకు కోర్టు అభ్యంతరం లేదు

ఈ వాదనలపై స్పందించిన సుప్రీంకోర్టు ఇప్పటికే కొన్ని సంస్థలు మహిళలకు పీరియడ్ లీవ్ ఇవ్వడం స్వచ్ఛంద నిర్ణయమని తెలిపింది. సంస్థలు తమ విధానాల ప్రకారం ఉద్యోగుల సంక్షేమం కోసం తీసుకునే నిర్ణయాలకు ఎలాంటి అభ్యంతరం లేదని కోర్టు స్పష్టం చేసింది. అయితే అదే విషయాన్ని చట్టంగా చేసి అందరికీ తప్పనిసరి చేయడం వేరే విషయం అని పేర్కొంది. అలాంటి చట్టం తీసుకొస్తే కొంతమంది యాజమాన్యాలు మహిళలను నియమించడంలో వెనుకడుగు వేయవచ్చని ధర్మాసనం హెచ్చరించింది.

55
నెలసరి పరిశుభ్రతను ప్రాథమిక హక్కుగా గుర్తించిన సుప్రీంకోర్టు

ఇదే సమయంలో మహిళల ఆరోగ్యానికి సంబంధించిన మరో కీలక అంశంపై గతంలో సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. నెలసరి పరిశుభ్రతను మౌలిక హక్కుల పరిధిలో భాగంగా పరిగణించవచ్చని పేర్కొంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు, గోప్యత హక్కులో మహిళల ఆరోగ్యం కూడా భాగమేనని కోర్టు తెలిపింది. పాఠశాలల్లో బాలికలకు సరైన పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని న్యాయస్థానం స్పష్టం చేసింది. విద్యార్థినులకు ఉచిత శానిటరీ ప్యాడ్స్ అందించడంతో పాటు పాఠశాలల్లో బాలబాలికలకు వేర్వేరు టాయిలెట్లు ఏర్పాటు చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చింది.

Read more Photos on
click me!

Recommended Stories