విశాఖవాసిని వెంటాడిమరీ కాల్చిచంపిన దుండగులు :
భారతదేశంలో మినీ స్విట్జర్లాండ్ గా పేరొందిన ప్రాంతం పహల్గాం సమీపంలోని బైసరన్ లోయ. ఇక్కడ స్వచ్చమైన ప్రకృతి సోయగాలను చూసేందుకు దేశ నలుమూలల నుండి పర్యాటకులు వస్తుంటారు. ముఖ్యంగా వేసవికాలంలో ఈ ప్రాంతంలో చల్లటి వాతావరణం ఉంటుందికాబట్టి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇదే బైసరస్ ప్రాంతాన్ని టార్గెట్ చేయడానికి కారణమయ్యింది.
ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించినవారిలో విశాఖపట్నంకు చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి ఉన్నారు. స్నేహితులతో కలిసి కాశ్మీర్ పర్యటనకు వెళ్లిన ఇతడు ఉగ్రవాదుల కంటపడ్డాడు. తుపాకులు చేతబట్టి విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్న ఉగ్రవాదులను చూసి చంద్రమౌళి తప్పించుకునే ప్రయత్నం చేసాడట. కానీ అతడి వెంటపడీమరి కాల్చిచంపారు దుండగులు.
ప్రాణభయంతో చెల్లాచెదురైన స్నేహితులంతా ఒక్కచోటికి చేరగా చంద్రమౌళి మాత్రం కనిపించలేదు. కొద్దిసేపటి తర్వాత చనిపోయిన వారిలో పరిశీలించగా అతడు ప్రాణాలు కోల్పోయి కనిపించాడు. దీంతో కన్నీరుమున్నీరుగా విలపించిన స్నేహితులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కాశ్మీర్ కు వెళుతున్నానని నవ్వుతూ ఇంట్లోంచి వెళ్లినవ్యక్తి ఇలా మృతదేహంగా తిరిగివస్తుండటంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.