
Bullet Train : భారతీయ రైల్వే చరిత్రలోనే అత్యంత వేగవంతమైన రైలు త్వరలోనే పరుగులు తీయనుంది. కేంద్ర ప్రభుత్వం బుల్లెట్ రైలు ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది... స్వయంగా ప్రధాని నరేంద్ర నిర్మాణంలో ఉన్న పనులను పరిశీలించారంటేనే ఇందెంత ప్రత్యేకమో అర్థమవుతోంది. తాజాగా రైల్వే శాఖమంత్రి అశ్విని వైష్ణవ్ దేశంలో మొట్టమొదటి బుల్లెట్ రైలు ఎప్పుడు పరుగుతీస్తుందో ప్రకటించారు.
ప్రస్తుతం గుజరాత్ లోని అహ్మదాబాద్, మహారాష్ట్రలోని ముంబై మధ్య బుల్లెట్ ట్రైన్ నడిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పోరేషన్ లిమిటెడ్ (NHSRCL) ఈ ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు చేపడుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే సూరత్-వాపి మధ్య ట్రాక్ నిర్మాణంతో పాటు ఇతర పనులు వేగంగా చేపట్టినట్లు... మొదట ఈ మార్గంలో బుల్లెట్ ట్రైన్ పరుగులు ఉంటాయని రైల్వే మంత్రి తెలిపారు.
అహ్మదాబాద్-ముంబై మధ్య బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును ఒకేసారి కాకుండా దశలవారిగా ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. మొదటి దశలో గుజరాత్ ను ఎంచుకున్నారు... సూరత్ నుండి బిల్లిమోరా మధ్య 50 కిలోమీటర్ల మేర బుల్లెట్ ట్రైన్ ను నడపాలని మొదట భావించారు. ప్రయోగాత్మకంగా కొంతదూరం బుల్లెట్ ట్రైన్ ను నడిపి సాంకేతిక, ఇతర సమస్యలు తెలుసుకోవాలని... మొత్తం ప్రాజెక్టులో అవి రిపీట్ కాకుండా జాగ్రత్త పడవచ్చన్నది రైల్వే శాఖ ఆలోచనగా తెలుస్తోంది.
అయితే తాజాగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సూరత్ నుండి బిల్లిమోరా వరకు 50 కిలోమీటర్లు కాదు... వాపి వరకు 100 కిలోమీటర్లు బుల్లెట్ ట్రైన్ నవడవనున్నట్లు తెలిపారు. 2027 ఆగస్ట్ లోనే ఈ మార్గంలో బుల్లెట్ రైలు పరుగు తీస్తుందని... ఇందుకోసం శరవేగంగా నిర్మాణపనులు జరుగుతున్నాయని అన్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే 2027 సంవత్సరం భారత రైల్వే చరిత్రలో నిలిచిపోనుంది.
ప్రస్తుతం చైనా, జపాన్, ప్రాన్స్, ఇటలీ, జర్మనీ వంటి దేశాల్లో బుల్లెట్ ట్రైన్స్ నడుస్తున్నాయి. త్వరలోనే వీటి సరసకు భారత్ కూడా చేరనుంది. ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్ ను నడిపేందుకు సిద్దమయ్యింది ప్రభుత్వం. ఈ రైలు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతుంది... అంటే ముంబై-అహ్మదాబాద్ మధ్య 508 కిలోమీటర్ల దూరాన్ని కేవలం రెండు గంటల్లోనే పూర్తి చేస్తుంది. జపాన్ సహకారంతో ఈ ప్రాజెక్ట్ చేపడుతోంది భారత్... ఇందుకోసం ఏకంగా లక్ష కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. 2029 లోపు ఈ ప్రాజెక్టును పూర్తిచేయాలని… బుల్లెట్ ట్రైన్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో పనిచేస్తోంది.
ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో మొత్తం 12 స్టేషన్లను ప్రతిపాదించారు. ప్రధాన నగరాలు, పట్టణాల్లో మాత్రమే ఈ రైలు ఆగుతుంది. ముంబై, థానే, విరర్, బాయిసర్, వాపి, బిల్లిమోరా, సూరత్, భరూచ్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్ లలో బుల్లెట్ రైలు ఆగుతుంది.
ఈ బుల్లెట్ ట్రైన్ గుజరాత్ లోనే ఎక్కువదూరం నడుస్తుందని స్టేషన్లను బట్టి అర్థమవుతోంది. మహారాష్ట్రలో కేవలం నాలుగు స్టేషన్లు మాత్రమే ఉంటే గుజరాత్ లో 8 స్టేషన్లు ఉన్నాయి. అంతేకాదు మొదటి బుల్లెట్ ట్రైన్ 2027 లో సూరత్-వాపి మధ్య నడవనుంది... ఇది కూడా గుజరాత్ లోనే.
ప్రధాని నరేంద్ర మోదీ గత ఆదివారం (నవంబర్ 16న) గుజరాత్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన సూరత్ లో నిర్మాణంలో ఉన్న బుల్లెట్ ట్రైన్ స్టేషన్ ను పరిశీలించారు. అలాగే రైల్వే, ఇతర అధికారులు, నిర్మాణ సంస్థతో అహ్మదాబాద్-ముంబై బుల్లెట్ ట్రైన్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. దీన్నిబట్టే ఈ ప్రాజెక్ట్ ను కేంద్రం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్థమవుతోంది.