దక్షిణ భారతదేశంలో, మరీ ముఖ్యంగా తమిళనాడులో అత్యంత ప్రజాదరణ పొందిన సాహస క్రీడ జల్లికట్టు. జనవరి 3న తమిళనాడులో ఈ సీజన్ అధికారికంగా ప్రారంభమైంది. పైకి చూడ్డానికి ఇది ఒక సాధారణ క్రీడలా కనిపించినప్పటికీ, దీని వెనుక కొన్ని వేల సంవత్సరాల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు దాగి ఉన్నాయి. పొంగల్ పండుగ వేళ ఎద్దులను మచ్చిక చేసుకునే ఈ ఆటలో గెలిచిన వారికి బహుమతులతో పాటు సామాజికంగా గొప్ప గౌరవం కూడా లభిస్తుంది.
భారతదేశంలోని ప్రతి రాష్ట్రానికి ఒక్కో ప్రత్యేకమైన క్రీడ ఉన్నట్టే, తమిళనాడుకు జల్లికట్టు ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది.
జల్లికట్టు క్రీడకు దాదాపు 2,000 సంవత్సరాల ఘనమైన చరిత్ర ఉంది. సింధు లోయ నాగరికత కాలంలోనే ఈ క్రీడ ఆనవాళ్లు ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. తమిళనాడు గడ్డపై దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం వినోదం మాత్రమే కాదు, శక్తికి, ధైర్యానికి ప్రతీకగా నిలుస్తుంది.
ఈ క్రీడలో పాల్గొనే వ్యక్తి, నిర్ణీత సమయం లేదా దూరం వరకు ఎద్దు మూపురాన్ని పట్టుకొని వేలాడాల్సి ఉంటుంది. ఇలా విజయవంతంగా పూర్తి చేసిన వారికి వివిధ రకాల బహుమతులు అందజేస్తారు. ఈ క్రీడ కోసం పులికులం, కాంగేయం వంటి ప్రసిద్ధ జాతుల ఎద్దులను ప్రత్యేకంగా పెంచుతారు.
ప్రధానంగా వ్యవసాయ ఆధారిత క్రీడ అయిన జల్లికట్టును జనవరి మధ్యలో వచ్చే సంక్రాంతి సమయంలో నిర్వహిస్తారు. గతంలో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వరుడిని ఎంపిక చేయడానికి కూడా ఈ పోటీని నిర్వహించేవారని ప్రచారంలో ఉంది.
తమిళనాడు జల్లికట్టు సంప్రదాయంలో పుదుక్కోట్టై జిల్లాలోని తచ్చనకురిచ్చి గ్రామానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి ఏటా జల్లికట్టు సీజన్ ఇక్కడి నుండే ప్రారంభం కావడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సంవత్సరం కూడా జనవరి 3, 2026న తచ్చనకురిచ్చిలో తొలి జల్లికట్టు నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇది రాష్ట్రవ్యాప్తంగా జరగబోయే పోటీలకు నాంది పలికింది.
తమిళనాడులో అత్యధిక సంఖ్యలో వాడివాసల్స్ అంటే ఎద్దులు మైదానంలోకి ప్రవేశించే ద్వారాలు ఉన్న జిల్లాగా పుదుక్కోట్టై ప్రసిద్ధి చెందింది. అందుకే ఈ జిల్లా వ్యవస్థీకృత జల్లికట్టు పోటీలకు కేంద్ర బిందువుగా మారింది.
ఈ క్రీడలో పాల్గొనేవారి సంఖ్య, ప్రమాదాల తీవ్రతను గత గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక్కడ 2025లో జరిగిన పోటీల్లో సుమారు 600+ ఎద్దులతో పాటు చాలా మంది పాల్గొన్నారు. ఈ పోటీలను చూడటానికి పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారు. పోటీల సమయంలో చాలా మందే గాయపడ్డారు. 2024 లో కూడా 22 మందిక పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ గణాంకాలను దృష్టిలో ఉంచుకొని, ప్రభుత్వం భద్రతా ప్రమాణాలను మరింత కఠినతరం చేసింది. ప్రమాదాలను నివారించడానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది.
క్రీడ స్వభావం రీత్యా, 2014లో సుప్రీంకోర్టు జల్లికట్టుపై నిషేధం విధించింది. అయితే, ఈ నిర్ణయం పట్ల తమిళనాడు ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. సంస్కృతిని కాపాడాలంటూ పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఫలితంగా, 2017లో తమిళనాడు ప్రభుత్వం ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ యాక్ట్, 1960 కు సవరణలు చేసి, ఒక ఆర్డినెన్స్ ద్వారా నిషేధాన్ని ఎత్తివేసింది.
ప్రస్తుతం జల్లికట్టును చట్టబద్ధంగా నిర్వహిస్తున్నప్పటికీ, దీనిపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుంది. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ, వెటర్నరీ అధికారుల సూచనల మేరకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOPs) కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఎద్దుల ఆరోగ్య పరీక్షలు, అంబులెన్స్ సౌకర్యాలు, వైద్య బృందాలు, ప్రేక్షకుల కోసం ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేయడం తప్పనిసరి. ఏదైనా నిబంధన ఉల్లంఘన జరిగితే అనుమతులు రద్దు చేస్తారు.
జల్లికట్టు నిర్వహణలో పారదర్శకతను పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోటీల నిర్వహణ కోసం దరఖాస్తులను కేవలం ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా మాత్రమే సమర్పించాలని ఆదేశించింది. మాన్యువల్ దరఖాస్తులను స్వీకరించడం లేదు. ఈ డిజిటల్ విధానం వల్ల నిబంధనల అమలును రియల్ టైమ్‌లో ట్రాక్ చేయడం సులభమవుతుంది.
జిల్లా యంత్రాంగం మైదానంలో పరిస్థితులను పర్యవేక్షిస్తుంది. ఈ క్రీడ కేవలం వినోదం మాత్రమే కాదు, ఇది తమిళనాడు ఆత్మగౌరవానికి, గ్రామీణ సంస్కృతికి అద్దం పడుతుంది. పాప్ కల్చర్‌లో కూడా దీనికి స్థానం ఉంది. 2019లో వచ్చిన మలయాళ చిత్రం జల్లికట్టు టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమై ప్రశంసలు అందుకుంది.