one nation, one election: ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తన ఎనిమిదో క్యాబినెట్ సమావేశంలో చారిత్రాత్మక అడుగు వేసింది. గురువారం (డిసెంబర్ 12) జరిగిన ఈ సమావేశంలో 'ఒకే దేశం, ఒకే ఎన్నికలు' (వన్ నేషన్, వన్ ఎలక్షన్) బిల్లుకు ఆమోదం తెలిపింది. ఇప్పుడు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ బిల్లు దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం చేస్తుంది. దీంతో పాటు పలు పథకాలు, ప్రాజెక్టులపై కూడా మంత్రివర్గం చర్చించింది.
'వన్ నేషన్, వన్ ఎలక్షన్' ఆమోదం.. అసలు ఏంటిది?
'ఒకే దేశం, ఒకే ఎన్నికల' బిల్లును ఆమోదించడం ద్వారా దేశంలో పెద్ద సంస్కరణ చేసే దిశగా మోడీ మంత్రివర్గం అడుగులు వేసిందని చెప్పాలి. ఈ బిల్లు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేందుకు వీలు కల్పిస్తుంది. అంటే దేశంలో వివిధ రాష్ట్రాలు, పార్లమెంట్ కు జరిగే ఎన్నికలు ఒకే సారి జరుగుతాయి. దీనివల్ల సమయంతో పాటు ఖర్చు తగ్గుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఎన్నికల ప్రక్రియను క్రమబద్ధీకరించేందుకు ఉద్దేశించిన ఒక ముఖ్యమైన చర్య "ఒక దేశం, ఒకే ఎన్నిక"కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం చారిత్రాత్మక ముందడుగు. ఈ నిర్ణయాన్ని అనుసరించి సమగ్రమైన బిల్లు దేశవ్యాప్తంగా ఏకీకృత ఎన్నికలకు మార్గం సుగమం చేస్తుంది. అంతకుముందు బుధవారం భారత మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మాట్లాడుతూ.. ఒక దేశం, ఒకే ఎన్నికల పై కేంద్ర ప్రభుత్వం ఏకాభిప్రాయాన్ని తీసుకురావాలనీ, ఈ సమస్య రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా ఉందనీ, మొత్తం దేశానికి మేలు జరుగుతుందని నొక్కి చెప్పారు.
One Nation One Election
ఈ ఏడాది సెప్టెంబర్‌లో కేంద్ర మంత్రివర్గం 'ఒక దేశం, ఒకే ఎన్నికలు' ప్రతిపాదనను ఆమోదించింది. ఇది 100 రోజుల వ్యవధిలో పట్టణ బాడీ, పంచాయతీ ఎన్నికలతో పాటు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మాజీ రాష్ట్రపతి కోవింద్ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ నివేదికలో ఈ సిఫార్సులను వివరించింది. క్యాబినెట్ ఆమోదం తర్వాత, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ నిర్ణయాన్ని ప్రశంసించారు, ఇది భారతదేశ ప్రజాస్వామ్యాన్ని పెంపొందించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు అని పేర్కొన్నారు.
"ఏకకాల ఎన్నికలపై ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సులను కేబినెట్ ఆమోదించింది. ఈ ప్రయత్నానికి నాయకత్వం వహించినందుకు, విస్తృత శ్రేణిలో అందరిని సంప్రదించినందుకు మా మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ జీని నేను అభినందిస్తున్నాను. ఇది మన ప్రజాస్వామ్యాన్ని రూపొందించడానికి ఒక ముఖ్యమైన అడుగు. మరింత చురుకైన, భాగస్వామ్యంలో ముందడుగు" అని పిఎం మోడీ పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బుధవారం ఇన్ నేషన్ వన్ ఎలక్షన్ కు మద్దతు ప్రకటించారు. రాష్ట్ర అసెంబ్లీలకు, లోక్‌సభకు ఏకకాల ఎన్నికలు, తరచుగా జరిగే ఎన్నికల వల్ల సమయం, ప్రజా నిధులు గణనీయంగా వృధా అవుతాయని అన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ తో ఇలాంటివి వుండవని పేర్కొన్నారు. ‘‘నేను వ్యవసాయ శాఖ మంత్రిని కానీ ఎన్నికల సమయంలో మూడు నెలల పాటు ప్రచారం చేస్తూ.. ప్రధాని, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు, ఉద్యోగుల సమయాన్ని వృథా చేస్తున్నా.. అభివృద్ధి పనులన్నీ నిలిచిపోయాయి" అని చౌహాన్ అన్నారు.