Published : Oct 06, 2025, 11:48 PM ISTUpdated : Oct 06, 2025, 11:53 PM IST
Chief Justice BR Gavai : భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ పై బూటు విసిరిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, న్యాయమూర్తి ప్రశాంతతను ఆయన ప్రశంసించారు.
Chief Justice of India: సీజేఐ బీఆర్ గవాయ్ పై దాడిని ఖండించిన ప్రధాని నరేంద్ర మోదీ
సుప్రీంకోర్టులో భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) బీఆర్ గవాయిపై జరిగిన దాడి ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం స్పందిస్తూ, దాడి “ప్రతి భారతీయుడిని ఆగ్రహానికి గురిచేసిందని” పేర్కొన్నారు.
మోదీ ఎక్స్ (X)లో చేసిన పోస్టులో.. “ఈ రోజు సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి గవాయి పై జరిగిన దాడి దేశంలోని ప్రతి పౌరుడిని బాధపెట్టింది. ఇటువంటి చర్యలు మన సమాజంలో జరగడానికి చోటు లేదు. ఇది పూర్తిగా ఖండనీయమైనది” అని అన్నారు.
అలాగే, “అలాంటి పరిస్థితుల్లో కూడా జస్టిస్ గవాయి ప్రదర్శించిన ప్రశాంతతను నేను అభినందిస్తున్నాను. ఇది ఆయన న్యాయసిద్ధాంతాలపట్ల, రాజ్యాంగ విలువలపట్ల అంకితభావాన్ని చూపిస్తుంది” అని ప్రధాని వ్యాఖ్యానించారు.
25
సుప్రీంకోర్టులో సీజేఐ పైకి బూటు విసిరిన రాకేష్ కిషోర్ అరెస్ట్
సోమవారం ఉదయం సుమారు 11.35 గంటలకు సుప్రీంకోర్టు నం.1 కోర్ట్ హాల్లో ఈ ఘటన జరిగింది. మయూర్ విహార్‌కు చెందిన 71 ఏళ్ల న్యాయవాది రాకేష్ కిషోర్ తన స్పోర్ట్స్ షూస్ తీసి ప్రధాన న్యాయమూర్తి గవాయి వైపు విసిరాడు. కానీ, అది సీజేఐ దగ్గరకు చేరలేదు.
భద్రతా సిబ్బంది వెంటనే అతడిని అడ్డుకున్నారు. ఈ సమయంలో కిషోర్ “సనాతన్ కా అపమాన్ నహీ సహేంగే” అంటూ అరిచాడు. కోర్టులో ఉన్నవారు ఒక్కసారిగా షాక్‌కు గురైనప్పటికీ, సీజేఐ గవాయి ప్రశాంతంగా స్పందిస్తూ.. “ఇలాంటి వాటితో మన దృష్టిని కోల్పోము. ఇవి నన్ను ప్రభావితం చేయవు” అని అన్నారు.
35
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తక్షణ చర్యలు.. రాకేష్ కిషోర్ సస్పెన్షన్
సోమవారం సాయంత్రమే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) అత్యవసరంగా స్పందించింది. రాకేష్ కిషోర్‌పై తక్షణ సస్పెన్షన్ విధించినట్టు బీసీఐ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులో, “మీ ప్రవర్తన బార్ కౌన్సిల్ నిబంధనలకు విరుద్ధం. కోర్టు గౌరవాన్ని దెబ్బతీసింది. అందువల్ల మీరు తక్షణ ప్రభావంతో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయడాన్ని నిలిపివేస్తున్నాము” అని పేర్కొన్నారు.
సస్పెన్షన్ కాలంలో కిషోర్ ఏ కోర్టులోనూ, ట్రైబ్యునల్‌లోనూ హాజరు కావడం, వాదించడం లేదా ప్రాక్టీస్ చేయడం పై నిషేధం ఉంటుంది. అన్ని కోర్టులకు, హైకోర్టులకు, జిల్లా కోర్టులకు ఈ ఉత్తర్వులు పంపించారు.
ఈ ఘటనకు కొన్ని వారాల క్రితం, ఖజురాహోలో ఉన్న విష్ణు విగ్రహ పునరుద్ధరణకు సంబంధించిన పిటిషన్ విచారణలో జస్టిస్ బీఆర్ గవాయి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. ఆ తర్వాత సీజేఐ తన వ్యాఖ్యలపై స్పష్టతనిస్తూ “నేను అన్ని మతాలను గౌరవిస్తాను” అని పేర్కొన్నారు.
జ్యుడీషియల్ అసోసియేషన్ల ఖండన
ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. అధ్యక్షుడు జీ. చక్రపాణి సంతకం చేసిన ప్రకటనలో, “భారత ప్రధాన న్యాయమూర్తిపై కోర్టులో దాడి ప్రయత్నం జరగడం నాగరికతకు అవమానం” అని పేర్కొన్నారు. “ఇలాంటి సంఘటనలు మన రాజ్యాంగ విలువలను మరింత బలపరుస్తాయి. న్యాయవిధానం పట్ల మన అంకితభావం ఇలాంటి ఘటనలతో తగ్గదు” అని వెల్లడించింది.
55
బీసీఐ చర్యల పై దేశవ్యాప్తంగా మద్దతు
అడ్వకేట్ రాకేష్ కిషోర్ సస్పెన్షన్ ఉత్తర్వు తర్వాత దేశవ్యాప్తంగా న్యాయవాదులు, న్యాయమూర్తులు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. న్యాయ వ్యవస్థ గౌరవం కాపాడాలంటే ఇటువంటి చర్యలు అవసరమని వారు పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు భద్రతా విభాగం ఈ ఘటనపై అంతర్గత విచారణను ప్రారంభించింది. కిషోర్‌పై అడ్వకేట్స్ యాక్ట్, 1961 ప్రకారం తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు బార్ కౌన్సిల్ స్పష్టం చేసింది. ఈ ఘటన భారత న్యాయవ్యవస్థలో తీవ్ర ఆందోళన కలిగించినప్పటికీ, ప్రధాన న్యాయమూర్తి గవాయి చూపిన ప్రశాంతత, సమతుల్యత న్యాయ వ్యవస్థ గౌరవాన్ని మరింత పెంచింది.