ప్రకాశ్ రాజ్ ఓటు గల్లంతు.. నిజంగానే ఆయ‌న‌కు 4 రాష్ట్రాల్లో ఓటర్ ఐడీ ఉందా.? అస‌లేం జ‌రిగింది

Published : Aug 11, 2026, 04:50 PM IST

Prakash Raj: ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి ఓటు హక్కుకు సంబంధించిన అంశంతో వార్తల్లో నిలిచారు. కర్ణాటకలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో తన పేరు ఓటర్ల జాబితాలో కనిపించలేదని ఆయన వెల్లడించారు.

PREV
14
SIR తర్వాత జాబితాలో కనిపించని ప్రకాశ్ రాజ్ పేరు

కర్ణాటకలో ఓటర్ల జాబితా సవరణ కోసం చేపట్టిన SIR ప్రక్రియలో ప్రకాశ్ రాజ్ పేరు తొల‌గించిన‌ట్లు ఆయన స్వయంగా వెల్లడించారు. బెంగళూరులోని తన నియోజకవర్గంలో ఓటరుగా ఉన్న తన పేరు తొల‌గించార‌ని ఆయన పేర్కొన్నారు. తాజా రిపోర్టుల ప్రకారం ఆయన పేరును ‘పర్మనెంట్‌గా షిఫ్ట్ అయిన వ్యక్తి’గా గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియా వీడియో ద్వారా వెల్లడించారు. తన ఓటు తొలగిపోవడం తనకు ఆశ్చర్యంగా ఉందని చెబుతూ, తిరిగి ఓటు హక్కు పొందేందుకు ఎలాంటి పత్రాలు సమర్పించాలో కూడా చూస్తానని వ్యంగ్యంగా అన్నారు.

24
‘ఇక్కడే పుట్టాను.. ఎంపీగా కూడా పోటీ చేశాను’

ప్రకాశ్ రాజ్ తన వీడియోలో బెంగళూరుతో తనకున్న అనుబంధాన్ని ప్రస్తావించారు. తాను అక్కడే పుట్టానని, అక్కడే పెరిగానని, విద్యాభ్యాసం కూడా అక్కడే పూర్తయిందని చెప్పారు. తన కళా ప్రయాణం కూడా బెంగళూరులోనే సాగిందని గుర్తుచేశారు. అంతేకాదు, ఇదే ప్రాంతం నుంచి గతంలో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. అలాంటి పరిస్థితిలో తన పేరు ఓటర్ల జాబితాలో లేకపోవడం ఎలా జరిగిందంటూ ప్రశ్నించారు. తిరిగి ఓటు హక్కు పొందడానికి అవసరమైన పత్రాలు ఏంటో తెలుసుకుంటానని చెబుతూ అధికారులపై సెటైర్లు వేశారు. కేంద్ర‌ ప్రభుత్వాన్ని ఉద్దేశించి తనదైన శైలిలో ప్రశ్నలు సంధించిన ప్రకాశ్ రాజ్.. తనను ఎన్నుకోని వారి ఓటు హక్కును తొలగించే అధికారం ఉండొచ్చని, కానీ ప్రజలు అధికారాన్ని మార్చాలని నిర్ణయించుకుంటే దాన్ని అడ్డుకోగలరా? అంటూ ప్రశ్నించారు. చివర్లో ‘గేమ్ ఆన్’ అంటూ వ్యాఖ్యానించారు.

34
నాలుగు రాష్ట్రాల్లో ఓటర్ ఐడీల ఆరోపణ.. 2019లోనే కేసు

ప్రకాశ్ రాజ్‌కు సంబంధించిన మరో ఓటర్ కేసు కూడా గతంలో నమోదైంది. 2019లో న్యాయవాది కే. దిలీప్ కుమార్ ఫిర్యాదు ఆధారంగా ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. ప్రకాశ్ రాజ్‌కు కర్ణాటకతో పాటు తమిళనాడు, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో ఓటరు నమోదులు ఉన్నాయని ఫిర్యాదులో ఆరోపించారు. అలాగే 2019 లోక్‌సభ ఎన్నికల నామినేషన్ సమయంలో ఈ వివరాలను వెల్లడించలేదని కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ ఫిర్యాదు విషయంలో పోలీసులు, ఎన్నికల అధికారుల నుంచి తగిన చర్యలు లేవని ఆరోపిస్తూ ఫిర్యాదుదారు కోర్టును ఆశ్రయించారు. అనంతరం బెంగళూరులోని 48వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో కేసు విచారణకు వచ్చింది. కోర్టు నుంచి వచ్చిన సమన్లకు ప్రకాశ్ రాజ్ హాజరు కాలేదన్న కారణంతో 2026లో ఆయనపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఈ పరిణామం అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది.

44
వారెంట్ తర్వాత కోర్టుకు హాజరు.. బెయిల్ మంజూరు

ఓటర్ ఐడీ కేసులో నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ అయిన తర్వాత ప్రకాశ్ రాజ్ జులై 10న బెంగళూరు కోర్టుకు హాజరయ్యారు. ఆయన తరఫు న్యాయవాదులు వారెంట్‌ను వెనక్కి తీసుకోవాలని కోరారు. వాదనలు విన్న కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్‌ను రీకాల్ చేసి ప్రకాశ్ రాజ్‌కు బెయిల్ మంజూరు చేసింది. ఇదిలా ఉంటే తాజాగా SIR కారణంగా తన ఓటు హక్కు ప్రభావితమైందంటూ ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా, సామాజికంగా చర్చకు దారితీశాయి. తన పేరు తిరిగి ఓటర్ల జాబితాలో చేరుతుందా.? అధికారులు దీనిపై ఎలాంటి వివరణ ఇస్తారో అనేది వేచి చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories