
ప్రపంచీకరణ పెరిగిన ఈ రోజుల్లో ఒక దేశం నుంచి మరో దేశానికి సమాచారం, సాంకేతికత, ఆస్తులతో పాటు ఆర్థిక వనరులు సులభంగా మారుతున్నాయి. విద్య, వైద్యం, విపత్తు సహాయం, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాలలో పనిచేసే స్వచ్ఛంద సంస్థలకు (NGOలు) విదేశీ విరాళాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. భారత్‌లో కూడా అనేక సంస్థలు ఈ విదేశీ నిధులతో సామాజిక అభివృద్ధి పనులు చేపడుతున్నాయి.
అయితే, విదేశాల నుంచి వచ్చే డబ్బు ఏ పనులకు ఖర్చు అవుతోంది? దానివల్ల దేశ భద్రతకు, ప్రజాస్వామ్య వ్యవస్థలకు ఏమైనా ప్రమాదం ఉందా? అని చూడటం ప్రభుత్వాల బాధ్యత. అందుకే ఈ విదేశీ నిధులను క్రమబద్ధీకరించడానికి మన దేశంలో 'ఫారిన్ కాంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) యాక్ట్' (FCRA) అమల్లో ఉంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ' ఎఫ్‌సీఆర్ఏ సవరణ బిల్లు 2026' ప్రవేశపెట్టడంతో దీనిపై పెద్ద ఎత్తున చర్చ, రగడ జరుగుతోంది.
ఎఫ్‌సీఆర్ఏ అనేది భారత్‌లోని వ్యక్తులు, సంస్థలు, ఎన్జీవోలు, ట్రస్టులు విదేశాల నుంచి విరాళాలు లేదా నిధులు స్వీకరించడాన్ని నియంత్రించే ఒక కేంద్ర చట్టం. దీనిని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుంది. ఈ చట్టం ఎవరెవరు విదేశీ నిధులు తీసుకోవచ్చు, ఏ నిబంధనలు పాటించాలి, ఆ డబ్బును ఎలా ఖర్చు చేయాలో స్పష్టంగా చెబుతుంది.
• పారదర్శకత: విదేశీ విరాళాలు పొందే ప్రతి సంస్థ ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోవాలి. నిర్దేశిత బ్యాంకు ఖాతా ద్వారానే డబ్బులు తీసుకోవాలి.
• జవాబుదారీతనం: ప్రతి ఏటా వార్షిక ఆడిట్ రిపోర్టులను ఆన్‌లైన్‌లో సమర్పించాలి. ఎంత డబ్బు వచ్చింది, ఎవరు ఇచ్చారు, దేనికి ఖర్చు చేశారో పూర్తి వివరాలు వెల్లడించాలి.
• సార్వభౌమాధికార రక్షణ: దేశ భద్రతకు, ప్రజాస్వామ్య ప్రక్రియలకు భంగం కలిగించేలా విదేశీ నిధులు వాడకుండా నిరోధించడం.
• పరిమితులు: రాజకీయనాయకులు, ఎన్నికల అభ్యర్థులు, న్యాయమూర్తులు, ప్రభుత్వ ఉద్యోగులు, పత్రికా సంపాదకులు విదేశీ నిధులు తీసుకోకూడదు.
ఎఫ్‌సీఆర్ఏ చట్టం ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు. గత ఐదు దశాబ్దాలుగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇందులో అనేక సవరణలు చేశారు.
• 1976: దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడేందుకు తొలిసారిగా ఎఫ్‌సీఆర్ఏ చట్టాన్ని తీసుకువచ్చారు.
• 1984: విదేశీ నిధులు పొందే ఎన్జీవోలకు హోం మంత్రిత్వ శాఖ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేశారు.
• 2010: పాత చట్టం స్థానంలో కొత్త 2010 చట్టం వచ్చింది. రిజిస్ట్రేషన్ గడువును 5 ఏళ్లకు పరిమితం చేశారు.
• 2020: నిర్వాహకులకు ఆధార్ తప్పనిసరి చేశారు. విదేశీ నిధులు కేవలం ఢిల్లీలోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఖాతాలోనే జమ కావాలని నిబంధన తెచ్చారు. అడ్మినిస్ట్రేటివ్ ఖర్చుల పరిమితిని 50% నుండి 20%కి తగ్గించారు.
• 2022: విదేశాల్లో ఉండే బంధువుల నుండి వచ్చే నిధుల పరిమితిని రూ. 1 లక్ష నుండి రూ. 10 లక్షలకు పెంచారు.
ప్రస్తుతం పార్లమెంట్ ముందుకు వచ్చిన ఎఫ్‌సీఆర్ఏ సవరణ బిల్లు 2026, అమలులోకి వచ్చిన ఎఫ్‌సీఆర్ఏ నిబంధనలు 2026 లో కొన్ని కీలక మార్పులు ప్రతిపాదించారు..
• డెసిగ్నేటెడ్ అథారిటీ ఏర్పాటు: ఏదైనా ఎన్జీవో రిజిస్ట్రేషన్ రద్దయినా లేదా గడువు ముగిసినా, విదేశీ నిధులతో కూడబెట్టిన ఆస్తులను రక్షించడానికి ఒక ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేస్తారు.
• ఆస్తుల తాత్కాలిక స్వాధీనం: రిజిస్ట్రేషన్ రద్దయినప్పుడు ఆస్తులు తాత్కాలికంగా ప్రభుత్వం వద్ద ఉంటాయి. ఆ సంస్థ మళ్లీ రిజిస్ట్రేషన్ పునరుద్ధరించుకుంటే ఆస్తులన్నీ వెనక్కి ఇచ్చేస్తారు. నిర్ణీత సమయంలో పునరుద్ధరణ జరగకపోతేనే అవి శాశ్వతంగా ప్రభుత్వానికి చెందుతాయి.
• ఆరాధనా స్థలాల పరిరక్షణ: ప్రభుత్వం ఆస్తులను స్వాధీనం చేసుకున్నా, ప్రార్థనా మందిరాలు లేదా ఆరాధనా స్థలాల మతపరమైన స్వభావాన్ని మార్చకూడదని చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు.
• శిక్షల కాలపరిమితి తగ్గింపు: ఎఫ్‌సీఆర్ఏ నిబంధనల ఉల్లంఘనకు ఇచ్చే గరిష్ఠ జైలు శిక్షను 5 సంవత్సరాల నుండి 1 సంవత్సరానికి తగ్గించారు.
• కనీస నిధుల వినియోగం: నమోదు పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకునే ఎన్జీవోలు గత రెండేళ్లలో కనీసం రూ. 10 లక్షల విదేశీ నిధులను ఉపయోగించి ఉండాలి.
• కేంద్ర అనుమతి తప్పనిసరి: రాష్ట్ర ప్రభుత్వాలు లేదా ఏజెన్సీలు ఎఫ్‌సీఆర్ఏ కింద దర్యాప్తు ప్రారంభించే ముందు కేంద్ర ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి.
ఈ కొత్త సవరణలపై పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
• ఆస్తుల స్వాధీనంపై భయం: ఎన్జీవోల రిజిస్ట్రేషన్ రద్దయితే వాటి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంపై వివాదం నడుస్తోంది.
• రాష్ట్రాల హక్కులు: దర్యాప్తుకు కేంద్రం అనుమతి తప్పనిసరి చేయడం వల్ల రాష్ట్రాల అధికారాల్లో కేంద్రం జోక్యం చేసుకుంటోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
• కఠిన నిబంధనలు: కనీసం రూ. 10 లక్షలు ఖర్చు చేయాలనే నిబంధన చిన్న ఎన్జీవోలకు ఇబ్బందిగా మారుతుందని భావిస్తున్నారు.
అయితే, ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. గత దశాబ్ద కాలంలో దాదాపు 20,000 రిజిస్ట్రేషన్లు రద్దయ్యాయని, వేల కోట్ల విలువైన ఆస్తులు వృథాగా పడి ఉన్నాయని తెలిపింది. వాటి నిర్వహణ కోసమే స్పష్టమైన విధానం తెస్తున్నామని వివరించింది.