Pahalgam Terror Attack
పహల్గాం ఉగ్రదాడిని భారత్ చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ అధ్యక్షతన భద్రతా కేబినెట్ కమిటీ సమావేశంలో సుదీర్ఘ చర్చల అనంతరం పాకిస్థాన్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా పాక్ పౌరులను ఇకపై భారతదేశంలో అడుగుపెట్టనివ్వొద్దని నిర్ణయించారు... ఇందుకోసం వెంటనే ఆ దేశానికి వీసాలు రద్దు చేసింది. ఇప్పటికే పాకిస్థాన్ పౌరులకు జారీచేసిన వీసాలు 27-04-2025 తో ముగుస్తాయని... మెడికల్ వీసాలు మాత్రం 29-04-2025 తో ముగుస్తాయని ప్రకటించారు. కాబట్టి ఇండియాలో ఉన్న పాకిస్థాన్ పౌరులు వెంటనే దేశాన్ని విడిచివెళ్లాలని ఆదేశించారు. అలాగే ఇండియన్స్ పాకిస్థాన్ వెళ్లకూడదని... ఇప్పటికే అక్కడ ఎవరైనా ఉంటే తిరిగిరావాలని సూచించారు.
Pahalgam Terror Attack
భారతీయ విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్ పొందిన పాక్ విద్యార్థుల పరిస్థితేంటి?
పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ సంబంధాలు మరింత దిగజారాయి. ఈ ఘటన తర్వాత పాకిస్థాన్ పై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ పెరిగింది.. దీంతో మోదీ సర్కార్ కూడా ఆ దిశగానే నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే పాకిస్థాన్ వీసాలను రద్దు చేసారు... వెంటనే ఆ దేశస్తులు భారత్ ను వీడాలని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రతి ఏటా భారతీయ విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్ పొందే పాకిస్థానీ విద్యార్థుల భవిష్యత్తు ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది.
ప్రతి సంవత్సరం బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, టాంజానియా వంటి దేశాల నుండి వేలాది మంది విద్యార్థులు భారతీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందుతారు. వీరిలో పాకిస్థాన్ విద్యార్థులు కూడా ఉన్నారు. వీరు వైద్య, ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, న్యాయశాస్త్రం వంటి కోర్సుల్లో చదువుకోవడానికి భారత్‌కు వస్తారు. అయితే ఇకపై పాకిస్థానీ విద్యార్థులకు భారతీయ వీసా పొందడం చాలా కష్టం.
Pahalgam Terror Attack
కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం, పాకిస్థానీ విద్యార్థులు భారత్‌లో అడ్మిషన్ పొందాలంటే రెండు దేశాల ప్రభుత్వాల నుండి అనుమతి తీసుకోవాలి. విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ పొందడమే కాకుండా వారి ఆర్థిక స్థితికి సంబంధించిన ఆధారాలు, భారత్‌లో వారి బస గురించి పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
ప్రతి సంవత్సరం పాకిస్థాన్ నుండి చాలా మంది విద్యార్థులు ఉన్నత విద్య కోసం భారత్‌లో దరఖాస్తు చేసుకుంటారు. కానీ వీరిలో చాలా మందికి వీసా లభించదు. చాలా సార్లు భద్రతా కారణాల దృష్ట్యా దరఖాస్తులు తిరస్కరించబడతాయి. ఇప్పుడు పహల్గామ్ వంటి ఘటనల తర్వాత ఈ ప్రక్రియ మరింత కఠినతరం అయ్యింది. పాకిస్థానీ పౌరులెవ్వరికీ భారత్ లో అడుగుపెట్టనివ్వకూడదనేది మోదీ సర్కార్ విధానంగా తెలుస్తోంది... కాబట్టి విద్యార్థులకు కూడా అనుమతి ఇవ్వకపోవచ్చు.
Pahalgam Terror Attack
ఇప్పటికే అడ్మిషన్ పొందిన పాక్ విద్యార్థుల గతి?
ఇప్పటికే భారతీయ కళాశాలల్లో అడ్మిషన్ పొంది వీసా కోసం ఎదురు చూస్తున్న పాకిస్థానీ విద్యార్థుల పరిస్థితి ఏమిటనేది అర్థంకావడంలేదు. పహల్గామ్ తర్వాత భారత వీసా విధానం మరింత కఠినతరం అయ్యింది కాబట్టి వారు ఇక భారత్ లో అడుగుపెట్టడం, ఇక్కడ చదువుకోవడం అసాధ్యమనే చెప్పాలి.
Pahalgam Terror Attack
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడం, వీసాలు నిలిపివేయడం, పాకిస్థానీ పౌరులను భారత్ విడిచి వెళ్ళమని ఆదేశించడం, అటారీ సరిహద్దును మూసివేయడం వంటి కఠిన చర్యలు తీసుకుంది. అంతేకాకుండా, SAARC వీసా పథకం కింద పాకిస్థానీ పౌరులకు భారత్ లోకి ప్రవేశం లేదు.
భారత్-పాక్ సంబంధాలు మరింత దిగజారే అవకాశం ఉంది... దీని ప్రభావం ఇప్పటికే భారతీయ విద్యాసంస్థల్లో చదువుకోవాలనుకుంటున్న పాకిస్థానీ విద్యార్థులపై కూడా పడుతుంది. మెడికల్ వీసాలనే రద్దు చేస్తున్న భారత్ స్టూడెంట్స్ వీసాలను అనుమతిస్తుందని అనుకోవడంలేదు. ప్రతి పాకిస్థాని దేశాన్ని వీడాలన్న ఆదేశాల నేపథ్యంలో ఈ విద్యార్థులు కూడా భారత్ ను వీడాల్సి ఉంటుంది.