
Digital Begging : అగ్గిపుల్ల, సబ్బుబిల్ల, ఆడపిల్ల... కాదేది కవితకు అనర్హం అన్నాడు ఓ తెలుగు కవి. కానీ ఈ టెక్ జమానా కుర్రకారు కాదేది సంపాదనకు అనర్హం అంటున్నారు. యూట్యూబ్ చానల్స్ పెట్టుకుని కొందరు, సోషల్ మీడియా రీల్స్ తో మరికొందరు, ప్రమోషన్ వీడియోలతో ఇంకొందరు రెండుచేతులా సంపాదిస్తున్నారు. కొందరు కేటుగాళు డిజిటల్ అరెస్టులు, ఆన్లైన్ మోసాల ద్వారా అమాయకుల నుండి డబ్బులు కొల్లగొడుతున్నారు. చివరకు పరిస్థితి ఎలా తయారయ్యిందంటే 'డిజిటల్ బెగ్గింగ్' కూడా మొదలయ్యింది. ఇలా యూట్యూబ్ ద్వారా అడుక్కుంటున్న ఓ డిజిటల్ బిచ్చగాడి గురించి ఇక్కడ తెలుసుకుందాం.
బిచ్చగాళ్లు అంటే చిరిగిన బట్టలతో చేతిలో ఓ బొచ్చ పట్టుకుని గుడి వద్దనో, రైల్వే స్టేషన్లు, బస్టాండుల్లోనో అడుక్కోవడం పాతకాలంలో కనిపిస్తుంది. కొద్దిరోజుల వరకు చిన్నపిల్లలను ఎత్తుకునివచ్చి ఎమోషనల్ టచ్ ఇచ్చి ట్రాఫిక్ సిగ్నల్స్, రద్దీ ప్రదేశాల్లో అడుక్కునే ఆడవాళ్లను చూశాం. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగానే అడుక్కునేవాళ్ళు కూడా అప్ డేట్ అవుతున్నారు. చిల్లర డబ్బులు అడుక్కునే వాళ్లు ఇప్పుడు చేతిలో క్యూఆర్ కోడ్ పట్టుకుని అడుక్కుంటున్నారు. డిజిటల్ పేమెంట్స్ పెరిగిన నేపథ్యంలో ప్రజలు జేబుల్లో డబ్బులు పెట్టుకోవడం మానేశారు... అంతా స్మార్ట్ ఫోన్ ద్వారానే పేమెంట్స్ చేస్తున్నారు. దీంతో బిచ్చగాళ్లు స్మార్ట్ బెగ్గింగ్ ప్రారంభించారు.
మెడలో లేదా చేతిలో క్యూఆర్ కోడ్ స్కానర్ పట్టుకుని అడుక్కునేవారు అక్కడక్కడ కనిపిస్తున్నారు. రాబోయే కాలంలో ఇలాంటివారు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా బిహార్ లో రాజు పటేల్, అస్సాంలో దశరథ్ డిజిటల్ బెగ్గర్స్ గా బాగా ఫేమస్ అయ్యారు. అయితే మరో డిజిటల్ బెగ్గర్ గౌతమ్ సూర్య మాత్రం సరికొత్తగా డబ్బులు అడుక్కుంటున్నాడు. అతడు ఏకంగా సోషల్ మీడియాలో బెగ్గింగ్ చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు.
గౌతమ్ సూర్య యూట్యూబ్ ను తన భిక్షాటనకు ఉపయోగించుకుంటున్నాడు. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన అతడు ప్రతిరోజు అందులో 3-4 గంటలు లైవ్ నడుపుతాడు. ఇందులో అతడు 2 క్యూఆర్ కోడ్స్ ని ప్రదర్శిస్తూ డబ్బులు పంపించాలని కోరతాడు. ఇలా ఎవరైనా డబ్బులు పంపితే ఎంత పంపారో వెల్లడించి ధన్యవాదాలు చెబుతాడు. ఇలా ప్రతిరోజు ఆన్లైన్ లో డబ్బులు అడుక్కుంటాడు గౌతమ్ సూర్య.
ఇలా సరికొత్తగా బెగ్గింగ్ చేస్తున్న గౌతమ్ సూర్య ఇప్పుడు సోషల్ మీడియా సెలబ్రిటీ. అతడి యూట్యూబ్ ఛానల్ కి 5 లక్షలమంది సబ్ స్రైబర్స్ ఉన్నారు. ఇప్పటివరకు అతడు 3800 వీడియోలను తన ఛానల్లో పెట్టాడు... వీటిని 26 మిలియన్ల మంది చూశారు. అంటే ఇతడికి కేవలం డిజిటల్ బెగ్గింగ్ ద్వారానే కాదు యూట్యూబ్ ద్వారా కూడా డబ్బులు వస్తున్నాయన్నమాట.
గౌతమ్ సూర్య లైవ్ లోకి వచ్చాడంటే చాలు ఒక్కసారిగా వేలాదిమంది జాయిన్ అయిపోతారు. ఇలా ప్రతిసారి దాదాపు 10,000 మందికిపైగా అతడి లైవ్ వీక్షిస్తారు. అలాగే అతడికి 1 రూపాయి నుండి రూ.100 వరకు… కొందరయితే వేలల్లో కూడా డబ్బులు పంపిస్తారు. ఇలా ఎక్కువ డబ్బులు పంపించినవారి ఫోన్ నెంబర్, ఎంత పంపించారు అనేది కూడా ఒక్కోసారి చూపిస్తుంటాడు గౌతమ్. ఇలా హైటెక్ పద్దతిలో అడుక్కుంటూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నాడు.
తన యూట్యూబ్ ఛానల్ పెట్టిమరీ ఇలా ఆన్లైన్లో అడుక్కోడానికి గల కారణాన్ని గౌతమ్ సూర్య వెల్లడించాడు. గత రెండుమూడేళ్లుగా ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నాను... కానీ ఎక్కడా తనకు ఉద్యోగం, ఉపాధి లభించకపోవడంతో జీవితం భారంగా మారిందని తెలిపాడు. వయసులో ఉండికూడా కుటుంబానికి భారంగా మారిపోయానని... వయసు మీదపడిన తండ్రి కాయకష్టం చేసి కుటుంబాన్ని పోషిస్తుంటే చాలా నామోషీగా అనిపించేదని తెలిపాడు. ఓసారి తండ్రి అర్ధరాత్రి 12.30 గంటలకు ఇంటికి వచ్చాడని... అతడి కష్టపడుతున్నతీరు తనకు కన్నీరు తెప్పించిందని గౌతమ్ ఎమోషనల్ అయ్యాడు.
తండ్రి కష్టాలను చూపి చలించిపోయి ఇకనైనా ఆయనను సుఖంగా చూసుకోవాలని భావించానని... ఈ సమయంలోనే యూట్యూబ్ వీడియోల ద్వారా సంపాదించవచ్చని తెలిసిందన్నారు గౌతమ్ సూర్య. కానీ ఎలాంటి వీడియోలు చేయాలని ఆలోచిస్తున్నపుడు డిజిటల్ బెగ్గింగ్ ఆలోచన వచ్చిందని... వెంటనే రెండు క్యూఆర్ కోడ్స్ రెడీ చేసుకుని లైవ్ పెట్టడం ప్రారంభించానని తెలిపాడు. ఇలా డిజిటల్ బెగ్గర్ గౌతమ్ సూర్య ప్రజలనుండే కాదు యూట్యూబ్ నుండి కూడా డబ్బులు సంపాదిస్తున్నాడు... కుటుంబాన్ని ఆనందంగా చూసుకుంటున్నాడు.
అయితే గౌతమ్ సూర్య డిజిటల్ బెగ్గింగ్ పై మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూనే ఆన్లైన్ లో అడుక్కోవాలనే ఆలోచనను అద్భుతం అంటుంటే... ఇంకొందరేమో ఇలా అడుక్కోవడం కూడా ఓ క్రియేటివిటీయా అంటూ ఎగతాళి చేస్తున్నారు. గౌతమ్ సూర్య మాత్రం ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు... ఇలా చేయడంద్వారా తన కుటుంబం హాయిగా జీవిస్తోంది కాబట్టి కొనసాగిస్తానని అంటున్నాడు. 'ఏదో ఒకరోజు సొంతిల్లు కట్టుకుంటారు. అప్పుడు ఎవరూ తమను వెళ్లిపొమ్మని అనలేరు' అనేది తన యూట్యూబ్ ఛానల్ బయోగా పెట్టుకున్నాడు ఈ డిజిటల్ బెగ్గర్ గౌతమ్ సూర్య.