PM Modi: మోదీ నా బిడ్డకు పునర్జన్మనిచ్చారు.. ప్రధానిని దూషించిన బాలిక తల్లి ఎమోషన్

Published : Aug 02, 2026, 05:15 PM IST

PM Modi: నీట్ పేపర్ లీక్ అంశంపై జరిగిన నిరసనలో ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మైనర్ బాలిక వ్యవహారం చర్చనీయాంశమైంది. ఈ ఘటనలో బాలిక తన తప్పును అంగీకరిస్తూ క్షమాపణలు చెప్పగా, ప్రధాని స్పందించిన తీరు కుటుంబ సభ్యుల్లో భావోద్వేగాన్ని కలిగించింది.

PREV
14
ప్రధాని క్షమించడంతో కొత్త జీవితం దక్కింది: బాలిక తల్లి

మీడియాతో మాట్లాడిన బాలిక తల్లి, తన కుమార్తె చేసిన తప్పును మోదీ పెద్ద మనసుతో క్షమించడం తమ కుటుంబానికి ఎంతో ఉపశమనాన్ని ఇచ్చిందని చెప్పారు. తన కుమార్తె పుట్టినరోజు రోజునే ఈ పరిణామం చోటు చేసుకోవడం మరింత ప్రత్యేకంగా అనిపించిందని పేర్కొన్నారు. తప్పు చేసిన పిల్లలను శిక్షించడం కంటే వారికి మార్గనిర్దేశం చేయడం గొప్ప విషయమని ప్రధాని నిరూపించారని ఆమె అన్నారు. తన కుమార్తెకు ఇది పునర్జన్మ లాంటిదేనని, భవిష్యత్తులో ఇలాంటి తప్పు మళ్లీ జరగదని విశ్వాసం వ్యక్తం చేశారు.

24
సోషల్ మీడియాపై నియంత్రణ కోరిన తల్లి.. కేసుపై అభ్యర్థన

ఈ సందర్భంగా బాలిక తల్లి కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు కూడా చేశారు. మైనర్లు రాజకీయ నిరసనల్లో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని, చిన్న వయస్సులో ఉన్న పిల్లలు సోషల్ మీడియా ప్రభావానికి గురికాకుండా తగిన నిబంధనలు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, తన కుమార్తెపై నమోదైన కేసులో పోలీసులు వయసును తప్పుగా నమోదు చేశారని ఆరోపించారు. బాలిక వయసు 15 సంవత్సరాలు మాత్రమే అయినప్పటికీ, ఎఫ్‌ఐఆర్‌లో 25 సంవత్సరాలుగా నమోదు చేశారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆమెపై నమోదైన కేసును ఉపసంహరించుకోవాలని అధికారులను కోరారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో బెదిరింపులు వస్తున్నాయని, వాటిపై కూడా సంబంధిత అధికారులు స్పందించాలని విజ్ఞప్తి చేశారు.

34
తప్పు ఒప్పుకుని క్షమాపణ చెప్పిన బాలిక

ప్రధాని స్పందన అనంతరం బాలిక కూడా వీడియో విడుదల చేసి తన చర్యపై తీవ్ర పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. నిరసన కార్యక్రమంలో ఇతరులు మాట్లాడిన మాటల ప్రభావంతో భావోద్వేగానికి లోనై తాను అనుచిత వ్యాఖ్యలు చేశానని వివరించింది. తాను మాట్లాడిన మాటలు పూర్తిగా తప్పేనని, వాటిని గుర్తు చేసుకున్నప్పుడల్లా తనకే బాధ కలుగుతోందని పేర్కొంది. ఇకపై ఇలాంటి పొరపాటు ఎప్పటికీ చేయనని హామీ ఇస్తూ, ప్రధాని మోదీతో పాటు దేశ ప్రజలందరూ తనను క్షమించాలని కోరింది.

44
అసలేం జరిగింది.?

నీట్-యూజీ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఈ బాలిక ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అనంతరం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత బాలిక తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పడంతో పాటు, ప్రధాని కూడా ప్రతీకారానికి బదులుగా యువతను సరైన మార్గంలో నడిపించడం ముఖ్యమనే భావనను వ్యక్తం చేశారు. ఈ పరిణామం తర్వాత బాలిక కుటుంబం ఉపశమనం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన అవగాహన కల్పించాలని కోరుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories