ఈ కేసును మొదటగా ఫిర్యాదు చేసిన బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్ సక్సేనా, తీర్పును స్వాగతించారు. “తీర్పు నిజానికి అక్రమాలపై విజయం. అజంపై ఉన్న ప్రతి కేసూ పత్రాల ఆధారంగానే ఉంది. నేరం చేసిన ఎవరైనా సరే శిక్షను అనుభవించాల్సిందే” అని ఆయన పేర్కొన్నారు. వారి ఫిర్యాదు ఆధారంగానే సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు.
ఎస్పీ వ్యూహకర్తగా అజం ఖాన్ ప్రస్థానం
అజం ఖాన్ ఎస్పీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో మైనారిటీ వర్గాల గళంగా గుర్తింపు పొందిన ఆయన, పలు దశల్లో మంత్రిగా పనిచేశారు. పార్టీ అంతర్గత వ్యవహారాలలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉండేది. ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వాల్లో ఆయన కీలక నాయకుడిగా వ్యవహరించారు.
అయితే, వరుస కేసులు, లీగల్ సమస్యలు ఆయన రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తాజా తీర్పుతో ఆయన, ఆయన కుమారుడు అబ్దుల్లా మళ్లీ జైలుకు చేరడం ఎస్పీకే కాదు, యూపీ రాజకీయాలకు కూడా కీలక పరిణామంగా మారింది.