Global Religion Report: 2035 నాటికి ప్రపంచంలో అతిపెద్ద మతంగా ఇస్లాం.. క్రైస్తవులు, హిందువుల సంగతేంటి?

Published : Nov 19, 2026, 11:22 AM IST

World Religion Population: 2035 నాటికి క్రైస్తవాన్ని దాటి ఇస్లాం ప్రపంచంలో అతిపెద్ద మతంగా మారనుందని ప్యూ రీసెర్చ్ వెల్లడించింది. 2070 నాటికి భారత్‌లో హిందూ, ముస్లిం జనాభా లెక్కలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
16
షాకింగ్ సర్వే: క్రైస్తవాన్ని దాటేస్తున్న ఇస్లాం.. 2070 నాటికి మన దేశంలో ఏ మతం ఎంత శాతం ఉంటుందంటే?

ప్రపంచ మతాల ముఖచిత్రం రాబోయే కొన్నేళ్లలో భారీగా మారబోతోంది. 2035 నాటికి క్రైస్తవ మతాన్ని దాటి ఇస్లాం ప్రపంచంలోనే అతిపెద్ద మతంగా అవతరించనుందని ప్రముఖ ప్యూ రీసెర్చ్ సెంటర్ తన తాజా అధ్యయనంలో వెల్లడించింది. బుధవారం (నవంబర్ 18) విడుదల చేసిన ఈ రిపోర్టు ప్రకారం, జనాభా వృద్ధి రేటు, సంతానోత్పత్తి రేటులో ఉన్న తేడాలే ఈ మార్పుకు ప్రధాన కారణం. ఈ రిపోర్టు ప్రస్తావించిన మరిన్ని విషయాలు ఇలా ఉన్నాయి..

26
2070 నాటికి ప్రపంచ జనాభా లెక్కలు ఇవే

ప్రస్తుత జనాభా ధోరణులు ఇలాగే కొనసాగితే 2020 నుండి 2070 మధ్య ప్రపంచ మొత్తం జనాభా 29 శాతం పెరుగుతుంది. ఇదే సమయంలో క్రైస్తవుల జనాభా 30 శాతం పెరిగితే, ముస్లింల జనాభా ఏకంగా 80 శాతం పెరగనుంది. 2070 నాటికి ప్రపంచ జనాభాలో ముస్లింల వాటా ప్రస్తుత 26 శాతం నుండి 36 శాతానికి చేరుకుంటుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ముస్లింల సంఖ్య 3.6 బిలియన్లు అంటే దాదాపు 360 కోట్లు దాటుతుంది. మరోవైపు క్రైస్తవుల వాటా దాదాపు 29 శాతంగా, అంటే 3 బిలియన్లు అంటే దాదాపు 300 కోట్లు కంటే కొంచెం తక్కువగా ఉండనుంది.

36
మతాల వృద్ధికి అసలు కారణం ఏంటి?

మత మార్పిడుల కంటే ఆయా మతాల్లో పుట్టే పిల్లల సంఖ్యే జనాభా పెరుగుదలకు అసలు కారణమని ప్యూ రీసెర్చ్ స్పష్టం చేసింది. "మత మార్పిడి కంటే పుట్టే పిల్లలే కీలకం" అని ప్యూ సీనియర్ డెమోగ్రాఫర్ కాన్రాడ్ హాకెట్ పేర్కొన్నారు. 2020-2025 మధ్య కాలంలో ముస్లిం మహిళల సగటు సంతానోత్పత్తి రేటు 3.1 మంది పిల్లలుగా ఉంది. క్రైస్తవులలో ఇది 2.5గా ఉండగా, ఇతర మతాల మహిళల్లో సగటున 1.6 మాత్రమే ఉంది. ఒక తరం తన స్థానాన్ని భర్తీ చేసుకోవడానికి కనీసం 2.1 సంతానోత్పత్తి రేటు అవసరం.

46
భారత్‌లో హిందువులు, ముస్లింల వాటా ఎలా మారనుంది?

ప్రపంచవ్యాప్తంగా హిందువుల సంఖ్య 2020లో 1.2 బిలియన్లు (120 కోట్లు) ఉండగా, 2070 నాటికి 1.4 బిలియన్లకు (140 కోట్లు) పెరుగుతుంది. కానీ, మిగతా ప్రపంచ జనాభా అంతకంటే వేగంగా పెరుగుతుండటంతో, ప్రపంచ జనాభాలో హిందువుల వాటా 15 శాతం నుండి 14 శాతానికి స్వల్పంగా తగ్గనుంది.

• భారత్‌లో 2020 నుండి 2070 మధ్య హిందువుల సంఖ్య 17.6 కోట్లు పెరుగుతుంది.

• అయితే దేశ జనాభా నిష్పత్తిలో హిందువుల వాటా 2020లో ఉన్న 79.4 శాతం నుండి 2070 నాటికి 75.8 శాతానికి తగ్గుతుంది.

• ఇదే సమయంలో భారత్‌లో ముస్లింల వాటా 15.2 శాతం నుండి 19.6 శాతానికి పెరుగుతుంది.

• భారత్ వెలుపల పాకిస్థాన్‌లో 50 లక్షలకు పైగా, అమెరికాలో 40 లక్షలకు పైగా హిందువులు పెరగనున్నారు. 2070 నాటికి ప్రపంచంలో ఐదో అతిపెద్ద హిందూ జనాభా కలిగిన దేశంగా అమెరికా నిలుస్తుంది. భారత్, నేపాల్ మాత్రమే హిందూ మెజారిటీ దేశాలుగా కొనసాగుతాయి.

56
దేశాల వారీగా మారనున్న ఆధిపత్యం

భౌగోళికంగా కూడా జనాభా మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ శతాబ్దంలో అత్యధిక జనాభా వృద్ధి ఆఫ్రికాలో నమోదవుతుంది, యూరప్ వాటా 10 శాతం నుండి 6 శాతానికి పడిపోతుంది.

• 2070 నాటికి ప్రపంచంలోని సగానికి పైగా క్రైస్తవులు సబ్-సహారా ఆఫ్రికాలో నివసిస్తారు. అమెరికాను దాటి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అత్యధిక క్రైస్తవ జనాభా ఉన్న దేశంగా మారుతుంది. అమెరికాలో క్రైస్తవులే అతిపెద్ద సమూహంగా ఉన్నప్పటికీ, మెజారిటీ హోదాను కోల్పోతారు.

• ప్రస్తుతం అత్యధిక ముస్లింలు ఉన్న ఇండోనేషియాను దాటి పాకిస్థాన్ ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దేశంగా మారుతుంది. ఆ తర్వాత స్థానాల్లో భారత్, నైజీరియా, ఇండోనేషియా ఉంటాయి.

66
బౌద్ధులు, నాస్తికుల పరిస్థితి ఏంటి?

చైనా, దక్షిణ కొరియా, జపాన్ దేశాల్లో మొత్తం జనాభా తగ్గుతుండటంతో బౌద్ధుల సంఖ్య, వారి ప్రపంచ వాటా రాబోయే దశాబ్దాల్లో తగ్గనుంది. యూదుల సంఖ్య పెరిగినా వారి ప్రపంచ వాటా తగ్గుతుంది. ఇక ఏ మతాన్నీ అనుసరించని వారి వాటా ప్రపంచ జనాభాలో 24 శాతం నుండి 17 శాతానికి తగ్గుతుంది. చైనాను మినహాయిస్తే, మిగతా దేశాల్లో వీరి సంఖ్య 18 కోట్లకు పైగా పెరుగుతుంది. ప్రస్తుతం చెక్ రిపబ్లిక్, జపాన్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, ఉరుగ్వే, వియత్నాం సహా 10 దేశాల్లో వీరే మెజారిటీగా ఉన్నారు. 2070 నాటికి దక్షిణ కొరియా, ఫ్రాన్స్, యూకే కూడా ఈ జాబితాలో చేరతాయని ప్యూ అంచనా వేసింది.

Read more Photos on
click me!

Recommended Stories