Bisleri Water Quality: అస‌లేంటీ బిస్ల‌రీ వాట‌ర్ వివాదం.? కంపెనీ ఇచ్చిన క్లారిటీ ఏంటి.?

Published : Nov 24, 2026, 03:01 PM IST

Bisleri Water Quality: బిస్లరీ నీటి నాణ్యతపై వివాదం నెలకొంది. కంపెనీ నీటి నమూనాలు భద్రతా ప్రమాణాలను అందుకోలేదంటూ FSSAI ప్రాసిక్యూషన్‌కు అనుమతించింది. దీనిపై స్పందించిన బిస్లరీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.

PREV
14
బిస్లరీపై FSSAI ఎందుకు చర్యలు తీసుకుంది?

దేశవ్యాప్తంగా వినియోగదారులు ఎక్కువగా ఉపయోగించే ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్లలో బిస్లరీ ఒకటి. అయితే కంపెనీకి చెందిన నీటి నమూనాలో నాణ్యతా లోపాలు ఉన్నట్లు పరీక్షల్లో వెల్లడైన నేపథ్యంలో FSSAI చర్యలకు సిద్ధమైంది. బిస్లరీ ఇంటర్నేషనల్ ప్రాంగణం నుంచి సేకరించిన ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ నమూనాను అధికారులు ప్రయోగశాలకు పంపించారు. మొదటి పరీక్షలో నీటిలో బ్రోమేట్ స్థాయులు అనుమతించిన పరిమితిని మించినట్లు గుర్తించారు. దీంతో ఆ నమూనాను ఆహార భద్రత, ప్రమాణాల చట్టం-2006 ప్రకారం సురక్షితం కానిదిగా పరిగణించారు. కంపెనీ ఈ ఫలితాలను సవాలు చేయడంతో మరోసారి పరీక్షలు నిర్వహించినప్పటికీ, రెండో ప్రయోగశాల నివేదిక కూడా ప్రతికూలంగా రావడంతో ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చింది.

24
బ్రోమేట్, PAHs గుర్తింపు.. పరీక్షల్లో ఏం తేలింది?

FSSAI నిర్వహించిన పరీక్షల్లో రెండు రకాల రసాయన పదార్థాలకు సంబంధించిన అంశాలు తెరపైకి వచ్చాయి. మొదటి పరీక్షలో నీటిలో బ్రోమేట్ స్థాయి నిర్దేశిత ప్రమాణం కంటే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. బిస్లరీ వివరణ ప్రకారం.. అనుమతించిన పరిమితి లీటరుకు 10 మైక్రోగ్రాములు కాగా, నమూనాలో 12 మైక్రోగ్రాములు నమోదయ్యాయి. కంపెనీ అప్పీల్ చేయడంతో నమూనాను రిఫరల్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపించారు. అక్కడ నిర్వహించిన రెండో పరీక్షలో బ్రోమేట్ స్థాయి పరిమితుల్లోనే ఉన్నట్లు తేలినప్పటికీ, పాలీ న్యూక్లియర్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (PAHs) ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. ఈ రెండు పరీక్షల ఫలితాలను ఆధారంగా చేసుకుని నమూనా భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించినట్లు FSSAI భావించింది.

34
14 నెలల నాటి బ్యాచ్‌పై బిస్లరీ వివరణ

తాజా వివాదంపై బిస్లరీ ఇంటర్నేషనల్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. తమ దేశవ్యాప్త 143 తయారీ కేంద్రాల్లో గోవా ప్లాంట్‌లో 2025 సెప్టెంబర్‌లో తయారైన ఒక బ్యాచ్‌కు మాత్రమే ఈ వ్యవహారం సంబంధించిందని తెలిపింది. సెప్టెంబర్ 30న FSSAI అధికారులు అక్కడి నుంచి మొత్తం ఆరు నమూనాలను సేకరించారని, వాటిలో ఐదు అన్ని నాణ్యతా ప్రమాణాలను అందుకున్నాయని వెల్లడించింది. మిగిలిన ఒక నమూనాలో మాత్రమే బ్రోమేట్ స్థాయి స్వల్పంగా ఎక్కువగా నమోదైందని పేర్కొంది. 2025 నవంబర్ 22న ఈ ఫలితాలపై అప్పీల్ చేసినట్లు వివరించింది. అనంతరం పరీక్షల్లో వచ్చిన భిన్నమైన నివేదికల నేపథ్యంలో FSSAI ఆమోదం పొందిన మరో స్వతంత్ర ప్రయోగశాలలోనూ నమూనాను పరీక్షించామని తెలిపింది. అక్కడ బ్రోమేట్ స్థాయి అనుమతించిన పరిమితిలోనే ఉన్నట్లు నిర్ధారణ అయిందని కంపెనీ వెల్లడించింది.

44
FSSAIకి నివేదిక సమర్పించాం.. ఎలాంటి నోటీసులు రాలేదు

స్వతంత్ర ప్రయోగశాల పరీక్షల ఫలితాలను జతచేస్తూ 2026 ఫిబ్రవరి 2న FSSAI వెస్ట్రన్ రీజినల్ కార్యాలయానికి అధికారికంగా లేఖ పంపినట్లు బిస్లరీ పేర్కొంది. ఆ తర్వాత సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి సమాచారం అందకపోవడంతో ఈ అంశం ముగిసిపోయిందని భావించినట్లు తెలిపింది. తాజాగా ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చినట్లు వార్తలు రావడంతో కంపెనీ మరోసారి వివరణ ఇచ్చింది. ఇప్పటివరకు తమకు ఈ-మెయిల్ ద్వారా కానీ, భౌతిక నోటీసు రూపంలో కానీ ఎలాంటి సమాచారం అందలేదని స్పష్టం చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లోనూ సంబంధిత నోటీసు కనిపించడం లేదని పేర్కొంది. మరోవైపు నిబంధనల ప్రకారం FSSAIకి పూర్తిస్థాయిలో సహకరిస్తామని కంపెనీ వెల్లడించింది.

90కి పైగా నాణ్యతా పరీక్షలు.. మరో నాలుగు సంస్థలపైనా చర్యలు

తాగునీటి నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడబోమని బిస్లరీ స్పష్టం చేసింది. తమ తయారీ ప్రక్రియలో 10 దశల శుద్ధి విధానాన్ని అనుసరిస్తామని, ఉత్పత్తి వివిధ దశల్లో 90కి పైగా నాణ్యతా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. వినియోగదారుల ఆరోగ్యం, భద్రత తమకు అత్యంత ముఖ్యమని, తమ నీరు తాగడానికి పూర్తిగా సురక్షితమని కంపెనీ భరోసా ఇచ్చింది.

ఇదిలా ఉంటే, బిస్లరీతో పాటు మరో నాలుగు సంస్థలపైనా ప్రాసిక్యూషన్‌కు FSSAI అనుమతి ఇచ్చింది. వసంత్ మసాలా ప్రైవేట్ లిమిటెడ్, టిట్-బిట్ ఫుడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మిమాన్సా ఇండస్ట్రీస్, ఆశా కన్ఫెక్షనరీ ఈ జాబితాలో ఉన్నాయి. వీటి ఉత్పత్తుల్లో నాణ్యత, భద్రతా నిబంధనలకు సంబంధించిన ఉల్లంఘనలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఊర్మి లైఫ్‌సైన్సెస్ LLP, గౌర్ ఆయుర్వేదిక్ స్టోర్ సంస్థల లైసెన్సులను సైతం నిలిపివేశారు. ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత, లేబులింగ్ ప్రమాణాల అమలుపై FSSAI తనిఖీలు కొనసాగుతున్నాయని ఈ పరిణామాలు సూచిస్తున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories