Gold Spot: ధోనీ ఫొటోతో ఇంట‌ర్నెట్ షేక్‌.. ఇంత‌కీ గోల్డ్ స్పాట్ చ‌రిత్ర ఏంటో తెలుసా.?

Published : Nov 24, 2026, 03:48 PM IST

Gold Spot: ఒకప్పుడు అందరి అభిమానాన్ని సంపాదించిన ఆరెంజ్ ఫ్లేవర్ కూల్ డ్రింక్ గోల్డ్ స్పాట్ మళ్లీ భారత మార్కెట్లోకి రానుందనే వార్తలు ఆసక్తి రేపుతున్నాయి. 2000లో కనుమరుగైన ఈ బ్రాండ్‌ను కోకాకోలా తిరిగి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

PREV
15
ధోనీ ఫొటోతో మొదలైన గోల్డ్ స్పాట్ చర్చ

ఎంఎస్ ధోనీ భార్య సాక్షి ధోనీ ఇటీవల సోషల్ మీడియాలో ఓ ఫొటోను షేర్ చేశారు. అందులో ధోనీ ఫొటో ఉన్న గోల్డ్ స్పాట్ టిన్‌ కనిపించింది. ఈ ఫొటో కాస్తా వైరల్ కావడంతో గోల్డ్ స్పాట్ మళ్లీ మార్కెట్లోకి వస్తోందంటూ చర్చ మొదలైంది. అంతేకాదు, సాక్షి ధోనీ ఈ డ్రింక్‌ను పరోక్షంగా పరిచయం చేశారా? ధోనీ ఈ బ్రాండ్‌కు ప్రచారకర్తగా వ్యవహరించబోతున్నారా? అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి.

అయితే ధోనీని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారా? లేదా ఈ ఫొటో వెనుక మరేదైనా ప్రచార వ్యూహం ఉందా? అనే విషయాలపై ఇప్పటివరకు స్పష్టత లేదు. మరోవైపు కోకాకోలా గోల్డ్ స్పాట్‌ను తిరిగి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోందన్న వార్తల నేపథ్యంలో ఈ ఫొటోకు ప్రాధాన్యం పెరిగింది. ఈ డ్రింక్ కోసం ఎదురుచూస్తున్న పాత తరం వినియోగదారులు కూడా సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

25
గోల్డ్ స్పాట్ చ‌రిత్ర ఇదే..

గోల్డ్ స్పాట్ భారతదేశంలో మంచి గుర్తింపు పొందిన ఆరెంజ్ ఫ్లేవర్ కూల్ డ్రింక్‌. పార్లే సంస్థ ఈ బ్రాండ్‌ను 1952లో భారత మార్కెట్లో పరిచయం చేసింది. ముఖ్యంగా 1980, 1990 దశకాల్లో ఈ డ్రింక్‌కు విపరీతమైన ఆదరణ ఉండేది. ప్రకాశవంతమైన నారింజ రంగు, ప్రత్యేకమైన రుచి దీనికి ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి. పార్లే సంస్థకు చెందిన పానీయాల విభాగంలో గోల్డ్ స్పాట్‌తో పాటు థమ్స్ అప్, లిమ్కా, మాజా వంటి బ్రాండ్లు కూడా ఉండేవి. 1993లో కోకాకోలా భారత మార్కెట్లోకి తిరిగి ప్రవేశించిన సమయంలో పార్లేకు చెందిన కూల్ డ్రింక్స్‌ వ్యాపారాన్ని కొనుగోలు చేసింది. దీంతో గోల్డ్ స్పాట్ కూడా కోకాకోలా చేతుల్లోకి వెళ్లింది. అయితే ఈ బ్రాండ్ ఎక్కువ కాలం కొనసాగలేదు. 2000 సంవత్సరంలో కంపెనీ దీని ఉత్పత్తిని నిలిపివేసింది.

35
గోల్డ్ స్పాట్‌ను ఎందుకు నిలిపివేశారు?

గోల్డ్ స్పాట్‌ను నిలిపివేయడానికి ప్రధాన కారణం కోకాకోలా వ్యాపార వ్యూహమే. ఆరెంజ్ రుచితోనే కోకాకోలా సంస్థకు ఫాంటా అనే అంతర్జాతీయ బ్రాండ్ ఉంది. గోల్డ్ స్పాట్ కూడా అదే రుచితో మార్కెట్లో ఉండటంతో రెండు బ్రాండ్ల మధ్య పోటీ ఏర్పడింది. దీంతో ఒకే రకమైన పానీయాలపై వేర్వేరుగా పెట్టుబడులు పెట్టడం కంటే ఫాంటాపైనే ఎక్కువ దృష్టి పెట్టాలని కంపెనీ నిర్ణయించింది. ఈ క్రమంలో 2000 సంవత్సరంలో గోల్డ్ స్పాట్‌ను మార్కెట్ నుంచి తొలగించింది. అయితే థమ్స్ అప్, లిమ్కా, మాజా వంటి బ్రాండ్లను మాత్రం కొనసాగించింది. ప్రస్తుతం థమ్స్ అప్, మాజా కోకాకోలా వ్యాపారంలో కీలకమైన బ్రాండ్లుగా ఉన్నాయి.

45
తక్కువ చక్కెరతో కొత్త రూపంలో రీఎంట్రీ?

గోల్డ్ స్పాట్‌ను తిరిగి తీసుకురావాలని కోకాకోలా భావిస్తున్నట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ డ్రింక్ వచ్చే వారం నుంచే భారత మార్కెట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని స‌మాచారం. అయితే దీనిపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈసారి గోల్డ్ స్పాట్‌ను తక్కువ చక్కెర లేదా చక్కెర లేని రూపంలో తీసుకురావాలని కంపెనీ యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం చాలామంది యూజ‌ర్లు తక్కువ చక్కెర ఉన్న డ్రింక్స్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మారుతున్న అభిరుచులకు అనుగుణంగా కొత్త ఫార్ములాను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా గతంలో గోల్డ్ స్పాట్‌ను ఇష్టపడిన పాత తరం వినియోగదారులను మళ్లీ ఆకర్షించడంతో పాటు కొత్త తరం వారికి కూడా ఈ బ్రాండ్‌ను పరిచయం చేయాలనేది కంపెనీ లక్ష్యంగా కనిపిస్తోంది. గతంలో ఈ డ్రింక్‌కు ఉన్న 'ది జింగ్ థింగ్' (The Zing Thing) అనే ట్యాగ్‌లైన్‌ను కూడా తిరిగి ఉపయోగించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

55
పెరుగుతున్న పోటీ మధ్య కోకాకోలా కొత్త వ్యూహం

భారత కూల్ డ్రింక్‌ మార్కెట్లో ప్రస్తుతం పోటీ తీవ్రంగా పెరుగుతోంది. కోకాకోలా, పెప్సీ వంటి అంతర్జాతీయ సంస్థలకు రిలయన్స్ తీసుకొచ్చిన క్యాంపా కొత్త పోటీగా మారింది. 2023లో తిరిగి మార్కెట్లోకి వచ్చిన క్యాంపా తక్కువ ధరలు, ఆకర్షణీయమైన ప్యాకేజీలు, విస్తరిస్తున్న పంపిణీ వ్యవస్థతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది.

మరోవైపు భారతదేశంలో నాన్ ఆల్కహాలిక్ రెడీ టు డ్రింక్ పానీయాల మార్కెట్ కూడా వేగంగా విస్తరిస్తోంది. ఇందులో శీతల పానీయాలు, ప్యాకేజ్డ్ వాటర్, జ్యూస్‌లు, ఎనర్జీ డ్రింక్స్, స్పోర్ట్స్ డ్రింక్స్, రెడీ టు డ్రింక్ టీ, కాఫీ వంటివి ఉన్నాయి. పరిశ్రమ నివేదిక ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ మార్కెట్ విలువ సుమారు రూ.1.40 లక్షల కోట్లకు చేరింది. 2030-31 నాటికి ఇది రూ.2.56 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా.

ఈ పరిస్థితుల్లో పాత బ్రాండ్‌కు ఉన్న ఆదరణను ఉపయోగించుకోవడంతో పాటు తక్కువ చక్కెర పానీయాల మార్కెట్లోనూ స్థానం సంపాదించేందుకు కోకాకోలా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే గోల్డ్ స్పాట్ అధికారిక రీఎంట్రీ తేదీ, ధర, కొత్త ప్యాకేజింగ్ వివరాలు కంపెనీ ప్రకటన తర్వాతే వెల్లడికానున్నాయి. మొత్తానికి ధోనీ ఫొటోతో మొదలైన ఈ చర్చ.. 90వ దశకపు జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories