Nitin Nabin : బీజేపీ బాస్‌గా నితిన్ నబిన్.. మోదీ, షా వేసిన ఈ మాస్టర్ స్కెచ్ వెనుక అసలు కథ ఇదే !

Published : Jan 19, 2026, 08:21 PM IST

BJP National President : బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడిగా 45 ఏళ్ల నితిన్ నబిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సీనియర్లను కాదని అధిష్ఠానం యువ నేతకు పట్టం కట్టడం వెనుక ఉన్న వ్యూహం, నితిన్ రాజకీయ ప్రస్థానం పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

PREV
16
కమలం మార్క్ రాజకీయం.. ఏకగ్రీవంగా బీజేపీ కొత్త బాస్ ఎన్నిక

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఎవరూ ఊహించని విధంగా, సీనియర్ రాజకీయ ఉద్దండులను పక్కనపెట్టి, కేవలం 45 ఏళ్ల వయసున్న యువనేత చేతికి కమలం పార్టీ పగ్గాలు వెళ్లాయి. బీహార్‌కు చెందిన ఫైర్ బ్రాండ్ లీడర్ నితిన్ నబిన్ బీజేపీ 12వ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం (జనవరి 19న) జరిగిన నామినేషన్ల ఘట్టం ఒక ఆసక్తికరమైన మలుపుతో ముగిసింది. అసలు ఈ ఎంపిక వెనుక మోదీ-షాల వ్యూహం ఏమిటి? ఒక సామాన్య ఎమ్మెల్యే స్థాయి నుంచి జాతీయ అధ్యక్షుడి వరకు నితిన్ ప్రస్థానం ఎలా సాగింది?

26
బీజేపీ 12వ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ ఏకగ్రీవం వెనుక షా ప్రణాళిక

బీజేపీ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను అధిష్ఠానం ఒక పకడ్బందీ వ్యూహంతో నడిపించింది. సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు నామినేషన్ల స్వీకరణకు సమయం కేటాయించారు. అయితే, నితిన్ నబిన్ పేరును ప్రతిపాదిస్తూ ఏకంగా 37 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, జి.కిషన్ రెడ్డి వంటి అగ్రనేతలు ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరచడం విశేషం.

నితిన్ నబిన్ తప్ప మరెవరూ పోటీలో లేరని ఎన్నికల అధికారి ప్రకటించారు. సాయంత్రం 5 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో, ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. జేపీ నడ్డా వారసుడిగా, పార్టీ చరిత్రలో అతి పిన్న వయస్కుడైన అధ్యక్షుడిగా నితిన్ రికార్డు సృష్టించారు. జనవరి 20న ఆయన అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

36
నితిన్ నబిన్ ప్రయాణం: విషాదం నుంచి పుట్టిన నాయకత్వం

నితిన్ నబిన్ రాజకీయ ప్రవేశం ఒక విషాద సంఘటనతో మొదలైంది. ఆయన తండ్రి, బీహార్ బీజేపీ సీనియర్ నేత నబిన్ కిశోర్ ప్రసాద్ సిన్హా ఆకస్మిక మరణంతో 2006లో నితిన్ రాజకీయాల్లోకి రాక తప్పలేదు. అప్పటికి ఆయన వయసు చాలా చిన్నది. కానీ, తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకోవడమే కాదు, తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు.

కాయస్థ సామాజిక వర్గానికి చెందిన నితిన్, రాంచీలో జన్మించారు. 1996లో పాట్నాలోని సెయింట్ మైఖేల్స్ స్కూల్ నుండి పదో తరగతి, 1998లో ఢిల్లీలోని సీఎస్‌కేఎం పబ్లిక్ స్కూల్ నుండి ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. తండ్రి మరణానంతరం పాట్నా వెస్ట్ నియోజకవర్గం ఉపఎన్నికలో పోటీ చేసి ఘన విజయం సాధించారు. అప్పటి నుండి వెనుదిరిగి చూడలేదు.

46
ఓటమి ఎరుగని యోధుడు నితిన్ నబిన్

రాజకీయాల్లోకి రావడం సులువే కావచ్చు, కానీ రెండు దశాబ్దాల పాటు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కత్తి మీద సాము లాంటిది. నితిన్ నబిన్ విషయంలో ఇదే జరిగింది. 2006 ఉపఎన్నిక మొదలుకొని.. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత బంకిపూర్ స్థానం నుండి 2010, 2015, 2020, 2025 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా గెలుపొందారు. అధిష్ఠానం దృష్టిలో పడ్డారు.

ముఖ్యంగా 2025లో జరిగిన ఎన్నికల్లో ఆయన ప్రత్యర్థి ఆర్జేడీ అభ్యర్థిపై ఏకంగా 51,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం ఆయన ప్రజాదరణకు నిదర్శనం. యువ మోర్చా (BJYM) జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అనుభవం, క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో ఆయనకున్న సంబంధాలే ఆయన్ను ఇంతటి స్థాయికి చేర్చాయి.

56
మంత్రిగా మార్క్.. పార్టీలో పవర్ గా నితిన్ నబిన్

కేవలం ఎమ్మెల్యేగానే కాకుండా, నితీష్ కుమార్ మంత్రివర్గంలో కీలక శాఖలను సమర్థంగా నిర్వహించి నితిన్ తన పరిపాలనా దక్షతను నిరూపించుకున్నారు. రోడ్డు నిర్మాణ శాఖ, పట్టణాభివృద్ధి శాఖ, గృహనిర్మాణ శాఖ మంత్రిగా ఆయన బీహార్ ముఖచిత్రాన్ని మార్చే ప్రయత్నం చేశారు. మౌలిక సదుపాయాల కల్పనలో ఆయన పనితీరును కేంద్ర నాయకత్వం నిశితంగా గమనించింది.

పార్టీ పరంగా చూస్తే.. సిక్కిం ఇంచార్జిగా, ఛత్తీస్‌గఢ్ కో-ఇంచార్జిగా వ్యవహరించి ఆయా రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. 2025 డిసెంబర్‌లో బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టినప్పుడే, ఆయన తదుపరి అధ్యక్షుడవుతారనే సంకేతాలు వెలువడ్డాయి. జాతీయ ఐక్యతా యాత్ర, అమరవీరులకు నివాళిగా నిర్వహించిన పాదయాత్రలు ఆయనలోని దేశభక్తిని, నాయకత్వ లక్షణాలను బయటపెట్టాయి.

66
నితిన్ నబిన్ ముందున్న సవాళ్లు

యువ రక్తాన్ని పార్టీకి ఎక్కించాలన్న మోదీ ఆలోచన బాగున్నా, నితిన్ నబిన్ ముందున్నవి పూల బాటలు కాదు. 2026లో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం వంటి కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దక్షిణాదిలో పార్టీని విస్తరించడం, బెంగాల్‌లో మమతా బెనర్జీని ఢీకొట్టడం ఆయన ముందున్న తక్షణ కర్తవ్యాలు.

అంతేకాకుండా, 2029 లోక్‌సభ ఎన్నికల నాటికి పార్టీని సంసిద్ధం చేయడం, మహిళా రిజర్వేషన్ల అమలు, నియోజకవర్గాల పునర్విభజన వంటి సంక్లిష్ట అంశాలను ఆయన డీల్ చేయాల్సి ఉంది. 45 ఏళ్ల వయసులో ఇంతటి బరువైన బాధ్యతను ఆయన ఎలా మోస్తారో, మోదీ-షాల నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకుంటారో వేచి చూడాలి. ఏది ఏమైనా, నితిన్ నబిన్ ఎంపిక బీజేపీ వేసిన ఒక ఊహించని మాస్టర్ స్ట్రోక్ అని చెప్పక తప్పదు.

Read more Photos on
click me!

Recommended Stories