
Operation Sindoor : పహల్గాం ఉగ్రదాడి తర్వాత పూర్తిగా దెబ్బతిన్న భారత్-పాకిస్థాన్ సంబంధాలు తాజా ఆపరేషన్ తర్వాత తారాస్థాయికి చేరాయి. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య యుద్దమేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. ఏ క్షణమైనా ఎవరు ఎవరిపై అయినా దాడి చేయవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. యుద్దమే జరిగితే కేవలం సైనికులకే కాదు సామాన్యుల ప్రాణాలకు రక్షణ ఉండదు. ఇలాంటి ప్రమాదకర సమయంలో ప్రాణాలు కాపాడుకునేందుకు ఏం చేయాలి? దేశరక్షణ కోసం మనవంతు సాయంగా ఏం చేయాలి? అనేది ఇక్కడ తెలుసుకుందాం.
1. ప్రభుత్వ సూచనలు పాటించడం :
యుద్ద సమయంలో తమ దేశ ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తాయి. ఓవైపు సైనికులతో శత్రువులను ధీటుగా ఎదిరిస్తూనే మరోవైపు ప్రజలు ఈ యుద్దంవల్ల ఎఫెక్ట్ కాకుండా చర్యలు చేపడుతుంటారు. కాబట్టి యుద్ద సమయాల్లో ప్రభుత్వం ఇచ్చే సూచనలను తప్పకుండా పాటించాలి. ఏ ప్రాంతాలు సురక్షితంగా ఉన్నాయో, ఎక్కడికి వెళ్లాలి, ఎక్కడ ఉండకూడదో వంటి సమాచారం అధికారికంగా వస్తుంది. వాటిని బట్టి ప్రణాళికలు వేసుకోవాలి. యుద్ద సమయంలో కంఫర్ట్ కంటే ప్రాణాలకు కాపాడుకోడానికే ప్రాధాన్యత ఇవ్వాలి.
2. నిత్యావసరాలను ముందే సిద్దంచేసుకోవాలి :
ఇటీవల కరోనా సమయంలో లాక్ డౌన్ విధిస్తేనే నిత్యావసరాల కోసం ప్రజలు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అలాంటిది యుద్ద సమయంలో మరింత ఉద్రిక్తత పరిస్థితులుంటాయి... కాబట్టి నిత్యావసరాల కొరత రావచ్చు. అందుకే యుద్దం జరిగే అవకాశం ఉందని తెలియగానే ఎక్కువరోజులకు సరిపడా వంట పదార్థాలను సేకరించి దాచుకోవాలి. ఇలా అహార పదార్థాలకు సంబంధించినవే కాదు మెడిసిన్స్ వంటి అత్యవసర వస్తువులను అదనంగా పెట్టుకోవాలి. కొంతకాలం బయటకు వెళ్లకపోయినా ఇంట్లోనే అన్ని నిత్యావసరాలు ఉండేలా ప్లాన్ చేసుకోవాలి.
3. ధైర్యంగా ఉండాలి.
యుద్ద పరిస్థితుల్లో మనోధైర్యం కోల్పోవద్దు. ఎప్పుడు ఏం జరుగుతుందో అనుకుంటూ ఆందోళనకు గురికావచ్చు. ముఖ్యంగా యుద్ద పరిస్థితుల గురించి వార్తలను చూసి బెంబేలెత్తిపోవడం... పేలుళ్లు, సైనిక కదలికలు చూసి భయపడకూడదు. ఈ భయం మీ కుటుంబాన్ని కూడా భయపెట్టవచ్చు. కాబట్టి ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటాను అనే గుండెధైర్యంతో ఉండాలి. అవసరం అయితే కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పే స్థాయిలో ఉండాలి. భయంతో తీసుకునే తప్పులు మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టవచ్చు... ఒక్కోసారి ప్రాణాంతకంగా మారవచ్చు.
4. తప్పుడు వార్తలు నమ్మవద్దు
యుద్ద సమయంలో అక్కడలా జరిగింది.. ఇక్కడిలా జరిగిందనే తప్పుడు ప్రచారం వేగంగా వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు ఎక్కువగా వస్తుంటాయి... కాబట్టి అన్నింటినీ గుడ్డిగా నమ్మకూడదు. అధికారంగా వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలి... తప్పుడు వార్తలు నిజమేనని నమ్మి ఇతరులకు షేర్ చేయకూడదు. దీనివల్ల ప్రజల మధ్య గందరగోళం పెరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఏదయినా వదంతు మనవరకు వచ్చినా దాన్ని అక్కడే ఆపాలి... ఇతరులకు చెప్పి మరింత వ్యాపింపచేయకూడదు.
5. దేశ భద్రతకు సహకరించాలి :
దేశం బాగుంటేనే మనం బాగుండేది... దేశమే లేకుంటే మనం కూడా ఉండం. కాబట్టి అత్యవసర సమయాల్లో ప్రభుత్వం కోరితే దేశ రక్షణకు రెడీ కావాలి. ప్రభుత్వం, సైన్యం కోరిన సహాయం అందించాలి. కొందరు వాలంటీర్‌లుగా పనిచేయవచ్చు... కొందరు ఆర్థిక సహాయం చేయవచ్చు. యువత అయితే పోలీసులకు, రెడ్ క్రాస్ లాంటి సంస్థలకు సహాయం చేయగలరు. ఇలా మనకు తోచిన సాయం చేసి క్లిష్ట సమయాల్లో దేశానికి తగిన సహకారం అందించారు.
6. పిల్లలు, వృద్ధులు, స్త్రీల భద్రత:
యుద్ద సమయాల్లో ఎక్కువగా ప్రభావితం అయ్యేది పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు. ఇలాంటివారి రక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వారి కోసం సురక్షిత ప్రదేశాలు ఏర్పాట్లు చేయాలి. అవసరమైన వసతులు వారికి కల్పించాలి.
7. అనవసర ప్రయాణాలు వద్దు
యుద్ద సమయంలో రహదారులు సురక్షితం కాదు..బయట ఏ క్షణంలో ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు. కాబట్టి ఇంట్లోనే ఉండటం మంచిది... ప్రయాణాలు పెట్టుకోవద్దు. యుద్ద సమయంలో ఎక్కువగా బయట ఉండటమంటే ఎక్కువ ప్రమాదం ఉన్నట్లే.
8. దేశం కోసం ఏకమవ్వాలి:
దేశం కోసం అంతా ఏకం కావాలి... కులమతాలు, వివాదాలు, రాజకీయాలు, పక్షపాతాలు పక్కనబెట్టి ఒకటిగా ఉండాలి. దేశ భద్రత ముందు మన వ్యక్తిగత విషయాలు చిన్నవే. కాబట్టి యుద్ద సమయంలో ఒకరికొకరు సహకారం అందించుకునేందుకు ఏకం కావాలి.