Freedom of Speech: మాజీ సీఎం కొడుకైనా.. యూట్యూబర్ అయినా.. నోరు అదుపులో ఉంటేనే గౌరవం

Published : Aug 04, 2026, 02:35 PM IST

Freedom of Speech: వాక్ స్వాతంత్రం రాజ్యాంగం కల్పించిన హక్కు. కానీ ఇష్టారాజ్యంగా మాట్లాడే స్వేచ్ఛ మాత్రం లేదు. ఇటీవల ఏపీలో యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్ట్, తాజాగా తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్.. ఈ రెండు ఘటనలు ఒకే విషయాన్ని గుర్తు చేస్తున్నాయి.

PREV
14
కావేరి నిరసనలో మొదలైన వివాదం..

కావేరి జలాల పంపిణీ అంశంపై తంజావూరులో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రసంగం జరుగుతుండగా కొందరు కార్యకర్తలు నటి త్రిష పేరు నినదించారు. ఆ సమయంలో ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు డబుల్ మీనింగ్ వచ్చేలా ఉన్నాయంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి. తాను కావేరి నీటి గురించే మాట్లాడానని తర్వాత వివరణ ఇచ్చినా.. ఆ వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. దీనిపై అధికార పార్టీ టీవీకే నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళను అవమానించేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. మంగళవారం ఉదయం చెన్నైలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకుని విచారణకు తరలించారు.

24
బెయిల్ కోసం హైకోర్టు.. బయట రాజకీయ రగడ

తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ కోసం ఉదయనిధి స్టాలిన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. అత్యవసర విచారణ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉండగా ఆయన అరెస్ట్‌తో డీఎంకే కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగారు. మరోవైపు అధికార పార్టీ నాయకులు మాత్రం మహిళను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం సమర్థించలేమని స్పష్టం చేశారు. ఈ వ్యవహారం ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.

34
ప్రశ్న రావణ్ కేసు కూడా చెప్పింది ఇదే.. మాటలకు బాధ్యత ఉండాలి

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్ట్ కూడా ఇదే తరహా చర్చకు దారి తీసింది. ఆయనపై వివిధ జిల్లాల్లో నమోదైన కేసుల ఆధారంగా వరుసగా అరెస్టులు జరిగాయి. ఒక కేసులో బెయిల్ వచ్చిన వెంటనే మరో కేసులో పోలీసులు అదుపులోకి తీసుకోవడం పెద్ద చర్చగా మారింది.

పోలీసుల కథనం ప్రకారం.. రాజకీయ నాయకులపై వ్యక్తిగత దూషణలు, అభ్యంతరకర పదజాలం, సామాజిక ఉద్రిక్తతలకు దారితీసే వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో అసభ్యకర థంబ్‌నెయిల్స్, వ్యక్తిగత పరువు నష్టం కలిగించే కంటెంట్ ప్రచురించారనే ఆరోపణలపై కేసులు నమోదయ్యాయి. ఆ సమయంలో కొందరు దీనిని వాక్ స్వాతంత్రంపై జ‌రిగిన దాడిగా అభివర్ణించగా.. మరికొందరు స్వేచ్ఛకు కూడా చట్టపరమైన పరిమితులు ఉంటాయని వాదించారు.

44
మాట్లాడే ముందు ఆలోచించాల్సిందే

ఉదయనిధి స్టాలిన్ ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారుడు, ఉప ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించిన వ్య‌క్తి.. జాతీయ స్థాయి రాజకీయ నాయకుడు. ప్రశ్న రావణ్ లక్షల మంది అనుచరులు ఉన్న యూట్యూబర్. కానీ ఈ రెండు ఘటనలు చెప్పే సందేశం మాత్రం ఒక్కటే. పదవి, ప్రజాదరణ, ఫాలోయింగ్, రాజకీయ బలం.. ఇవేవీ చట్టానికి మించినవి కావు. ప్రజా జీవితంలో ఉన్నవారు మాట్లాడే ప్రతి మాటకు ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా మహిళలను, వ్యక్తులను లేదా వర్గాలను కించపరిచే వ్యాఖ్యలు చేస్తే.. అవి రాజకీయ విమర్శల పరిధిని దాటి చట్టపరమైన సమస్యలుగా మారే అవకాశం ఉంది.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) ప్రతి పౌరుడికి భావ ప్రకటన స్వేచ్ఛను కల్పించినా.. అదే రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2) ప్రజా శాంతి, పరువు నష్టం, నైతిక విలువలు, సామాజిక బాధ్యత వంటి అంశాల దృష్ట్యా ఆ స్వేచ్ఛపై సహేతుకమైన పరిమితులను కూడా నిర్దేశించింది. అందుకే... మాట్లాడే ముందు ఒక్క క్షణం ఆలోచించడం చాలా ముఖ్యం. ఎదుటివారిని అవమానించే మాటలు, వ్యక్తిగత దూషణలు, డబుల్ మీనింగ్ వ్యాఖ్యలు తాత్కాలికంగా చప్పట్లు తెచ్చిపెట్టొచ్చు. కానీ చివరికి అవే పోలీస్ స్టేషన్ గడప దాటించే పరిస్థితిని తీసుకురావచ్చు. మాటకు విలువ ఉన్నంతగా.. మాటకు బాధ్యత కూడా ఉండాలి. అదే ఈ రెండు ఘటనలు మరోసారి గుర్తు చేస్తున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories