రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. ఇక‌పై 24 గంట‌లూ షాప్స్‌ ఓపెన్‌, మ‌ద్యం దుకాణాలు కూడా

Published : Nov 19, 2026, 02:45 PM IST

Shopping: పర్యాటకులకు మరింత సౌకర్యం కల్పించేందుకు గోవా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని దుకాణాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, మాల్స్‌ను 24 గంటల పాటు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చింది. మద్యం విక్రయాలకు మాత్రం కొన్ని నిబంధ‌న‌లు వ‌ర్తిస్తాయి.

PREV
15
గోవా ప్రభుత్వం కీలక నిర్ణయం

గోవాలో పర్యాటకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా రాత్రి వేళల్లోనూ పర్యాటక ప్రాంతాల్లో సందడి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వ్యాపార కార్యకలాపాలను మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని సాధారణ దుకాణాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, మాల్స్‌ను రోజుకు 24 గంటలు, వారంలో ఏడు రోజులూ తెరిచి ఉంచేందుకు అనుమతించింది. ఈ వెసులుబాటు మూడేళ్ల పాటు అమల్లో ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వచ్చింది.

25
మద్యం దుకాణాలు రాత్రంతా తెరిచి ఉంటాయా.?

గోవా ప్రభుత్వం 24 గంటల పాటు దుకాణాలు తెరిచి ఉంచేందుకు అనుమతించినప్పటికీ.. అన్ని మద్యం దుకాణాలకు ఈ నిబంధన వర్తించదు. మద్యం విక్రయాలు మాత్రం ఎక్సైజ్ శాఖ నిర్ణయించిన సమయాలు, లైసెన్స్ నిబంధనల ప్రకారమే జరగాలి. అయితే విమానాశ్రయాల్లో లైసెన్స్ పొందిన మద్యం విక్రయ కేంద్రాలకు 24 గంటల పాటు పనిచేసేందుకు అనుమతి ఉంది. అలాగే పెద్ద హోటళ్లలోని లైసెన్స్ పొందిన బార్లు, రూమ్ సర్వీస్ ద్వారా అతిథులకు రాత్రి ఆలస్యమైనా మద్యం అందించే అవకాశం ఉంటుంది. పర్యాటక ప్రాంతాల్లో కొన్ని దుకాణాలు కూడా అర్ధరాత్రి వరకు తెరిచి ఉండవచ్చు. కానీ సాధారణ మద్యం రిటైల్ దుకాణాలకు మాత్రం 24 గంటల పాటు విక్రయాలు జరిపే అనుమతి లేదు.

35
ఉద్యోగుల పని వేళలపై ప్రత్యేక నిబంధనలు

దుకాణాలు, మాల్స్‌ను 24 గంటల పాటు తెరిచి ఉంచేందుకు అనుమతించిన ప్రభుత్వం.. అక్కడ పనిచేసే ఉద్యోగుల విషయంలోనూ కొన్ని నిబంధనలు విధించింది. ఉద్యోగులు రోజుకు గరిష్ఠంగా 8 గంటలు మాత్రమే పనిచేయాలి. వారానికి మొత్తం పని సమయం 48 గంటలు మించకూడదు. ఉద్యోగుల పని వేళలు, విశ్రాంతి సమయాలు, వారాంతపు సెలవుల వివరాలను దుకాణాల్లో ప్రదర్శించాలి. వ్యాపార సంస్థల్లో తగినంత వెలుతురు, గాలి, పరిశుభ్రత ఉండేలా చూసుకోవాలి. ఉద్యోగులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలి.

45
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు

ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటును ఉపయోగించుకునే వ్యాపారులు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. ముఖ్యంగా 10 మందిలోపు ఉద్యోగులు ఉన్న వ్యాపార సంస్థలు తమ వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు, శాశ్వతంగా మూసివేసినప్పుడు ఆ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. ఉద్యోగుల పని వేళలు, విశ్రాంతి సమయాలకు సంబంధించిన నిబంధనలను కూడా పాటించాలి. దుకాణాల్లో భద్రత, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ నిబంధనలను ఉల్లంఘించే వ్యాపారులపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

55
పర్యాటక రంగం, వ్యాపారాలకు మరింత ఊతం

గోవా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశం పర్యాటకులకు మరింత సౌకర్యం కల్పించడమే. ఇప్పటివరకు రాత్రి వేళల్లో దుకాణాలు మూసివేయడంతో షాపింగ్ చేయాలనుకునే పర్యాటకులకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేవి. ఇకపై అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున కూడా అవసరమైన వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చు. ఈ నిర్ణయంతో రాత్రి వేళల్లోనూ వ్యాపార కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉంది. తద్వారా స్థానిక వ్యాపారులకు ఆదాయం పెరగడంతో పాటు గోవా పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories