Ayodhya Ram Mandir Dhwajarohan 2025 : అయోధ్య రామమందిరంపై కాషాయ జెండా రెపరెపలాడుతోంది. ఇది సాధారణమైన జెెండా కాదు… చాలా ప్రత్యేకతలున్నాయి. ముఖ్యంగా జెండాపై ఉన్న ఆ చెట్టు ఏదో తెలుసా?
Ayodhya Ram Mandir Dhwajarohan 2025 : రామజన్మభూమి అయోధ్యలోని బాలరాముడి ఆలయంపై కాషాయజెండా రెపరెపలాడుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లు ఆలయ శిఖరంపై ప్రత్యేకమైన కాషాయ జెండాను ఎగురవేశారు... ధర్మ ధ్వజారోహన్ ఉత్సవ్ పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇలా కాషాయం జెండా ఎగరవేయడం అంటే రామమందిర నిర్మాణం ఇక పూర్తయినట్లే అని అర్థం.
బాలరాముడి ఆలయ శిఖరంపై ఎగరేసిన కాషాయ జెండా చాలా ప్రత్యేకమైనది. కేవలం ఈ జెండాను చూసేందుకు చాలా దూరం నుంచి రామభక్తులు ముందుగానే అయోధ్యకు చేరుకున్నారు. రామమందిరంపై కాషాయం జెండా ఎగరేసిన ఈ రోజును చాలా ప్రత్యేకమైందిగా భావిస్తున్నారు. ఈ క్రమంలో కాషాయ ధ్వజం ప్రత్యేకతలు తెలుసుకుందాం.
25
కాషాయ జెండాపై ఉన్న ఆ చెట్టు ఏంటి..?
అయోధ్య రామమందిరంపై ప్రధాని మోదీ ఎగరేసిన కాషాయ జెండా చాలా ప్రత్యేకంగా ఉంది. చాలా ఆలయాలపై ఎలాంటి చిహ్నాలు లేకుండా కాషాయ జెండా ఉంటుంది... లేదంటే కపిరాజు (హనుమంతుడి) తో కూడిన జెండాలుంటాయి. కానీ అయోధ్యలో మాత్రం సూర్యభగవానుడు, ఓం తో పాటు ఓ చెట్టుతో కూడిన జెండానే గర్భాలయ శిఖరంపై ఎగరేశారు.
రాముడి సూర్యవంశాన్ని సూచిక భానుడు... హిందువుల పవిత్ర శబ్దం ఓం... ఇవి అందరికీ తెలుసు. కానీ ఈ చెట్టు ఏమిటో చాలామందికి అంతుచిక్కడం లేదు. అయితే ఈ చెట్టు ప్రస్తావన రామాయణ కాలంనాటిదట... ఇది చాలా ప్రత్యేకమైందిగా తెలుస్తోంది.
అయోధ్య మందిరంపైని కాషాయ జెండాపై ఉన్నది కోవిదారు చెట్టు... దీన్ని మందార, పారిజాత మొక్కలను అంటుకట్టి కశ్యప మహాముని సృష్టించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇది చాలా పవిత్రమైన చెట్టు... రామరాజ్యంలో ఈ జెండా ఉండేదని కాళిదాసు రాసిన రామాయణంను బట్టి అర్థమవుతోంది. సీతారాములను తీసుకెళ్లడానికి భరతుడు ఈ జెండాతో కూడిన రథాన్నే తీసుకెళ్ళాడట. ఈ జెండాను దూరంనుంచి చూసి లక్ష్మణుడు సోదరుడు వస్తున్నాడని గుర్తించి అన్న శ్రీరాముడికి సమాచారం ఇచ్చినట్లుగా కాళిదాసు రామాయణంలో ఉంది.
రాముడు నడయాడిని అయోధ్యలో భవ్య రామమందిరం నిర్మించారు... కాబట్టి ఆయన కాలంనాటి కాషాయ జెండాను ఎగరవేశారు. ఈ ధ్వజారోహణం ద్వారా మళ్లీ రామరాజ్యం స్థాపిస్తున్నామనే సంకేతాన్ని దేశ ప్రజలకు ఇస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ.
35
రామమందిర ధ్వజం రంగులు, చిహ్నాల ప్రాముఖ్యత
రామమందిర శిఖరంపై ఎగురవేసిన ఈ జెండా ఆలయానికి శోభను తీసుకురావడమే కాకుండా, రామరాజ్య ఆదర్శాలైన గౌరవం, ఐక్యత, సాంస్కృతిక కొనసాగింపు సందేశాన్ని కూడా ఇస్తుంది. దీని రంగు నుంచి దానిపై ఉన్న చిహ్నాల వరకు వేర్వేరు హిందూ మతపరమైన ప్రాముఖ్యతలు ఉన్నాయి. రామమందిరంపై ఎగిరే ఈ ధ్వజం గౌరవం, ఐక్యత, సాంస్కృతిక కొనసాగింపు సందేశాన్ని ఇస్తుంది. దీన్ని రామరాజ్య ఆదర్శాలకు ప్రతీకగా భావిస్తారు.
రామమందిర శిఖరంపై ఎగురవేసిన ధ్వజాన్ని గుజరాత్‌కు చెందిన 6 మంది కళాకారులు 25 రోజుల్లో తయారు చేశారు. దీని కర్రకు 21 కిలోల బంగారం తాపడంతో చేశారు. ఈ ధ్వజం 4 కిలోమీటర్ల దూరం నుంచి కూడా కనిపించేంత పెద్దది. ఈ ధర్మధ్వజం భయంకరమైన తుపానులో కూడా సురక్షితంగా ఉంటుంది. గాలి దిశ మారినప్పుడు ఇది చిక్కుకోకుండా తిరిగిపోతుంది. తీవ్రమైన ఎండ లేదా భారీ వర్షం వచ్చినా, ఈ జెండా అన్ని రకాల వాతావరణాన్ని సులభంగా తట్టుకోగలదు... ఎందుకంటే ఇందులో ఏవియేషన్-గ్రేడ్ పారాచూట్ నైలాన్, పట్టు ఉన్నాయి.
55
22 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పు
అయోధ్య రామమందిర శిఖరంపై ఏర్పాటు చేస్తున్న ఈ ధ్వజం మొత్తం ఎత్తు 191 అడుగులు. ఇందులో 161 అడుగుల ఆలయ ప్రధాన శిఖరం ఎత్తు కూడా ఉంది. ఈ ధ్వజం 22 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పుతో 2 నుంచి 3 కిలోగ్రాముల బరువు ఉంటుందని సమాచారం. ఈ జెండాను మార్చేందుకు రామమందిర శిఖరంపైకి వెళ్లాల్సిన అవసరం లేదు... కిందనుండే దాన్ని స్థానాన్ని చేర్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీ ఇలాగే జెండాను రామమందిరంపైకి చేర్చారు.