
చంద్రుడిపై మనిషి శాశ్వతంగా నివసించగలడా? అనే ప్రశ్నలకు చాలా కాలం నుంచి సమాధానం లేదు. కానీ, శాస్త్రవేత్తలకు 2025లో జరిగిన పరిశోధనలు సరికొత్త ఆశలను కల్పిస్తున్నాయి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో మానవులు చంద్రుడిపై ఎక్కువ కాలం పాటు గడపగలిగే అవకాశం ఉందని ఈ డేటా స్పష్టం చేస్తోంది. అయితే, అక్కడ నెలకొని ఉన్న తీవ్రమైన రేడియేషన్, అతి తక్కువ గురుత్వాకర్షణ శక్తి, విపరీతమైన ఉష్ణోగ్రతలు వంటి సవాళ్లు ఇంకా పరిష్కరించాల్సి ఉంది.
ప్రస్తుతానికి చంద్రుడిపై శాశ్వత మానవ నివాసం అనేది ఒక సుదూర కలనే అయినప్పటికీ, స్వయం సమృద్ధిగా మనుగడ సాగించగలిగే ఒక లూనార్ కాలనీని ఏర్పాటు చేయడం సాధ్యమే. రోజురోజుకూ ఇది సాధ్యమయ్యే పనిలా మారుతోందని ప్రస్తుత పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈ దిశగా జరుగుతున్న పరిణామాలు మానవాళి భవిష్యత్తుపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఒకప్పుడు కేవలం ఊహలకే పరిమితమైన చంద్రుడిపై ఆవాసంఅనే ఆలోచన, నేడు శాస్త్రవేత్తలకు ఒక సీరియస్ లక్ష్యంగా మారింది. ముఖ్యంగా దీర్ఘకాలిక చంద్రయాన మిషన్లను ప్లాన్ చేస్తున్న తరుణంలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. నాసా చేపట్టిన ప్రతిష్ఠాత్మక ఆర్టెమిస్' ప్రోగ్రామ్, చైనాకు చెందిన ఇంటర్నేషనల్ లూనార్ రీసెర్చ్ స్టేషన్ వంటి ప్రభుత్వ ప్రాజెక్టులతో పాటు, ప్రైవేట్ రంగం కూడా ఇందులో విస్తృతంగా పాలుపంచుకుంటోంది.
2025లో వెలువడిన పరిశోధనల ప్రకారం, చంద్రుడిపై స్వల్పకాలిక మానవ నివాసం సాధ్యమేనని తేలింది. అయితే, శాశ్వత నివాసం మాత్రం ఇప్పటికీ ఒక సవాలుగానే మిగిలింది. ఇది కష్టసాధ్యమైనప్పటికీ, క్రమంగా వాస్తవ రూపం దాల్చుతున్న కలగా మారుతోంది. అత్యాధునిక సాంకేతికత, పకడ్బందీ ప్రణాళికలు, ప్రపంచ దేశాల మధ్య భారీ సహకారం ఉంటేనే మానవులు చంద్రుడిపై మనుగడ సాగించగలరని ఎక్కువ శాతం మంది శాస్త్రవేత్తలు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
చంద్రుడిపై జీవించడానికి ఉన్న అతిపెద్ద అడ్డంకి అక్కడి ప్రమాదకరమైన వాతావరణం. భూమికి ఉన్నట్లుగా చంద్రుడికి రక్షణ కల్పించే వాతావరణం కానీ, గ్లోబల్ మాగ్నెటిక్ ఫీల్డ్ కానీ లేవు. దీనివల్ల సూర్యుడి నుంచి వచ్చే అత్యంత తీవ్రమైన రేడియేషన్, కాస్మిక్ కిరణాలు నేరుగా చంద్రుడి ఉపరితలాన్ని తాకుతాయి. ఈ రేడియేషన్ సూర్యరశ్మి కంటే తక్కువ తీవ్రతతో ఉన్నప్పటికీ, మానవ శరీరానికి చాలా ప్రమాదకరం.
దీనిపై జరిగిన అధ్యయనాల ఫలితాల ప్రకారం, ఇటువంటి రేడియేషన్‌కు ఎక్కువ కాలం గురైతే మనిషికి క్యాన్సర్ వచ్చే ముప్పు గణనీయంగా పెరుగుతుంది. అంతేకాకుండా, మానవ శరీరంలోని డీఎన్ఏ దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. దీనికి పరిష్కారంగా, కొన్ని అధ్యయనాలు భూగర్భ ఆవాసాలను నిర్మించాలని సూచిస్తున్నాయి. లేదా, నివసించే మాడ్యూళ్లను చంద్రుడి మట్టి అయిన రెగోలిత్ పొరలతో కప్పడం ద్వారా సహజమైన రేడియేషన్ షీల్డ్‌ను ఏర్పాటు చేసుకోవచ్చని చెబుతున్నాయి.
మరో ప్రధాన సమస్య ఉష్ణోగ్రతలలో వచ్చే భారీ మార్పులు. పగటిపూట ఉష్ణోగ్రత సుమారు 120 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగితే, రాత్రిపూట అది మైనస్ 170 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతుంది. ఈ విపరీతమైన పరిస్థితులను తట్టుకోవాలంటే, అధిక ఇన్సులేషన్, ఎనర్జీ ఎఫిషియెన్సీ కలిగిన ప్రత్యేక ఆవాసాలు కావాలి.
మనిషి బ్రతకడానికి ఆక్సిజన్, నీరు, ఆహారం నమ్మకమైన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలు అత్యంత అవసరం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో జరిగిన అధ్యయనాలు, గాలి, నీటిని రీసైకిల్ చేసే క్లోజ్డ్ లూప్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ ను ఎక్కువ కాలం పాటు సమర్థంగా నిర్వహించవచ్చని నిరూపించాయి.
2026 చివరి నాటికి శాస్త్రవేత్తలు చంద్రుడి దక్షిణ ధృవంలో ఉన్నట్లు భావిస్తున్న మంచు నిల్వలను వెలికితీయగలమని నమ్మకంతో ఉన్నారు. ఇలా వెలికితీసిన నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విడదీయవచ్చు. జీవనానికి అవసరమైన ఆక్సిజన్‌ను అందించడమే కాకుండా, రాకెట్ ఇంధనంగా కూడా ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియ విజయవంతమైతే, భూమి నుంచి సరుకుల సరఫరాపై ఆధారపడటం తగ్గుతుంది. తద్వారా చంద్రుడిపై దీర్ఘకాలిక నివాసం మరింత సులభతరం అవుతుంది.
మైక్రోగ్రావిటీ లేదా తక్కువ గురుత్వాకర్షణలో మానవ ఆరోగ్యం ఎలా ఉంటుందనేది మరొక కీలకమైన ప్రశ్న. చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి భూమిలో ఆరో వంతు మాత్రమే ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కువ కాలం గడపడం వల్ల కండరాలు క్షీణించడం, ఎముకల సాంద్రత తగ్గడం, గుండె సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
దీర్ఘకాలిక మిషన్లలో పాల్గొన్న వ్యోమగాములపై చేసిన పరిశోధనల ఆధారంగా, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మెరుగైన వైద్య పర్యవేక్షణ ద్వారా ఈ ప్రభావాలను తగ్గించవచ్చని, కానీ పూర్తిగా నివారించలేమని తేలింది. అయితే, భవిష్యత్తులో అంగారక గ్రహం పైకి వెళ్లే మిషన్లకు చంద్రుడు ఒక ముఖ్యమైన స్టేజింగ్ ప్లేస్ గా ఉపయోగపడతాడని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భూమి కక్ష్యలో సాధ్యమయ్యే దానికంటే ఎక్కువ కాలం పాటు పాక్షిక గురుత్వాకర్షణకు మానవ శరీరం ఎలా అలవాటు పడుతుందో గమనించడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
2025 పరిశోధనల ప్రకారం మానవులు చంద్రుడిపై స్వల్పకాలం పాటు నివసించగలరు. అధిక సాంకేతిక, జీవశాస్త్రపరమైన ఖర్చుతో దీర్ఘకాలం కూడా ఉండగలరని స్పష్టం చేశాయి. చంద్రుడిపై శాశ్వత నివాసం కావాలంటే రేడియేషన్, అందుబాటులో ఉన్న వనరుల వినియోగం, నిరంతరం అప్డేట్ అయ్యే వైద్య విధానాలతో అక్కడి పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
స్వయం సమృద్ధి కలిగిన లూనార్ కాలనీ ఏర్పాటుకు ఇంకా రెండు దశాబ్దాల సమయం పట్టవచ్చు. కానీ, ప్రస్తుతం జరుగుతున్న శాస్త్రీయ కృషిని గమనిస్తే, భూమిని దాటి మరో గ్రహంపై జీవించాలనే మానవాళి తర్వాతి ముందడుగు కేవలం కలగా మిగిలిపోలేదని, అది అతి త్వరలో సాకారం కాబోతున్న వాస్తవమని స్పష్టమవుతోంది.