India-US flight fares surge: డోనాల్డ్ ట్రంప్ హెచ్1బీ వీసా (H-1B) ఫీజు పెంపు ఆదేశాలు, టెక్ కంపెనీల సూచనల నేపథ్యంలో భారత్-అమెరికా విమాన టిక్కెట్ల ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. టెకీలతో పాటు ఎన్నారైలు తాజా పరిస్థితులపై ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెప్టెంబర్ 19న వీసాల మార్పులను తీసుకొస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రకారం హెచ్1బీ వీసా (H-1B వీసా) రుసుమును భారీగా పెంచుతూ $100,000 (సుమారు రూ.88 లక్షలు)గా నిర్ణయించారు. ఈ ఫీజు సెప్టెంబర్ 21, 2025 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టంచేశారు. ఇప్పటి వరకు వీసా రుసుము $4,000 వరకు మాత్రమే ఉండేది. ఈ పెంపుతో వీసాదారులకూ, ముఖ్యంగా కంపెనీలకూ పెద్ద భారమైంది. ఈ క్రమంలోనే టెక్ కంపెనీలు నిబంధనలు అమల్లోకి రాకముందే హెచ్1బీ వీసా పై పనిచేస్తున్న ఉద్యోగులు వెంటనే అమెరికాకు రావాలని సూచనలు పంపాయి.
26
విమాన టిక్కెట్ల ధరలు రెట్టింపు
ఈ నిర్ణయం వెలువడగానే భారత్ నుంచి అమెరికాకు వెళ్లే విమాన టిక్కెట్లకు డిమాండ్ అమాంతం పెరిగింది. న్యూఢిల్లీ నుంచి న్యూయార్క్ విమాన ఛార్జీలు రెండు గంటల్లోనే రూ.37,000 నుంచి రూ.80,000కు చేరాయి. దసరా పండుగ కోసం భారత్ వచ్చిన ఎన్నారైలు, బిజినెస్ ట్రిప్‌లు లేదా విహారయాత్రలపై విదేశాల్లో ఉన్నవారు అత్యవసరంగా తిరిగి అమెరికా చేరుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ హడావిడిని క్యాష్ చేసుకోవడానికి విమానయాన సంస్థలు ధరలు భారీగా పెంచాయి.
36
టెక్ కంపెనీల హెచ్చరికలు
మైక్రోసాఫ్ట్, అమెజాన్, జేపీ మోర్గాన్ వంటి టాప్ కంపెనీలు ఇప్పటికే తమ ఉద్యోగులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాయి. H-1B, H-4 వీసాలు కలిగిన వారు అమెరికా వెలుపల ఉండరాదని, ఇప్పటికే విదేశాల్లో ఉన్నవారు సెప్టెంబర్ 21 అర్ధరాత్రి 12:01 ET (భారత కాలమానం ప్రకారం ఉదయం 9:31)లోపు అమెరికాకు చేరుకోవాలని హెచ్చరించాయి. లేకపోతే, కంపెనీలు వారిని కొనసాగించడానికి లక్ష డాలర్ల ఫీజు చెల్లించక తప్పదని తెలిపాయి.
ట్రంప్ ప్రకటన తరువాత అమెరికా విమానాశ్రయాల్లో గందరగోళం తారాస్థాయికి చేరింది. విమానంలో కూర్చుని ప్రయాణానికి సిద్ధమైన అనేక మంది ప్రయాణికులు అప్పటికప్పుడు దిగిపోయినట్లు అక్కడి మీడియా కథనాలు తెలిపాయి. దుబాయ్‌లోనూ ఇలాంటి సంఘటనలు నమోదయ్యాయని సోషల్ మీడియాలో నెటిజన్లు పేర్కొన్నారు. ఈ పరిస్థితులు ఎన్నారైలలో ఆందోళన కలిగిస్తున్నాయి.
56
భారతీయులపై తీవ్ర ప్రభావం
H-1B వీసాలు కలిగిన వారిలో భారతీయులే ఎక్కువ. గణాంకాల ప్రకారం, మొత్తం వీసాదారుల్లో సుమారు 70 శాతం మంది భారతీయులే. అందువల్ల ఈ నిర్ణయం వారిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భారత్‌లో సెలవులు గడుపుతున్నవారు లేదా బిజినెస్ ట్రిప్‌లలో ఉన్నవారు గడువు లోపు అమెరికాకు చేరుకోవడం కష్టంగా మారింది. నేరుగా వెళ్లినా గడువు ముగిసేలోపు చేరుకోవడం కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో అనేక మంది వారి ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు.
66
ఆర్థిక భారం.. టెక్ కంపెనీలు, ఉద్యోగులకు కష్టమే
ట్రంప్ నిర్ణయం వల్ల కంపెనీలతో పాటు ఉద్యోగులపై భారం పడుతోంది. సాధారణంగా వీసా రుసుములు కంపెనీలు చెల్లిస్తాయి. ఇప్పుడు లక్ష డాలర్ల ఫీజు చెల్లించాల్సి రావడంతో ముఖ్యంగా చిన్న టెక్ సంస్థలు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఇప్పటికే నిపుణులు ఈ చర్య ఐటీ రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. భారత్ నుంచి అమెరికా వెళ్లే ఉద్యోగులపై ఇది అత్యధిక ప్రభావాన్ని చూపనుంది.