Published : Sep 10, 2025, 12:19 PM ISTUpdated : Sep 10, 2025, 12:28 PM IST
నేపాల్ లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది… అక్కడ చిక్కుకున్న మనవారిని సురక్షితంగా తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తోంది. ఏపీ ప్రభుత్వం కూడా తెలుగువారి కోసం హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటుచేసింది. ఆ నంబర్లివే
ప్రస్తుతం మన పొరుగుదేశం నేపాల్ అట్టుడికిపోతోంది. అక్కడ ఏ క్షణం ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి ఉంది. చివరికి దేశ అధ్యక్షుడు, ప్రధాని, మంత్రులు, ప్రభుత్వ అధికారులు ప్రాణభయంతో బిక్కుబిక్కుమనే పరిస్థితి నెలకొంది... దేశ అత్యున్నత పాలనా భవనం పార్లమెంట్ తో పాటు సుప్రీంకోర్టు, అధ్యక్ష, ప్రధాని భవనాలు నిప్పుల్లో కాలిపోతున్నాయి. ప్రజలు మరీముఖ్యంగా యువత రోడ్లపైకి వచ్చి భారీఎత్తున నిరసన తెలుపుతూ పాలకులు, అధికారులను చితకబాదుతున్నారు. ఇలా సోషల్ మీడియాపై దేశంలో విధించిన నిషేదం 'జెన్-జడ్' ఉద్యమానికి దారితీసింది... ఇదికాస్త ఉదృతమై దేశవ్యాప్తంగా అల్లర్లకు కారణమయ్యింది.
25
నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారు... ఎంతమందో తెలుసా?
నేపాల్ లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది... అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ ప్రజల వివరాలు సేకరిస్తున్నాయి. ఇలా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కూడా నేపాల్ లోని భారత రాయబార కార్యాలయంతో వివిధ మార్గాల ద్వారా తెలుగువారి సమాచారం సేకరిస్తున్నారు. ఇలా ఇప్పటివరకు నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారి సంఖ్య 187 మందిగా తేలింది.
నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారు నాలుగు ప్రాంతాల్లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. బఫాల్ లో 27 మందితో కూడిన తెలుగు బృందం ఉంది... వీరంతా శ్రీధరాచార్యుల పర్యవేక్షణలో ఉన్నారు. సిమిల్ కోట్ లో 12 మంది, పశుపతి నగరంలో 55, గౌశాలలోని పింగలస్థాన్ లో 90 మంది తెలుగువారు ఉన్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతానికి వీరంతం సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
35
తెలుగు ప్రజల కోసం స్వయంగా రంగంలోకి నారా లోకేష్
నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా తీసుకువచ్చేందకు స్వయంగా ఆంధ్ర ప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ రంగంలోకి దిగారు. ఆయన భారతదేశంలోని విదేశాంగ శాఖ అధికారులు, నేపాల్ లోని భారత రాయబారి నవీన్ శ్రీ వాస్తవ ద్వారా ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితిని తెలుసుకుంటున్నారు... తెలుగు ప్రజల భద్రతే ప్రాధాన్యంగా తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం కేంద్ర ఏజెన్సీలు, నేపాల్ లోని భారత రాయబార కార్యాలయ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపేందుకు, వేగంగా నిర్ణయాలు తీసుకోవడం కోసం వార్ రూమ్ ను ఏర్పాటుచేశారు.
మంత్రి నారా లోకేష్ ఇవాళ్టి అనంతపురం పర్యటన రద్దు చేసుకున్నారు. నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారిని వెనక్కి తీసుకురావడంపై మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి పెట్టారు... ఇందుకోసం ఆయన అనంతపురంలో ఎన్డీఏ కూటమి పార్టీల ''సూపర్ సిక్స్-సూపర్ హిట్'' సభకు వెళ్లడం లేదు. సచివాలయంలో ఆర్టీజీఎస్ వేదికగా ప్రత్యేక వార్‌రూమ్ ఏర్పాటుచేసి మంత్రులు, అధికారులతో సమన్వయం చేసుకుంటూ మంత్రి లోకేష్ నిర్ణయాలు తీసుకుంటున్నారు.
నేపాల్ లో చిక్కుకున్న భారతీయుల కోసం హెల్ప్ లైన్ నంబర్లు
నేపాల్ 'జెన్-జెడ్' ఉద్యమం, హింసాత్మక ఘటనల నేపథ్యం భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ దేశంలోని భారతీయులకు సహాయం కోసం ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటుచేసింది.
నేపాల్ లో చిక్కుకున్న భారత ప్రజలు +977 – 980 860 2881 లేదా +977 – 981 032 6134 నంబర్లకు ఫోన్ చేసి తమ సమాచారం అదించవచ్చు. లేదంటే వాట్సాప్ ద్వారా కూడా ఈ నెంబర్లను సంప్రదించి సహాయం పొందవచ్చు.
55
నేపాల్ చిక్కుకున్న తెలుగువారు సంప్రదించాల్సిన హెల్ప్ లైన్ నంబర్లివే
ఆంధ్రప్రదేశ్ కు చెందినవారు నేపాల్ లో చిక్కుకుపోయి ఏదైనా అత్యవసర సహాయం కావాలంటే లేదా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే వెంటనే ఈ కింది హెల్ప్ లైన్ నంబర్లు, ఇమెయిల్ ను సంప్రదించవచ్చు.
ఢిల్లీలోని ఏపీ భవన్ : +91 9818395787
APNRTS 24/7 హెల్ప్ లైన్ నంబర్లు: 0863 2340678
వాట్సాప్ నంబర్: +91 8500027678
ఇమెయిల్: helpline@apnrts.com లేదా info@apnrts.com లకు ఇమెయిల్ ద్వారా కూడా సంప్రదించవచ్చు.