Customs: లక్కీ భాస్కర్ సినిమా కథ అందరికీ తెలిసిందే. విదేశాల్లో నుంచి వస్తువులను దొంగతనంగా దిగుమతి చేసుకొని దేశంలో విక్రయించడం ఈ సినిమాలో కనిపించే ఓ కీలక సన్నివేశం. అయితే తాజాగా ఇలాంటి ఘటన రియల్‌గా జరిగింది. వివరాల్లోకి వెళితే..
భూటాన్ నుంచి పన్ను ఎగవేసి 198 లగ్జరీ కార్లు భారత్‌లోకి దిగుమతి చేసినట్లు కస్టమ్స్ అధికారులు బయటపెట్టారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, సినీ తారలు, వ్యాపార ప్రముఖులు కూడా ఈ కార్లు కొనుగోలు చేసినట్లు సమాచారం. కేరళలో ఇప్పటికే 20కి పైగా వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
25
రాష్ట్రవ్యాప్తంగా కస్టమ్స్ దాడులు
కస్టమ్స్ బృందాలు కోజికోడ్, మలప్పురం జిల్లాల్లో 11 కార్లు స్వాధీనం చేసుకున్నాయి. ఈ వాహనాలను కరిపూర్ విమానాశ్రయ కస్టమ్స్ కార్యాలయానికి తరలించారు. మొత్తం కేరళలో 30 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. ఇందులో తిరువనంతపురం, ఎర్నాకులం, కోజికోడ్, మలప్పురం, కొట్టాయం జిల్లాలు ఉన్నాయి.
35
ప్రముఖుల ఇళ్లలో తనిఖీలు
సినీ నటులు పృథ్వీరాజ్, దుల్కర్ సల్మాన్ ఇళ్లలో కస్టమ్స్ దాడులు జరిగాయి. పృథ్వీరాజ్ త్రివేండ్రం, దుల్కర్ సల్మాన్ కోచి నివాసాల వద్ద అధికారులు తనిఖీలు చేశారు. మమ్ముట్టి పాత ఇల్లు, అక్కడ ఉన్న గ్యారేజీలో కూడా పరిశీలించారు. మోటార్ వెహికిల్స్ విభాగం అధికారులు కూడా వాహనాల రిజిస్ట్రేషన్ పత్రాలు, రికార్డులు పరిశీలిస్తున్నారు. అయితే వీరివద్ద ఎలాంటి అనధికారిక కార్లు లభించినట్లు అధికారులు ఇప్పటి వరకు ప్రకటించలేదు.
కస్టమ్స్ ప్రకారం, నేషనల్ టిబి ఇన్స్టిట్యూట్ డైరెక్టర్, సెంట్రల్ సిల్క్ బోర్డ్ మెంబర్ సెక్రటరీ ఇద్దరూ ఈ వాహనాలు కొనుగోలు చేశారు. వీటిలో రెండు బెంగళూరులో ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ వ్యవహారం కేవలం వ్యాపారులు, సినీ తారల వరకే కాకుండా కేంద్ర అధికారుల వరకు వెళ్లిందని స్పష్టమవుతోంది. ఈ దాడులను కస్టమ్స్ “ఆపరేషన్ నుంఖార్” పేరుతో నిర్వహిస్తోంది.
55
ఇంతకీ స్కామ్ ఎలా జరుగుతుందంటే.?
ఈ లగ్జరీ కార్ల స్కామ్‌లో సినిమాను మించిన ట్విస్టులు ఉన్నాయి. భూటాన్ ఆర్మీ వాడిన లగ్జరీ SUV లను పన్ను లేకుండా భారత్‌కి తీసుకొచ్చారు. వీటిని మొదట రహస్యంగా చెక్ పోస్టులను దాటిస్తూ భారతదేశలోకి తీసుకొస్తున్నారు. ఆ తర్వాత వీటిని హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, యూపీ వంటి ప్రాంతాల్లో తప్పుడు రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. ఆ తర్వాత ఇతర రాష్ట్రాలకు తరలించి రీ-రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఇలా వీటి వెనకాల ఒక పెద్ద నెట్‌వర్క్ పనిచేస్తుంది.
దీనివల్ల ప్రభుత్వానికి నష్టం ఏంటి.?
సాధారణంగా విదేశాల నుంచి వాహనాలు దిగుమతి చేసుకోవాలంటే 200% పన్ను చెల్లించాలి. సెకండ్ హ్యాండ్ వాహనాల దిగుమతికి కూడా దేశంలో అనుమతి లేదు. కానీ ఈ రాకెట్ పన్ను ఎగవేసి లగ్జరీ వాహనాలను భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టినట్లు కస్టమ్స్ అనుమానిస్తోంది. ఇప్పటికే కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థలు, రవెన్యూ ఇంటెలిజెన్స్ ఈ వ్యవహారంపై ఓ కన్నేసి ఉంచాయి. సాయంత్రం కోచిలో కస్టమ్స్ అధికారులు అధికారికంగా మీడియాకు వివరాలు వెల్లడించనున్నారు. దీంతో ఈ కేసుపై మరింత క్లారిటీ రానుంది.