High Court: సమాజంలో మార్పులు వచ్చాయని, పెళ్లికి ముందే శారీరకంగా కలవడం సర్వసాధారణంగా మారిందని మద్రాస్ హైకోర్ట్ వ్యాఖ్యానించింది. తనను ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ ఓ యువతి చేసిన ఫిర్యాదుపై హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
తిరునెల్వేలి జిల్లాకు చెందిన ఓ యువతి తన ప్రియుడు దేవా విజయ్‌పై వళ్లియూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కళాశాల దశలో ప్రేమ మొదలై, తొమ్మిదేళ్లు అతనితో శారీరక సంబంధం కొనసాగిందని, చివరికి వివాహానికి నిరాకరించాడని ఆమె ఆరోపించింది. ఈ కేసు రద్దు చేయాలని విజయ్ మదురై ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేశాడు.
25
ఆధారాలు లేవన్న న్యాయమూర్తి
విచారణలో జస్టిస్ పుగళేంది ఆ ఇద్దరి బంధం సుదీర్ఘ కాలం కొనసాగిన విషయాన్ని పరిశీలించారు. యువతి ఈ వ్యవహారానికి ఎప్పుడూ వ్యతిరేకత చూపలేదని, అందువల్ల అది పరస్పర సమ్మతితో జరిగిన చర్యగా పరిగణించవచ్చని కోర్టు అభిప్రాయపడింది. ఫిర్యాదులో పేర్కొన్న “వివాహ హామీ ఇచ్చి మోసం చేశాడు” అన్న ఆరోపణకు స్పష్టమైన ఆధారాలు లేవని న్యాయమూర్తి పేర్కొన్నారు.
35
కోర్టు స్పష్టం చేసిన కీలక వ్యాఖ్యలు
జస్టిస్ పుగళేంది వ్యాఖ్యానిస్తూ, “ప్రస్తుత కాలంలో వివాహానికి ముందే శారీరక సంబంధాలు ఏర్పడటం అసాధారణం కాదు. ప్రేమ బంధంలో ఏర్పడే నిర్ణయాలు వ్యక్తిగతమైనవి. ఆ బంధం ప్రేమ నుంచి వచ్చిందా, భవిష్యత్తులో వివాహకోసం సాగిందా, లేక పరస్పర ఆనందం కోసమా అనేది ఆ వ్యక్తులకు మాత్రమే తెలుసు” అని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో కోర్టు ఖచ్చితమైన తీర్పు ఇవ్వడం కష్టం అని ఆయన వ్యాఖ్యానించారు.
జంట మధ్య వ్యక్తిగత విభేదాలు వచ్చినప్పుడల్లా క్రిమినల్ చట్టాలు ఉపయోగించడం ఆరోగ్యకరం కాదని కోర్టు సూచించింది. ఇలాంటి ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన సమస్యలను క్రిమినల్ కేసులుగా మార్చడం న్యాయ వ్యవస్థపై భారంగా మారుతుందని వ్యాఖ్యానించింది.
55
చివరిగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే.?
అభియోగాలకు సరైన ఆధారాలు లేవని, పిటిషన్‌లో చెప్పిన విషయాలు న్యాయ ప్రక్రియను తప్పుగా ఉపయోగించడమేనని భావించిన కోర్టు ఈ కేసును పూర్తిగా రద్దు చేసింది. ప్రేమ విభేదాలను క్రిమినల్ కేసులుగా మలచడం సమంజసం కాదని మరోసారి న్యాయస్థానం స్పష్టం చేసింది.