ఈ రెండూ ఎలా పని చేస్తాయంటే...
బేకింగ్ సోడా అనేది చాలా శక్తివంతమైనది. బేకింగ్ పౌడర్ కంటే ఇది 3-4 రెట్లు ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఆమ్లం కలిపిన వెంటనే ఇది పనిచేయడం మొదలవుతుంది. కాబట్టి దీన్ని చాలా తక్కువగా అంటే చిటికెడు లేదా పావు స్పూన్ మాత్రమే వాడాలి. అలాగే బేకింగ్ సోడా వేసిన పిండిని ఎక్కువసేపు బయట ఉంచకూడదు, వెంటనే వండేయాలి. లేదంటే పిండి పాడైపోతుంది.
బేకింగ్ పౌడర్ విషయానికి వస్తే, ఇది బేకింగ్ సోడాతో పోలిస్తే కాస్త మృదువైనది. తడి తగిలినప్పుడు ఒకసారి, వేడి తగిలినప్పుడు మరోసారి ఇది పొంగుతుంది. దీన్ని కాస్త ఎక్కువ పరిమాణంలో అంటే 1 టీస్పూన్ వరకు వాడవచ్చు. వేడి తగిలినప్పుడే ఇది పూర్తిగా పనిచేస్తుంది కాబట్టి కాస్త సమయం తీసుకున్నా పర్వాలేదు.
మన రోజువారీ వంటల్లో వేసే బజ్జీలు, బోండాలు, పకోడీలు క్రిస్పీగా, గుల్లగా రావడానికి; ఇడ్లీ, దోశ పిండి త్వరగా పులియడానికి; శనగలు, రాజ్మా వంటివి త్వరగా ఉడకడానికి, పెరుగు లేదా మజ్జిగ వాడి చేసే బనానా బ్రెడ్, చాక్లెట్ కేకులు, కుకీల తయారీలో బేకింగ్ సోడాను వాడాలి.
ఎలాంటి పులుపు పదార్థాలు వాడకుండా కేవలం పాలు, గుడ్లు, మైదాతో చేసే స్పాంజ్ కేకులు, కప్ కేకులు, మఫిన్స్ మెత్తగా పొంగడానికి; అలాగే పాన్‌కేక్స్, వాఫిల్స్ , బిస్కెట్ల తయారీలో బేకింగ్ పౌడర్‌ను వాడాలి.