డిజిటల్ లావాదేవీలు పెరిగినా చిల్లర కష్టాలు తప్పడంలేదు… ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం కొత్త ప్రయత్నం మొదలుపెట్టింది. ఇకపై ఏటీఎం మెషీన్లలో రూ.10, రూ.20, రూ.50 నోట్లను కూడా అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది.
డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగినా చిన్న నోట్ల వినియోగం ప్రజల్లో ఎక్కువగా ఉంది. చాలామంది బయటకు వెళితే చాలు చిల్లర డబ్బులు దగ్గర పెట్టుకుంటారు… ముఖ్యంగా రూ.10, రూ.20. రూ.50 నోట్లను ఎక్కువగా వాడుతుంటారు. ఇలా చిన్ననోట్ల వినియోగం ఎక్కువగా ఉండటంతో మార్కెట్లో చిల్లర కొరత నెలకొంది. దీనికి సరికొత్త పరిష్కారంతో ముందుకు వస్తోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI).
ఇంతకాలం బ్యాంక్ ఏటిఎంలలో రూ.100, అంతకంటే ఎక్కువ విలువగల కరెన్సీ నోట్లు మాత్రమే వచ్చేవి… కానీ ఇకపై రూ.10, రూ.20, రూ.50 నోట్లు కూడా వస్తాయట. ఈ విషయాన్ని పార్లమెంట్ సాక్షిగా స్వయంగా కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు.
25
యూపిఐ జమానాలోనే చిల్లర కష్టాలు..
ఈ రోజుల్లో చాలామంది యూపీఐ, ఆన్‌లైన్ పేమెంట్స్ వాడుతున్నా చిల్లర అవసరం తప్పడం లేదు. రూ.100 లేదా రూ.500 నోటు ఇస్తే దుకాణదారులు 'చిల్లర లేదు' అనడం చూస్తూనే ఉన్నాం. ఇలా అటు వ్యాపారులకు, ఇటు వినియోగదారులకు చిల్లర కష్టాలు తప్పడంలేదు. అందుకే కొత్తగా బ్యాంకులు ఏర్పాటుచేసే ఏటిఎంలలో చిన్న కరెన్సీ నోట్లు కూడా వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
35
ఇప్పుడున్న ఏటీఎంలలో చిన్ననోట్లు ఎందుకు రావు..?
సాధారణ ఏటీఎంలలో చిన్న నోట్లు ఎందుకు రావని చాలామందికి సందేహం ఉంది. దీనిపై మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిస్తూ.. పాత ఏటీఎం మెషీన్లలో చిన్న నోట్లు ఇచ్చే సౌకర్యం లేదని తెలిపారు. ఇప్పుడు 'స్మాల్ వ్యాల్యూ డిస్పెన్సర్' అనే కొత్త విధానం ద్వారా చిన్న నోట్లను అందించే ప్రత్యేక ఏటీఎంలను ప్రయోగాత్మకంగా ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు. దీంతో ప్రజలకు చిల్లర కష్టాలు తగ్గుతాయని ప్రజలు భావిస్తున్నామన్నారు.
మార్కెట్లో చిన్న నోట్లు తగినంత సంఖ్యలో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దేశంలో రూ.10, రూ.20, రూ.50 నోట్లకు ఎలాంటి కొరత లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి 26 వరకు సుమారు 439.40 కోట్ల రూ.10 నోట్లు, 193.70 కోట్ల రూ.20 నోట్లు, 130.30 కోట్ల రూ.50 నోట్లు ముద్రించి విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో కూడా పెద్ద మొత్తంలో ఈ నోట్లను పంపిణీ చేసినట్లు వెల్లడించారు.
55
కరెన్సీ నోట్ట ముద్రణ..
దేశ ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు వివిధ విలువైన నోట్ల డిమాండ్‌ను అంచనా వేసి ముద్రిస్తుందని మంత్రి తెలిపారు. నోట్లతో పాటు నాణేల ద్వారా కూడా చిల్లర అవసరాలను తీరుస్తోంది. ఇదే సమయంలో చిన్న లావాదేవీల కోసం డిజిటల్ చెల్లింపుల వాడకం కూడా వేగంగా పెరుగుతోంది.