భారత్ ఫ్రాన్స్ నుంచి 114 రఫేల్ విమానాలను కొనుగోలు చేయడానికి ప్రణాళికలు రచిస్తుండటంతో, సమీప భవిష్యత్తులో భారత వైమానిక దళం (IAF) స్క్వాడ్రన్ల సంఖ్య గణనీయంగా పెరగనుంది. ప్రస్తుతం ఐఏఎఫ్ స్క్వాడ్రన్ల సంఖ్య ఆందోళనకరంగా 29కి పడిపోయింది.
ఇప్పటికే 40 తేజస్ మార్క్-1 విమానాలు వినియోగంలో ఉండగా, హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) నుంచి మొత్తం 180 4.5వ తరం తేజస్ మార్క్-1A జెట్‌ల కోసం ఐఏఎఫ్ ఒప్పందం చేసుకుంది. రాబోయే ఏళ్లలో రఫేల్, తేజస్ మార్క్-1A విమానాలు తోడవ్వడంతో, ఐఏఎఫ్ ఫైటర్ ఫ్లీట్ పోరాట పటిమ పెరగడమే కాకుండా వాటి సంఖ్య కూడా పెరుగుతుంది.
మరోవైపు భారత్ 5వ తరం అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA)పై కూడా పనిచేస్తోంది. 2029 తర్వాత వీటిని వైమానిక దళంలో చేర్చడం ప్రారంభించే అవకాశం ఉంది. 2030 నాటికి దాదాపు 200కి పైగా జగ్వార్, మిరాజ్ 2000, మిగ్-29 ఫైటర్ విమానాలు ఫేజ్ అవుట్ ముగించుకోనున్న నేపథ్యంలో... రఫేల్, తేజస్ మార్క్-1A, ఏఎంసీఏల చేరిక దేశానికి అత్యంత వ్యూహాత్మక ప్రాధాన్యంగా మారింది.