India vs China : ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌ల సరిహద్దుల్లో చైనా కార్యకలాపాలు పెరుగుతుండటంతో భారత సైన్యం అప్రమత్తమైంది. ఎల్‌ఏసీ మిడిల్ సెక్టార్‌లో నిఘాను, మౌలిక సదుపాయాలను భారత్ భారీగా పెంచుతోంది.
ఉత్తరాఖండ్, హిమాచల్ సరిహద్దుల్లో హై అలర్ట్: చైనా కుట్రలను తిప్పికొట్టేందుకు సైన్యం సిద్ధం
సరిహద్దు వెంబడి చైనా తన దూకుడును పెంచుతుండటం, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) గస్తీ బృందాల ప్రవర్తన అనూహ్యంగా మారుతుండటంతో భారత సైన్యం అప్రమత్తమైంది. ముఖ్యంగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల పరిధిలోకి వచ్చే వాస్తవాధీన రేఖ (LAC) మిడిల్ సెక్టార్‌లో చైనా కార్యకలాపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత సైన్యం తన వ్యూహానికి పదును పెట్టింది. ఈ ప్రాంతంలో నిఘాను ముమ్మరం చేయడంతో పాటు, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించింది. చైనా చర్యలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టేందుకు ప్రోయాక్టివ్ వైఖరిని అవలంబిస్తోంది.
26
సరిహద్దులో మారుతున్న సమీకరణాలు
గత కొన్నేళ్లుగా మిడిల్ సెక్టార్‌లో చైనా కార్యకలాపాల్లో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. సరిహద్దుకు అవతలి వైపున చైనా తన పెట్రోలింగ్ కదలికలను పెంచింది. అంతేకాకుండా రోడ్లు, ట్రాక్‌లు, లాజిస్టిక్స్ సౌకర్యాలను శరవేగంగా నిర్మిస్తోంది. దీనికి తోడు డ్యూయల్ యూజ్ సౌకర్యాలను అభివృద్ధి చేయడం, సరిహద్దు గ్రామాలను వేగంగా సైనికీకరణ చేయడం, సైబర్ ప్రోబింగ్ వంటి చర్యలకు చైనా పాల్పడుతోంది. చైనా వైపు జరుగుతున్న ఈ పరిణామాలు ఆ దేశ దళాల త్వరితగతిన సమీకరణకు, దీర్ఘకాలిక మోహరింపునకు అవకాశం కల్పిస్తాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో భారత దళాలు కూడా తమ సన్నద్ధతను పునఃసమీక్షించుకుని, అందుకు తగ్గట్టుగా వ్యూహాలను మార్చుకుంటున్నాయి.
36
మిడిల్ సెక్టార్ భౌగోళిక సవాళ్లు
భారత్-చైనా సరిహద్దులోని మిడిల్ సెక్టార్ సుమారు 545 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. తూర్పు, పశ్చిమ సెక్టార్లతో పోలిస్తే దీనిని సాధారణంగా తక్కువ వివాదాస్పద ప్రాంతంగా పరిగణిస్తారు. అయితే, ఇక్కడ భౌగోళిక పరిస్థితులు విభిన్నంగా ఉంటాయి. క్లిష్టమైన భూభాగం, చెదురుమదురుగా ఉండే జనాభా, పరిమిత మౌలిక సదుపాయాల సాంద్రత, పర్యావరణపరమైన సున్నితత్వం వంటి సవాళ్లు ఇక్కడ ఉన్నాయి. వీటికి తోడు ఇటీవల కాలంలో గ్రే జోన్ కార్యకలాపాలు తరచుగా జరుగుతుండటం ఇక్కడి భద్రతా పరిస్థితులను మరింత క్లిష్టతరం చేస్తోంది.
2020లో గల్వాన్ లోయలో భారత సైన్యం, చైనా పీఎల్ఏ దళాల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణకు ముందు వరకు మిడిల్ సెక్టార్‌ను ఒక స్థిరమైన సరిహద్దుగా భావించేవారు. కానీ ఆ ఘటన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అప్పటి నుండి ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలోని మిడిల్ సెక్టార్‌లో భారత్ తన సైనిక సన్నద్ధతను, మౌలిక సదుపాయాలను బలోపేతం చేసుకుంటున్నట్లు 2022లోనే ఏసియానెట్ న్యూస్ నివేదించింది. చైనా చర్యలకు ధీటుగా భారత సైన్యం కూడా సరిహద్దు వెంబడి తన వైపు నిఘాను పటిష్ఠం చేసింది. ఫార్వర్డ్ యూనిట్ల మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచింది.
56
భారత సైన్యం పటిష్ఠ చర్యలు
చైనా వ్యూహాలను ఎదుర్కొనేందుకు భారత సైన్యం బహుముఖ ప్రణాళికను అమలు చేస్తోంది. రియల్ టైమ్ ఇంటెలిజెన్స్, వేగవంతమైన దళాల మార్పిడి, ఎత్తైన ప్రాంతాల్లో మెరుగైన లాజిస్టికల్ సపోర్టు పై అదనపు ప్రాధాన్యం ఇస్తోంది. పౌర, సైనిక యంత్రాంగం మధ్య సమన్వయాన్ని పెంచడం ద్వారా సరిహద్దు రక్షణను మరింత పటిష్టం చేయాలని భావిస్తోంది. చైనా ప్యాట్రన్‌లలో వస్తున్న మార్పులను గమనిస్తూ, అందుకు తగిన విధంగా భారత బలగాలు ఎప్పటికప్పుడు తమను తాము సన్నద్ధం చేసుకుంటున్నాయి.
66
జనవరి 7న కీలక సెమినార్.. సివిల్ మిలిటరీ ఫ్యూజన్
ఈ నేపథ్యంలో, ఉత్తరాఖండ్‌లో భారత సరిహద్దు రక్షణ నిర్మాణాన్ని పౌర-సైనిక ఏకీకరణ (Civil-Military Integration) ఎలా పునర్నిర్వచిస్తుందో చర్చించేందుకు భారత సైన్యం ఒక ప్రత్యేక సెమినార్‌ను ప్లాన్ చేసింది. 'ఫోర్టిఫైయింగ్ హిమాలయ - మిడిల్ సెక్టార్‌లో ప్రోయాక్టివ్ మిలిటరీ-సివిల్ ఫ్యూజన్ స్ట్రాటజీ' పేరుతో జనవరి 7న ఈ కార్యక్రమం జరగనుంది. డెహ్రాడూన్‌లోని భారత సైన్యం 14 ఇన్ఫాంట్రీ డివిజన్ ఆధ్వర్యంలో ఈ సెమినార్ నిర్వహిస్తున్నారు. సరిహద్దు సమస్యల గురించి, భవిష్యత్తు ప్లాన్ల గురించి ఆర్మీ అధికారులు, ఇతర నిపుణులు కలిసి చర్చించి, తమ ఐడియాలను పంచుకోబోతున్నారు.