బద్ధలైన ఇథియోపియా అగ్నిపర్వతం: భారత్ పై ఎఫెక్ట్ ఎందుకు? విమానయాన సంస్థలు అలర్ట్‌

Published : Nov 24, 2025, 09:24 PM IST

Ethiopia Volcano: ఇథియోపియాలోని హైలీ గుబ్బి అగ్నిపర్వతం బూడిద భారత్ పై ప్రభావితం చూపుతోంది. ముఖ్యంగా వైమానిక ప్రయాణాన్ని ప్రభావితం చేస్తోంది. గుజరాత్ నుంచి ఢిల్లీ వరకు ఫ్లైట్ మార్గాల్లో మార్పులు జరిగాయి. కారణమేంటో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
Ethiopia Hayli Gubbi Volcano భారత్ పై ఎందుకు ప్రభావం చూపిస్తోంది?

ఇథియోపియాలో ఉన్న హైలీ గుబ్బి అగ్నిపర్వతం వేల సంవత్సరాల తర్వాత  బద్దలైంది. ఈ అగ్నిపర్వతం బద్దలుకావడంతో భారీ బూడిద, పొగ భారత వైమానిక రూట్ల వైపు కదులుతున్నట్లు ముందస్తు అంచనాలు సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత డీజీసీఏ అత్యవసర సూచనలు జారీ చేసింది. విమానయాన సంస్థలు అప్రమత్తమైన వెంటనే తమ రూట్లను మార్చుకోవాలని ఆదేశించింది. ప్రయాణికుల భద్రత కోసం చర్యలు తీసుకోవాలని తెలిపింది.

డీజీసీఏ స్పష్టమైన హెచ్చరికలతో పాటు, ఇంజిన్ పనితీరు లోపాలు, కేబిన్‌లో పొగ లేదా విచిత్ర వాసన వంటి పరిస్థితులు కనిపిస్తే వెంటనే నివేదించాలని సూచించింది. విమానాశ్రయాలకు కూడా రన్‌వే పరిస్థితులను పరిశీలించి, అవసరమైనప్పుడు ఫ్లైట్ ఆపరేషన్లను నిలిపివేయాలని ఆదేశించింది.

ప్రమాదకరమైన బూడిద మేఘాలు ఇప్పటికే యెమెన్, ఒమన్ మీదుగా భారత్ వైపు కదులుతున్నాయని వైమానిక పర్యవేక్షణ కేంద్రాలు తెలిపాయి. అంచనా ప్రకారం, ఇవి 12 గంటల్లోనే వాయువ్య, మధ్య భారత ప్రాంతాలను చేరే అవకాశం ఉంది.

25
గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ, ఎన్సీఆర్ వైపు దూసుకొస్తున్న బూడిద

వాతావరణ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం, ఇథియోపియా అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న బూడిద మేఘాలు సోమవారం రాత్రి భారత వాయువ్య రాష్ట్రాలపై ప్రభావం చూపనున్నాయి. ఇవి మొదట గుజరాత్‌ను తాకి, తరువాత రాజస్థాన్, ఢిల్లీ, ఎన్సీఆర్, పంజాబ్ ప్రాంతాల దిశగా ముందుకు సాగనున్నాయని అంచనా వేశారు.

ఈ బూడిద 10 నుంచి 15 కి.మీ ఎత్తులో ప్రయాణిస్తోంది. ఈ ఎత్తుల్లో వాణిజ్య విమానాలు సాధారణంగా ప్రయాణిస్తాయి. అందువల్ల విమాన ప్రయాణాలు సహజంగానే ప్రభావితం అవుతాయి. “ఈ ప్రభావం నేలపై చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఆకాశం మబ్బుల్లా కనిపించడం, తక్కువ ఉష్ణోగ్రతలు, పెరుగుదల వంటి ప్రభావాలు కనిపిస్తాయి” అని ఐఎండీ డైరెక్టర్ జనరల్ ఎం. మోహపాత్ర తెలిపారు.

35
విమానాల రద్దు, మార్గాల్లో మార్పులు

ఇథియోపియా హైలీ గుబ్బి అగ్నిపర్వతం నుంచి వస్తున్న బూడిద మేఘాలు రెడ్ సీ దాటి మధ్యప్రాచ్యం వైపు కదిలిన వెంటనే భారత విమానయాన సంస్థలు ఫ్లైట్లను రద్దు చేయడం, మార్గాలు మార్చడం ప్రారంభించాయి. ఇండిగో ఇప్పటికే ఆరు ఫ్లైట్లు రద్దు చేసింది. వాటిలో ఒకటి ముంబై నుంచి బయలుదేరినదని అధికారులు తెలిపారు.

కన్నూరు-అబుదాబి 6E 1433 ఫ్లైట్ సోమవారం మధ్యాహ్నం అహ్మదాబాద్ వైపు మళ్లించారు. అబుదాబిలో దిగిన మరో భారతీయ విమానానికి ఇంజిన్ తనిఖీలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ గగనతలం భారత ఫ్లైట్లకు మూసివేసిన కారణంగా, మార్గాల మార్పులు మరింత సంక్లిష్టంగా మారాయని సమాచారం.

మంగళవారం ఈ ప్రభావం మరింత తీవ్రమవుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే పరిస్థితులు నిరంతరం పర్యవేక్షణలో ఉన్నాయని తెలిపారు.

45
బూడిద, సల్ఫర్ డయాక్సైడ్‌తో విస్తరించిన మేఘాలు

ఇథియోపియా హైలీ గుబ్బి అగ్నిపర్వతం సుమారు 12,000 సంవత్సరాల తర్వాత విస్ఫోటం చెందడం ప్రపంచ శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది. 10 నుంచి 15 కి.మీ ఎత్తుకు బూడిద, పొగ ఎగసిపడినట్లు టూలూస్ అశ్ అడ్వయిసరీ సెంటర్ వెల్లడించింది. యెమెన్, ఒమన్, భారత్, ఉత్తర పాకిస్తాన్ వైపు బూడిద మేఘాలు ప్రయాణిస్తున్నాయి.

ఒమన్ పర్యావరణ సంస్థలు పర్యవేక్షణ స్టేషన్ల ద్వారా గాలి నాణ్యతను పరిశీలిస్తున్నాయి. ఇప్పటివరకు భారీ కలుషితాలను గుర్తించలేదు. నఖీ అనే ప్లాట్‌ఫారమ్ ద్వారా అక్కడి ప్రజలకు రియల్ టైం గాలి నాణ్యత సమాచారం అందిస్తున్నారు.

55
ఢిల్లీ ఎన్సీఆర్ ఇప్పటికే కాలుష్యం.. బూడిద ప్రభావంతో మరింత దెబ్బ?

ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం 4 గంటలకు AQI 382 వద్ద నమోదు అయ్యింది. ఘాజియాబాద్, నోయిడా, గ్రేటర్ నోయిడాలో 390ల దగ్గరే ఉంది. బూడిద మేఘాలు ఈ ప్రాంతాల్లోకి వస్తే కాలుష్యం మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంటున్నారు. అయితే అది నేలస్థాయిలో ఎంత ప్రభావం చూపుతుందో ఇంకా స్పష్టత లేదు.

వాతావరణ విశ్లేషకుల ప్రకారం.. బూడిద మేఘాలు గంటకు 100 నుంచి 120 కి.మీ వేగంతో భారత్ వైపు కదులుతున్నాయి. ఇవి 15,000 నుంచి 45,000 అడుగుల ఎత్తుల్లో ప్రయాణిస్తున్నాయి. దీంతో ఆకాశం మరింత నల్లబడే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories