ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం భారత రాజ్యాంగం 75 సంవత్సరాలను గర్వించదగిన, వేడుకలు జరుపుకునే సందర్బంగా పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాతల దృష్టిని హైలైట్ చేశారు. పార్లమెంట్‌లో ప్రధాని ప్రసంగిస్తూ, రాజ్యాంగ వారసత్వంపై చర్చకు సహకరించిన చట్టసభ సభ్యులు, స్పీకర్లకు కృతజ్ఞతలు తెలిపారు. దేశ ప్రగతికి భారత రాజ్యాంగం కారణమని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య విలువలను సమర్థించినందుకు మిలియన్ల మంది భారతీయులకు కృతజ్ఞతలు తెలుపుతూ, రాజ్యాంగ నిర్మాతలు ప్రజాస్వామ్యాన్ని 1950లో జన్మించిన భావనగా చూడలేదని నొక్కిచెప్పారు. బదులుగా, వారు వేల సంవత్సరాల పాటు భారతదేశం గొప్ప వారసత్వం నుండి ప్రేరణ పొందారు. ఎన్నో దేశాలకు మన రాజ్యాంగం స్ఫూర్తి అనీ, ప్రజాస్వామ్య పండుగను నిర్వహించుకోవడం దేశానికి గర్వపడే క్షణాలుగా ప్రధాని పేర్కొన్నారు.
దేశాభివృద్ధిలో మహిళలు కీలకపాత్ర పోషించారనీ, ఆదివాసీ మహిళ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో మహిళలకు గౌరవం దక్కాలనీ, దేశాన్ని వికసిత్ భారత్ గా మార్చాలని పేర్కొన్నారు. అలాగే, ఆర్టికల్ 370 భారత ఐక్యతకు అవరోధంగా పేర్కొంటూ, దానిని రద్దు చేయాలనే తన ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సమర్థించారు. "జాతీయ ఐక్యత మా ప్రధాన ప్రాధాన్యత" అని ఆయన ప్రకటించారు.
ఈ క్రమంలోనే ప్రభుత్వం, ప్రజలు తమ విధిని నిర్వర్తించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ.. భారతీయులు పాటించాల్సిన 11 తీర్మానాలు ప్రకటించారు. అవి:
1. ప్రభుత్వం, ప్రజలు తమ విధిని నిర్వర్తించాలి.
2. అవినీతిని సహించకూడదు.
3. చట్టం అమలు పట్ల ప్రజలు గర్వపడాలి.
4. స్లేవరీ మైండ్‌సెట్ నుండి బయటపడాలి.
5. రాజకీయాల్లో బంధుప్రీతి తొలగిపోతుంది.
6. రాజ్యాంగాన్ని గౌరవించడం.
7. రిజర్వేషన్లు లాక్కోకూడదు. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఉండకూడదు.
8. మహిళలు అభివృద్ధిలో ముందుండాలి.
9. రాజ్య సే రాష్ట్ర కా వికాస్
10. ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్
11. సబ్కా సాత్ సబ్కా వికాస్.