PM Modi: NEET పేపర్ లీక్‌పై కేంద్రం సంచలన నిర్ణయం.. కీలక ప్రకటన చేసిన ప్రధాని మోదీ

Published : Jul 23, 2026, 10:45 AM IST

PM Modi: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన NEET పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి తాజాగా గురువారం ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఎక్స్ లో కీల‌క పోస్ట్ చేశారు.

PREV
14
పేపర్ లీక్ కేసులకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు..

పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడిన వారిపై వేగంగా విచారణ జరిపి కఠిన శిక్షలు అమలు చేయడమే లక్ష్యంగా ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ (X) ద్వారా వెల్లడించారు. దేశ యువత భవిష్యత్తు, వారి సంక్షేమం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని పేర్కొన్న ప్రధాని, విద్యార్థుల నమ్మకాన్ని దెబ్బతీసే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్నారు. అవసరమైన అన్ని చర్యలను వేగంగా అమలు చేయాలని సంబంధిత అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

24
విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు ఆడితే కఠిన చర్యలే

పరీక్షల వ్యవస్థలో పారదర్శకతను కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని ప్రధాని స్పష్టం చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీ ద్వారా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టే వారిని చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. వేగవంతమైన విచారణతో పాటు దోషులకు త్వరితగతిన శిక్షలు అమలయ్యేలా కొత్త వ్యవస్థ పనిచేస్తుందని తెలిపారు. పరీక్షల నిర్వహణలో విశ్వసనీయత పెంచేందుకు ఇప్పటికే పలు సంస్కరణలు చేపడుతున్నామని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు కూడా అదే క్రమంలో తీసుకున్న కీలక నిర్ణయమని వివరించారు.

34
జంతర్‌మంతర్ నుంచి దేశవ్యాప్తంగా నిరసనలు.. మూడు ప్రధాన డిమాండ్లు

ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద ప్రారంభమైన విద్యార్థుల ఆందోళనలు క్రమంగా దేశంలోని పలు నగరాలకు విస్తరించాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వివిధ విద్యార్థి, యువజన సంఘాలు నిరసనలు కొనసాగిస్తున్నాయి. నిరసనకారులు ప్రభుత్వం ముందుంచిన ప్రధాన డిమాండ్లు ఇవే.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. పేపర్ లీక్ ఘటనల కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం అందించాలి. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదు చేసిన కేసులు, ఎఫ్‌ఐఆర్‌లను వెంటనే ఉపసంహరించుకోవాలి. ఈ డిమాండ్లు నెరవేరే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని విద్యార్థి సంఘాల ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.

44
ఢిల్లీలో ఉద్రిక్తత.. పోలీసు-నిరసనకారుల మధ్య ఘర్షణ

ఢిల్లీలో నిర్వహించిన 'చలో సంసద్' కార్యక్రమం సందర్భంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారిన విష‌యం తెలిసిందే. నిరసనకారులు, పోలీసుల మధ్య జరిగిన తోపులాటలో పలువురు గాయపడ్డారు. ఢిల్లీ పోలీసుల వివరాల ప్రకారం, ప్రత్యేక కమిషనర్, జాయింట్ కమిషనర్ స్థాయి అధికారులతో పాటు మహిళా పోలీసు సిబ్బంది సహా 118 మందికిపైగా పోలీసులు గాయపడ్డారు. మరోవైపు దాదాపు 60 మంది నిరసనకారులు, విద్యార్థులు కూడా గాయపడినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పందిస్తూ పేపర్ లీకేజీ వంటి తీవ్రమైన అంశాన్ని రాజకీయ వివాదంగా కాకుండా, విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా సమగ్రంగా చర్చించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పరీక్షలపై విద్యార్థుల్లో నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు కొనసాగిస్తోందని పేర్కొన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories