
మనలో చాలామంది అన్నం వండేటప్పుడు వచ్చే గంజి నీటిని వృథాగా కింద పారబోస్తాం. కానీ, ఇదే గంజిని బెంగాలీ ఇళ్లలో ఆహారంగా, ఆకలి తీర్చే పానీయంగా, వంటలో ఒక ముఖ్యమైన వస్తువుగా ఎలా వాడతారో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
బియ్యంలో నీళ్లు పోసి ఉడికించినప్పుడు, అందులో ఉండే పిండి పదార్థాలు నీళ్లలో కలిసిపోతాయి. దీంతో అన్నం వంచిన తర్వాత వచ్చే నీళ్లు తెల్లగా, కొద్దిగా జిగటగా ఉంటాయి. దీన్నే మనం గంజి అంటాం. బియ్యం రకం, వండేటప్పుడు పోసే నీళ్ల పరిమాణం, ఎంతసేపు ఉడికిస్తున్నాం అనేదాన్ని బట్టి గంజి చిక్కదనం మారుతుంది. తినే ఆహారం విషయంలో బెంగాలీ వంటలకు సెపరేట్ ఫ్యాన్సే ఉన్నారు. వాళ్లు ఇళ్లలో ఈ గంజికి చాలా కాలంగా ప్రాముఖ్యత ఉంది. ఈ విషయంపై ఫుడ్కా సంస్థ వ్యవస్థాపకుడు, రచయిత, కల్చరల్ స్టోరీటెల్లర్ ఇంద్రజిత్ లాహిరి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.
చాలా బెంగాలీ ఇళ్లలో అన్నం వంచిన గంజి వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా ఉప్పు వేసుకుని తాగే అలవాటు ఉంది. తక్కువ ఖర్చుతో తయారయ్యే ఈ ఆహారం కడుపు నింపడమే కాకుండా శరీరానికి కావాల్సిన పిండి పదార్థాలను ఇస్తుంది. ముఖ్యంగా శారీరక శ్రమ ఎక్కువగా చేసే వాళ్లకు ఇది వెంటనే శక్తినిచ్చే ఆహారంగా పనిచేస్తుంది. దీని కోసం మళ్లీ విడిగా ఆహారం వండాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా, అనారోగ్యంతో అన్నం తినలేని వాళ్లకు లేదా ఆకలి లేని వాళ్లకు గంజిని సులభమైన ఆహారంగా ఇచ్చేవారు. ఇదేదో అద్భుతమైన హెల్త్ డ్రింక్ అని చెప్పలేం. ఎక్కువగా నీళ్లు, పిండి పదార్థాలు ఉండే దీని పోషక విలువ, తయారుచేసే విధానాన్ని బట్టి మారుతుంది. అయినా, సులభమైన ఆహారానికి ప్రాధాన్యత ఇచ్చే సంప్రదాయ వంటల్లో దీనికి ప్రత్యేక స్థానం ఉంది.
గంజిని వంటల్లో వాడటం మరో ఆసక్తికరమైన విషయం. ఇందులో ఉండే సహజమైన పిండి పదార్థం, వంటకాలకు కొద్దిగా చిక్కదనాన్ని, అన్నీ కలిసిపోయేలా చేయడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా కొన్ని రకాల కూరలు, గ్రేవీ, లిక్విడ్ ఫుడ్స్ తయారుచేసేటప్పుడు వేరే చిక్కబరిచే పొడులు కలపకుండా, గంజిని వాడొచ్చు. దీని వల్ల వంటకం రుచి పెరగడమే కాకుండా, వంటలో మిగిలిన పదార్థాన్ని మళ్లీ వాడుకునే అవకాశం దొరుకుతుంది. సంప్రదాయ వంటల్లో ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ చాలా ఉన్నాయి.
ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. అప్పుడే వంచిన గంజికి, ఎక్కువ సేపు ఉంచి పులియబెట్టిన అన్నం నీళ్లకు తేడా ఉంటుంది. గంజిని ఎక్కువ సేపు బయట ఉంచితే, అందులోని బ్యాక్టీరియా వల్ల వాసన, పులుపుదనం, గుణం మారొచ్చు. కానీ, అన్ని గంజి నీళ్లు వాటంతట అవే సురక్షితంగా పులిసిపోతాయని చెప్పలేం. సరిగ్గా నిల్వ చేయని గంజిలో హాని కలిగించే బ్యాక్టీరియా పెరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి, ఎక్కువ సేపు గది ఉష్ణోగ్రత వద్ద ఉంచిన గంజిని అలాగే తాగకపోవడం మంచిది.
ఈ రోజుల్లో ఫుడ్ వేస్టేజ్ తగ్గించడం, పర్యావరణాన్ని కాపాడటం లాంటి వాటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. కానీ, ఇవన్నీ మన పూర్వీకుల రోజువారీ వంట అలవాట్లలోనే సహజంగా ఉన్నాయి. కూరగాయల తొక్కల నుంచి అన్నం వంచిన గంజి వరకు దొరికే ప్రతి వస్తువును వృథా చేయకుండా వాడే అలవాటు చాలా సంప్రదాయ వంట పద్ధతుల్లో కనిపిస్తుంది. అలా చూస్తే, అన్నం వంచిన తర్వాత మిగిలే గంజిని కేవలం చెత్తగా చూడకుండా, దాని ఉపయోగాలు తెలుసుకుని సరిగ్గా వాడితే ఆహారం వృథా కాకుండా ఆపొచ్చు. మన వంటింట్లో ఉండే చిన్న విషయాల్లో కూడా ఎంత పెద్ద సంప్రదాయ జ్ఞానం దాగి ఉందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ!