GMC Jammu on High Alert: భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధవాతారణం కనిపిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడుల తర్వాత పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పాకిస్తాన్ పై భారత్ కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇరు దేశాల మధ్య ఏ క్షణమైనా యుద్ధం జరగవచ్చనే టెన్షన్ నెలకొంది.
జీఎంసీ జమ్మూ హైఅలర్ట్
ఈ క్రమంలోనే జమ్మూకాశ్మీర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ హైఅలర్ట్ ఆదేశాలు జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్‌లో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో జీఎంసీ జమ్మూలో హై అలర్ట్ ప్రకటించారు. జమ్మూలోని ప్రభుత్వ వైద్య కళాశాల (జీఎంసీ) సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండాలనీ, ఏదైనా అత్యవసర పరిస్థితికి పూర్తి సంసిద్ధతను నిర్ధారించుకోవాలని ఆదేశించారు.
అధికారిక ఉత్తర్వుల ప్రకారం.. మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండాలి. ఏ క్షణమైనా అందుబాటులో రోగులకు సేవలు అందించే విధంగా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. స్టోర్ ఆఫీసర్, స్టోర్ కీపర్లు అవసరమైన వస్తువులు, అత్యవసర మందులు, కీలకమైన పరికరాలను తక్షణ ఉపయోగం కోసం సిద్ధంగా ఉంచాలని ప్రత్యేకంగా ఆదేశించారు.
24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు
అలాగే, సెలవులు కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. విధుల్లో ఉన్న సమయంలో ఆస్పత్రి ప్రాంగణంలోనే అందుబాలులో ఉండాలని పేర్కొన్నారు. అత్యవసర ప్రతిస్పందనలను సమన్వయం చేయడానికి 24×7 కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూమ్ 24 గంటలూ పనిచేస్తుంది. ఏదైనా అత్యవసర సహాయం కోసం ఈ క్రింది నంబర్లలో సంప్రదించవచ్చని 0191-2582355, 0191-2582356 నెంబర్లను వెల్లడించింది. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అన్ని విభాగాలు అప్రమత్తంగా ఉండాలనీ, పూర్తిగా సహకరించాలని ప్రభుత్వం కోరింది.