
Heavy Rain Alert : దేశంలో మరోసారి వాతావరణం మార్పులకు గురవుతోంది. మళ్లీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. డిసెంబర్ 7, 8, 9 తేదీలలో దేశంలోని అనేక రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఈ ఏడాది రుతుపవన కాలంలో మంచి వర్షపాతం నమోదైంది. అనేక రాష్ట్రాలు భారీ వర్షపాతాన్ని చూశాయి. నదులు, చెరువులు, ఆనకట్టలు పొంగిపొర్లాయి. అయితే, కొన్ని రాష్ట్రాలలో ఈ భారీ వర్షాలతో తీవ్ర నష్టం కూడా జరిగింది. రుతుపవనాలు తగ్గిన తరువాత వర్షాలు ఆగిపోతాయని భావించినప్పటికీ, అనేక రాష్ట్రాల్లో వర్షపాతం కొనసాగుతోంది. వాతావరణం మళ్లీ చురుకుగా మారుతోందని రాబోయే మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరికలను ఐఎండీ జారీ చేసింది.
ఇటీవలి తుపాను ప్రభావం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. మరోవైపు, ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా పడిపోతున్నాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి. రాబోయే మూడు రోజులకు తెలుగు రాష్ట్రాల్లోని వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది.
బంగాళాఖాతంలో తమిళనాడు-పుదుచ్చేరి తీరాలకు సమీపంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడన ప్రాంతం మరింత బలహీనపడింది. దీని కారణంగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అమరావతి వాతావరణ కేంద్రం సమాచారం ప్రకారం, ఆంధ్రప్రదేశ్ - యానాం దిగువ ట్రోపో ప్రాంతంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయి.
దక్షిణ కోస్తాలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. రాయలసీమలో కూడా వర్షాలు పడే అవకాశముంది. ఉరుములు మెరుపులతో జల్లులు కురిసే అవకాశం ఉంది.
రుతుపవనాల సమయంలో హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షపాతం నమోదైంది. ఈ సమయంలో, కొన్ని ప్రాంతాలలో క్లౌడ్ బరస్ట్, వరదలు కూడా సంభవించాయి. రుతుపవనాల తరువాత ఇక్కడ వర్షం ఆగిపోయినప్పటికీ, హిమాచల్ ప్రదేశ్‌లో వాతావరణం ఇప్పుడు మళ్లీ చురుకుగా మారుతుందని అంచనా వేశారు.
డిసెంబర్ 7, 8, 9 తేదీలలో హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఈ కాలంలో బలమైన గాలులు, హిమపాతం కూడా ఉంటుందని పేర్కొంది.
ఉత్తరాఖండ్‌లో కూడా రుతుపవనాల సమయంలో భారీ వర్షపాతం నమోదైంది. ఈ కాలంలో రాష్ట్రంలో క్లౌడ్ బరస్ట్, వరదల సంఘటనలు జరిగాయి. రుతుపవనాల తర్వాత వర్షపు జల్లులు తగ్గాయి. కానీ ఇప్పుడు ఉత్తరాఖండ్‌లో వాతావరణం మారుతోంది. రాబోయే మూడు రోజులు ఉత్తరాఖండ్‌లో మోస్తారు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఇదే సమయంలో హిమపాతం కూడా ఉంటుందని అంచనా వేసింది.
కేరళ, తమిళనాడులలో కూడా వర్షాలు కురిసే అవకాశముంది. దేశంలో మారుతున్న వాతావరణ ప్రభావం జమ్మూ కాశ్మీర్, లడఖ్‌లలో కూడా కనిపిస్తోంది. రాబోయే మూడు రోజులు జమ్మూ కాశ్మీర్, లడఖ్, లక్షద్వీప్, అండమాన్, నికోబార్, పుదుచ్చేరి, యానాం, మాహేలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ కాలంలో హిమపాతం కూడా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
రాజస్థాన్‌లో తీవ్రమైన చలి పెరుగుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాజస్థాన్‌లోని అనేక జిల్లాలలో తీవ్రమైన చలి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో ఉదయం దట్టమైన పొగమంచు కూడా ఉంటుందని అంచనా వేసింది.
దేశ రాజధాని ఢిల్లీలో కూడా చలి తీవ్రత పెరుగుతోంది. రాబోయే మూడు రోజులు తీవ్రమైన చలి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఉదయం అనేక చోట్ల దట్టమైన పొగమంచు ఉంటుందని పేర్కొంది.